ఉద్యోగులకు విప్రో షాక్‌

ABN , First Publish Date - 2022-08-19T05:52:10+05:30 IST

దేశీయ ఐటీ సంస్థ విప్రో తన ఉద్యోగులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. వారికి ‘వేరియబుల్‌ పే’ (పనితీరు ఆధారిత చెల్లింపులు) నిలిపివేసింది. లాభాల మార్జిన్లపై ఒత్తిడితో పాటు నిపుణులు ఆశించిన మేరకు పనితీరు కనబర్చకపోవడం, సాంకేతిక..

ఉద్యోగులకు విప్రో షాక్‌

వేరియబుల్‌ పే నిలిపివేత

మార్జిన్లపై ఒత్తిడే కారణం


న్యూఢిల్లీ: దేశీయ ఐటీ సంస్థ విప్రో తన ఉద్యోగులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. వారికి  ‘వేరియబుల్‌ పే’ (పనితీరు ఆధారిత చెల్లింపులు) నిలిపివేసింది. లాభాల మార్జిన్లపై ఒత్తిడితో పాటు నిపుణులు ఆశించిన మేరకు పనితీరు కనబర్చకపోవడం, సాంకేతిక పెట్టుబడులను ఇందుకు కారణంగా పేర్కొనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మేనేజర్‌ స్థాయి నుంచి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు వేరియబుల్‌ చెల్లింపులను ఈసారి పూర్తిగా నిలిపివేసిన విప్రో.. ఫ్రెషర్ల నుంచి టీమ్‌లీడర్‌ స్థాయి వరకు 70 శాతం చెల్లింపులు జరపనున్నట్లు సిబ్బందికి పంపిన ఈ-మెయిల్‌లో వెల్లడించింది.


ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి విప్రో కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 21 శాతం తగ్గి రూ.2,563.6 కోట్లకు పరిమితమైంది. ఐటీ సేవల విభాగ నిర్వహణ లాభా ల మార్జిన్‌ మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గి 15 శాతానికి పడిపోయింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని సంస్థ వెల్లడించింది. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగులకు సీటీసీ (కాస్ట్‌ టు కంపెనీ)లో భాగంగా వేరియబుల్‌ పే ఆఫర్‌ చేస్తాయి. వ్యక్తిగత, టీమ్‌ పనితీరు, కంపెనీల లాభాల ఆధారంగా చెల్లించే కొంత భాగాన్నే వేరియబుల్‌ పే అంటారు. సాధారణంగా కంపెనీలు ప్రతి త్రైమాసికం లేదా ఏడాదికోసారి వేరియబుల్‌ చెల్లింపులను జరుపుతుంటాయి. 

Updated Date - 2022-08-19T05:52:10+05:30 IST