హేమంతం

ABN , First Publish Date - 2021-01-13T06:14:44+05:30 IST

చలి దుప్పటి కప్పుకున్న హేమంతం నీరెండ మొగ్గలలో విచ్చుకుంటోంది..

హేమంతం

చలి దుప్పటి కప్పుకున్న హేమంతం

నీరెండ మొగ్గలలో విచ్చుకుంటోంది..

మార్గశిర పుష్యమిల ఆలింగనంతో

కాలుష్యమైన ప్రేమానురాగాల పిడకలు భోగిమంటలకు నైవేద్యమిచ్చి 

పరహితంకై నిస్వార్థంగా మేలుకొలుపుతో

స్వాగతం పలుకుతోంది!


ఆకాశతీరమంత వాకిలి ముంగిలిలో వాలినట్టు, 

ముత్యాలముగ్గులతో సందడి చేస్తోంది

నెలవంక ఓరచూపులతో

పల్లె సోయగాలు సింగారించుకొని పరవశిస్తోంది!

రేపటి ఆశల గాలిపటాలతో

మనిషి మనస్సు 

పక్షిలా రెక్కలు చాచుకుని ఎగురుతోంది


నిగూఢమైన నిరాశానిస్పృహలను

పారద్రోలి క్రాంతిపథంలోకి

అడుగులేయాలని..

సంక్రాంతి పట్టుచీరలో ముస్తాబై వస్తోంది

పాడిపంటల పొంగులతో

పసిపాపల నవ్వులతో

కొత్తమట్టి గింజల పరిమళాలతో

అడుగుపెడుతోంది –

కమ్మని సూర్యోదయాన్ని వెంటేసుకొని

చక్కెరపొంగలిలా!!

రవీందర్ కొండ

Updated Date - 2021-01-13T06:14:44+05:30 IST