నందిగామ పోలీసుల అదుపులో వైరా దోపిడీ దొంగలు ?

ABN , First Publish Date - 2021-02-28T05:03:44+05:30 IST

ఖమ్మం జిల్లా వైరాలోని ద్వారకానగర్‌లో శుక్రవారం రాత్రి దోపిడీకి పాల్పడిన దొంగలు ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వైరలో సినీపక్కీలో భారీ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. నందిగామ పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు దొంగలు రాజస్థాన్‌కు చెందినవారేనని సమాచారం.

నందిగామ పోలీసుల అదుపులో వైరా దోపిడీ దొంగలు ?

భారీగా నగదు, అభరణాలతో పట్టుబడ్డ ఇద్దరు నిందితులు

కొనసాగుతున్న విచారణ

వైరా, ఫిబ్రవరి 27: ఖమ్మం జిల్లా వైరాలోని ద్వారకానగర్‌లో శుక్రవారం రాత్రి దోపిడీకి పాల్పడిన దొంగలు ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వైరలో సినీపక్కీలో భారీ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. నందిగామ పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు దొంగలు రాజస్థాన్‌కు చెందినవారేనని సమాచారం. బాధితుడి షాపులో పనిచేస్తున్న ఇద్దరు వర్కర్లు ఇచ్చిన సమాచారం, సహకారంతోనే రాజస్థాన్‌ నుంచి వచ్చిన ఇద్దరు పక్కాప్రణాళికతో దోపిడీ చేసినట్లు తెలిసింది. వైరాలో దోపిడీ చేసిన సొమ్ముతో  పారిపోతున్న సమయంలో ఖమ్మం జిల్లా వైరా పోలీస్‌ సబ్‌డివిజన్‌లోని మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న దేశినేనిపాలెం గ్రామం, ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద ఇద్దరు దొంగలు పట్టుబడినట్లు సమాచారం. వైరాలోని ద్వారకానగర్‌లో డుంగారామ్‌ అనే వృద్ధుడిని చితకబాది తాళ్లతో కట్టివేసి నగదు, బంగారు తీసుకొని ఆ ఇద్దరు ఉడాయించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు నందిగామ పోలీసులకు పట్టుబడిన నిందితుల వద్ద సుమారు రూ.37లక్షల నగదు, రూ.ఆరేడులక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిసింది. జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద నందిగామ పోలీసులు మద్యం అక్రమ రవాణాకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ ఇద్దరు పట్టుబడినట్లు సమాచారం. ఒక ఆటోలో కొంతమంది మహిళా ప్రయాణీకులతో కలిసి నందిగామ వెళ్తున్న ఆ ఇద్దరి వద్ద ఉన్న ఇనుపడబ్బాను పపోలీసులు తనిఖీ చేయగా అందులో నగదు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దాంతో వాటికి సంబంధించిన వివరాలు కోరగా వారు చెప్పకపోవడంతో వెంటనే అక్కడి పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారిని నందిగామ తరలించినట్లు తెలిసింది. 

దుకాణంలో పనిచేసేవారిపైనే

వైరాలో ఈ దోపిడీ జరిగిన వెంటనే వైరా ఏసీపీ కె.సత్యనారాయణ, సీఐ జె.వసంతకుమార్‌ తమ సబ్‌డివిజన్‌ పరిధిలోని మధిరసహా అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపుచర్యలు చేపట్టారు. వైరా ఎస్‌ఐ వి.సురేష్‌, సిబ్బంది సంఘటనాస్థలంలో అన్నివివరాలు సేకరించారు. ఈలోగానే ఆ ఇద్దరు దొంగలు వైరా నుంచి మధిర చేరుకొని అక్కడి నుంచి ఆటోలో నందిగామ వెళ్తుండగా జొన్నలగడ్డ వద్ద అక్కడి పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. నందిగామ నుంచి విజయవాడ చేరుకొని రాజస్థాన్‌కు వెళ్లేందుకు కూడా వారు ముందుగానే ప్రణాళిక రూపొందించుకున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లో ఉన్న తమ భూములను విక్రయించగా వచ్చిన సొమ్మును డుంగారామ్‌ అతడి కుమారులు వైరాలో తాము ఉంటున్న ఇంటికి తీసుకువచ్చి భద్రపరిచారు. తమ తండ్రి డుంగారామ్‌తో కలిసి కుమారులు దిలీప్‌, మహేంద్ర ఒక ఎలక్ర్టికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. నెలరోజుల క్రితం రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వర్కర్లు వీరి దుకాణంలో పనిలో చేరారు. ఆ ఇద్దరిని అనుమానితులుగా భావించి వైరా పోలీసులు శనివారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వైరా దోపిడీ దొంగలను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే వైరా పోలీసులు నందిగామ వెళ్లారు. తర్వాత వైరా సీఐ జె.వసంతకుమార్‌, ఎస్‌ఐ వి.సురేష్‌ కూడా నందిగామ చేరుకొని అక్కడి పోలీసులతో చర్చించారు. ఖమ్మం జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు కృష్ణాజిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనకు సంబంధించి పరస్పరం సమాచారం, సహకారంపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వైరా ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ వసంతకుమార్‌, ఎస్‌ఐ సురేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-02-28T05:03:44+05:30 IST