వైర్‌లెస్‌ చార్జింగ్‌ అపోహలు - వాస్తవాలు

ABN , First Publish Date - 2021-04-10T05:58:58+05:30 IST

ఇప్పుడు వైర్‌లెస్‌ చార్జింగ్‌ న్యూ ట్రెండ్‌. ఒక మాదిరి స్మార్ట్‌ ఫోన్‌లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఇండియా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో స్మార్ట్‌ చార్జర్‌ అనేది పెద్దగా ప్రభావం చూపదనే భావిస్తున్నారు

వైర్‌లెస్‌ చార్జింగ్‌ అపోహలు - వాస్తవాలు

ఇప్పుడు వైర్‌లెస్‌ చార్జింగ్‌ న్యూ ట్రెండ్‌. ఒక మాదిరి స్మార్ట్‌ ఫోన్‌లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.  ఇప్పటి వరకు అయితే ఇండియా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో స్మార్ట్‌ చార్జర్‌ అనేది పెద్దగా ప్రభావం చూపదనే భావిస్తున్నారు. నిజానికి వైర్‌లెస్‌ చార్జింగ్‌ అంటే దీనికోసం ప్రత్యేకంగా  అడాప్టర్‌  కొనుక్కోవాలి. అంతేకాకుండా వైర్డ్‌ చార్జింగ్‌తో పోల్చుకుంటే ఈ పద్ధతిలో వేగం ఉండదు. పైపెచ్చు భారతదేశంలోని వినియోగదారులు ఈ సరికొత్త ఎకోసిస్టమ్‌కు ఇంకా అలవడలేదు. 


ఇప్పటికీ పబ్లిక్‌ ప్రదేశాల్లో, మెట్రో తదితరాల్లో చార్జింగ్‌ కోసం యుఎస్‌బి పోర్టులు, సాకెట్లు ఉంటాయి. అలాగే వైర్‌లెస్‌ చార్జింగ్‌ అంటే కేబుల్‌తోపాటు అడాప్టర్‌ను కూడా వెంట తీసుకు వెళ్ళాల్సి వస్తుంది. అదో భారమని కూడా  వినియోగదారులు భావిస్తుండటం గమనార్హం. వైర్‌లెస్‌ చార్జింగ్‌ పెరుగుతున్నప్పటికీ దీని విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.  అవేమిటో తెలుసుకుందాం.


వైర్‌లెస్‌ చార్జింగ్‌తో బ్యాటరీ జీవితకాలం దెబ్బతింటుంది

బ్యాటరీ జీవితకాలం(హెల్త్‌) దెబ్బతింటుంది అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి రెగ్యులర్‌ చార్జింగ్‌ అడాప్టర్లతోనే రిస్క్‌ ఉంది. లోపాలు ఉన్న సాకెట్లు, కేబుల్స్‌ పోర్ట్స్‌ లేదా ప్రమాదవశాత్తు నీరు చిందడంతోనే ఇబ్బందులు తలెత్తుతుంటాయి.


చార్జింగ్‌ నిరంతరంగా కొనసాగడానికి  వైర్‌లెస్‌తో కుదరదు.

అవసరార్థం ఫోన్‌ను చార్జింగ్‌ నుంచి తీయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు చార్జింగ్‌ నిరంతరంగా జరగదన్న మాట నిజమే. అయితే ఈ పోకడకు అనుగుణంగానే ఆధునిక స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తున్నారు. అదేవిధంగా వంద శాతం ఫుల్‌ చార్జ్‌ కావడం కూడా మంచిది కాదు. అలా చేస్తే బ్యాటరీ మన్నిక దెబ్బతింటుంది. 


ఫోన్‌ మీద కవర్‌  లేదా కేస్‌ ఉన్నప్పుడు చార్జింగ్‌ కాదు.

ఇది నిజం కాదు.  కొత్త ఫోన్లు అలాగే వైర్‌లెస్‌ అడాప్టర్లతో కవర్‌ మీదుగా కూడా చాలా సులువుగానే చార్జింగ్‌ జరుగుతోంది. ఫోన్‌ను చార్జింగ్‌ కోసం పెట్టే ప్రతీసారీ కవర్‌ లేదంటే కేసు నుంచి విడదీయాల్సిన అవసరం లేదు. 


వైర్‌లెస్‌ చార్జింగ్‌తో రేడియేషన్‌ విడుదల అవుతుంది. 

క్యుఐ సర్టిఫైడ్‌ వెర్‌లెస్‌ చార్జింగ్‌ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్న పక్షంలో హానికర రేడియేషన్‌ విడుదల అవుతుందన్న సమస్యే ఉండదు. విడుదలయ్యే రేడియేషన్‌ కూడా కనీస స్థాయిలో ఉంటుంది. వాటితో మానవ శరీరానికి ఎలాంటి హానీ ఉండదు.


చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించుకోలేము 

వైర్‌లెస్‌ చార్జింగ్‌ జరుగుతున్నప్పుడు గేమ్స్‌ ఆడుకోవడం లేదా ఇంటర్నెట్‌ ఉపయోగించడం కుదరదు. అయితే సరికొత్త వైర్‌లెస్‌ స్టాండ్స్‌తో ఈ పనిచేయవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌ లేదా సిరి సహకారంతో స్మార్ట్‌ఫోన్‌తో అన్ని పనులూ చేసుకోవచ్చు. టిడబ్ల్యుఎస్‌ ఇయర్‌బడ్స్‌ ఉంటే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. 


వైర్‌లెస్‌ చార్జింగ్‌తో వేడి ఎక్కువై ఫోన్‌పై ప్రభావం చూపుతుంది

వైర్‌లెస్‌ చార్జింగ్‌తో  ఫోన్‌ వేడెక్కడం నిజమే. అయితే అదేమీ అసాధారణం మాత్రం కాదు. క్యుఐ సర్టిఫైడ్‌ వైర్‌లెస్‌ చార్జర్‌ ఉపయోగించినపక్షంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వేడి ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అవి పని చేస్తాయి. 


చార్జింగ్‌లో వేగం ఉండదు, రోజంతా వినియోగం అసాధ్యం

ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ కొత్తగా వస్తున్నవి వేగంగానే చార్జింగ్‌కు ఉపయోగపడుతున్నాయి. 50వాట్‌ చార్జర్‌ అంత వేగంగా జరగదు. అయితే 5000ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉన్న ఫోన్‌ ఫుల్‌గా చార్జ్‌ అయ్యేందుకు రెండు గంటల సేపు పడుతుంది.

Updated Date - 2021-04-10T05:58:58+05:30 IST