కల నిజమైంది

ABN , First Publish Date - 2022-08-11T08:40:20+05:30 IST

దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత హైదరాబాద్‌ నుంచి మరో టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ పుట్టుకొచ్చింది.

కల నిజమైంది

ఆంధ్రజ్యోతితో ‘కామన్వెల్త్‌’ విజేత ఆకుల శ్రీజ


ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి (హైదరాబాద్‌): దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత హైదరాబాద్‌ నుంచి మరో టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ పుట్టుకొచ్చింది. టీటీ దిగ్గజం మీర్‌ ఖాసిమ్‌ అలీ తర్వాత తొలిసారి నేషనల్‌ చాంపియన్‌ టైటిల్‌ను భాగ్యనగరానికి తీసుకొచ్చిన ఆ యువ కెరటం ఇప్పుడు బర్మింగ్‌హామ్‌ నుంచి కామన్వెల్త్‌ పసిడి కాంతులను మోసుకొచ్చింది. మనికా బాత్రా, మౌమాదాస్‌ వంటి సీనియర్ల పోటీని తట్టుకుని భారత కామన్వెల్త్‌ బృందంలో చోటు కొట్టేసిన ఈ శివంగి మహిళల సింగిల్స్‌లో త్రుటిలో పతకం కోల్పోయినా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ కమల్‌తో కలిసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. స్వల్ప విరామానంతరం మిషన్‌ ఒలింపిక్స్‌ను మొదలెట్టేస్తానంటున్న రైజింగ్‌ స్టార్‌ ఆకుల శ్రీజతో ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..


కామన్వెల్త్‌ విజయంపై..

 సింగిల్స్‌లో చేజారినా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ అన్నతో కలిసి గోల్డ్‌ మెడల్‌ నెగ్గడం నా జీవితంలోనే ఒక పెద్ద మైలురాయి. పతకం కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నా. పతకం సాధించగానే అమ్మానాన్నకు ఫోన్‌ చేసి మన కల నిజమైందని చెప్పా. నా కోసం వాళ్లు ఇన్నేళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం ఇది. ఈ గెలుపు వారికే అంకితం.


సింగిల్స్‌లో పతకం చేజారడంపై...

ఆ బాధను మాటల్లో చెప్పలేను. ఒలింపియన్‌, మాజీ వరల్డ్‌ చాంపియన్‌ కావడంతో యాంగ్‌జి లియుపై నెగ్గేందుకు పకడ్బందీగా సిద్ధమయ్యా. ఆమె ఆడిన పాత మ్యాచ్‌ల వీడియోలు చూసి తన బలాబలాలను, లోపాలను కోచ్‌తో కలిసి అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యా. నా ప్రణాళిక ప్రకారం కొంతమేర సఫలమైనా.. చివరకు గెలవలేకపోయా. అంత కష్టపడ్డా మ్యాచ్‌ చేజారడంతో బోరున ఏడ్చేశా. వెంటనే తేరుకొని సాయంత్రం జరిగే మిక్స్‌డ్‌ మ్యాచ్‌ గురించి ఆలోచించా.


మిక్స్‌డ్‌ ఫైనల్‌ ఎలా సాగిందంటే.. 

కామన్వెల్త్‌ క్రీడలకు ముందు ఏర్పాటు చేసిన జాతీయ శిబిరం నుంచి శరత్‌ అన్నతో స్నేహం పెరిగింది. సింగిల్స్‌  ఓడిన రోజు సాయంత్రమే మిక్స్‌డ్‌ ఫైనల్‌ ఉండడంతో ఎలా ఆడతానోనని శరత్‌ అన్న అనుకున్నారట. అయితే, ఫైనల్‌ మొదలైన కాసేపటికి ‘సూపర్‌ కమ్‌ బ్యాక్‌. ఇలాగే ఆడు. పతకం మనదే’ అని అన్న ప్రోత్సహించాడు. చివరకు పత కం నెగ్గాక శరత్‌ అన్న..‘ఈ మెడల్‌ నీదే చాంపియన్‌’ అని అనడం చాలా సంతోషాన్నిచ్చింది. 


తదుపరి ప్రణాళికలేంటి?

ఈ నెలాఖరులో చెక్‌ రిపబ్లిక్‌, వచ్చే నెల ప్రారంభంలో ఒమన్‌ టోర్నీలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే నెలాఖరున చైనాలో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప జరగనుంది. ప్రస్తుతం ఫోకస్‌ దానిపైనే. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఇక నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్లు ఆడతా. అప్పుడే పారిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యాన్ని చేరుకోగలను. 


‘ప్రభుత్వం సాయమందించాలి’

నేను ప్రైవేట్‌ ఉద్యోగిని. నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రం, దేశం గర్వించేలా నా బిడ్డను తయారు చేయాలని సంకల్పించి ఇక్కడి వరకు తీసుకొచ్చా. ఇకనుంచి ప్రభుత్వం సహకారమందిస్తే శ్రీజ ఇంకా మెరుగ్గా రాణిస్తుంది. 

- ప్రవీణ్‌ 

(శ్రీజ తండ్రి)

Updated Date - 2022-08-11T08:40:20+05:30 IST