విప్రో వేతన బొనాంజా.. సెప్టెంబరు 1 నుంచి జీతాల పెంపు

ABN , First Publish Date - 2021-06-19T05:47:11+05:30 IST

దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో తన జూని యర్‌ సిబ్బందికి ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్‌ మేనేజర్‌, అంతకంటే కింది స్థాయి

విప్రో వేతన బొనాంజా.. సెప్టెంబరు 1 నుంచి జీతాల పెంపు

సెప్టెంబరు 1 నుంచి  జూనియర్‌ సిబ్బందికి జీతాల పెంపు 

కంపెనీలోని 80% ఉద్యోగులకు లబ్ధి 

ఈ ఏడాదిలో ఇది రెండో హైక్‌ 


న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో తన జూని యర్‌ సిబ్బందికి ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్‌ మేనేజర్‌, అంతకంటే కింది స్థాయి (బ్యాండ్‌ బీ3 వరకు) ఉద్యోగులు వేతన పెంపునకు అర్హులని కంపెనీ పేర్కొంది. తద్వారా కంపెనీలో కనీసం 80 శాతం ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. ఈ ఏడాదిలో విప్రో జీతాలు పెంచడం ఇది రెండోసారి. ఈ జనవరిలోనూ జూనియర్‌ ఉద్యోగులకు జీతాలు పెంచింది. గతంలో ప్రకటించిన ప్రకారం.. మేనేజర్లు, అంతకు పైస్థాయి (సీ1, ఆపై బ్యాండ్లు) ఉన్నతోద్యోగుల్లో అర్హులందరికీ జూన్‌ 1 నుంచి వేతనాలు పెరగనున్నాయని విప్రో స్పష్టం చేసింది. ఆఫ్‌షోర్‌ ఎంప్లాయి్‌సకి సగటు వేతన పెంపు గరిష్ఠ ఏక అంకె స్థాయిలో, ఆన్‌సైట్‌ సిబ్బందికి మధ్యస్థ ఏక అంకె స్థాయిలో ఉండనుందని కంపెనీ పేర్కొంది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అధికంగా పెంచనున్నట్లు తెలిపింది.


బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విప్రో.. సాధారణంగా ప్రతి యేటా జూన్‌లో ఉద్యోగుల జీతాలు పెంచుతుంది. కరోనా సంక్షోభం కారణంగా గత ఏడాది నిలిపివేసిన జీతాల పెంపును జనవరిలో అమలు చేసింది. తాజాగా మరోసారి ప్రకటించింది. ఒకే ఏడాదిలో రెండు సార్లు జీతాలు పెంచిన రెండో ఐటీ కంపెనీ విప్రోయే. టీసీఎస్‌ సైతం ఈ ఏడాదిలో సిబ్బంది వేతనాలను రెండు సార్లు పెంచింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి విప్రోలో 1,97,712 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాదిలో కంపెనీ కొత్తగా 18,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉంది. 



Updated Date - 2021-06-19T05:47:11+05:30 IST