డిజైన్‌ లోపంతోనే..

ABN , First Publish Date - 2022-08-09T09:43:52+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) పంప్‌హౌ్‌సల మునకకు డిజైన్‌ లోపమే కారణమని తేలింది.

డిజైన్‌ లోపంతోనే..

కాళేశ్వరం ముంపుపై ప్రాథమిక నిర్ధారణ.. ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యమూ 

సీడీవో పాత్ర లేకుండానే పంపుల డిజైన్‌.. నిపుణుల సలహాలు లేకుండానే ఏర్పాటు

మునక నష్టాన్ని భరించాల్సింది సర్కారే.. నష్టంపై స్పష్టత మరికొన్నాళ్ల తర్వాతే..


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) పంప్‌హౌ్‌సల మునకకు డిజైన్‌ లోపమే కారణమని తేలింది. ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కూడా మునకకు కారణమైందని వెల్లడైంది. ప్రధానంగా పంప్‌హౌ్‌సల డిజైన్‌లోనే లోపం ఉందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటీవల భారీ వర్షాలతో వచ్చిన వరదలకు రక్షణగోడ కూలిపోయి ఈ పంప్‌హౌ్‌సలు పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పంప్‌హౌ్‌సలకు డిజైన్‌ చేసిందెవరని ఆరా తీయగా.. నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) పాత్ర లేదని తెలిసింది.


ఈ పంప్‌హౌ్‌సలను తాము డిజైన్‌ చేయలేదని సీడీవో స్పష్టం చేసింది. వాస్తవానికి నీటిపారుదల శాఖకు చెందిన ఏ పనులు చేపట్టాలన్నా సీడీవో డిజైన్‌లే కీలకం. ఎవరు డిజైన్‌ చేసినా దానిని పరిశీలించి.. ఆమోదం తెలపాల్సిన బాధ్యత సీడీవోదే. అయితే అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌ్‌సల డిజైన్‌కు తమకు సంబంధం లేదని సీడీవో చెబుతుండటం గమనార్హం. పంపుల ఏర్పాటు సమయంలో కూడా నిపుణుడైన ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని అసలు సంప్రదించలేదని, డిజైన్‌లు కూడా ఆయనకు పంపలేదని తేలింది. పంపులు మునిగిన తర్వాత.. ఆయనను ముందుంచి ప్రకటనలు ఇప్పిస్తున్నారని స్పష్టమైంది. కాగా, పంపుల మునకకు బాధ్యత వహించాల్సింది నిర్మాణ సంస్థేనని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మునక నష్టం రూ.25 కోట్లకు మించి ఉండదని, దీనిని ఆ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. కానీ, పంపులను పరిశీలించకుండానే, అవి నీటిలో మునిగి ఉన్న సమయంలోనే ఈ ప్రకటన చేయడమేంటనే విమర్శలు వస్తున్నాయి. పంపులు మునిగి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. అన్నారం, మేడిగడ్డ వద్దకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గానీ, ఆ శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) గానీ వెళ్లకపోవడాన్నీ తప్పుబడుతున్నారు. మరోవైపు నిర్మల్‌లోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కూడా వరదల కారణంగా ఓ దశలో కొట్టుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ ప్రాజెక్టును కూడా ఈ ఇద్దరు కీలక అధికారులు సందర్శించలేదు. 


నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి..
పంపుల మునక నష్టాన్ని చివరికి ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ సంస్థ డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో ప్రకృతి వైపరీత్యాలు రావని, ఆ కారణంగానే ముంపు భారమంతా ప్రభుత్వమే భరించే పరిస్థితి రానుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పంపులను బయటికి తీసే చర్యలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజులైతే తప్ప.. నష్టంపై పూర్తిస్థాయి స్పష్టత రాదని తేల్చారు. ముంపు వల్ల అన్నారం కన్నా మేడిగడ్డలోనే నష్టం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే గుర్తించారు. మేడిగడ్డలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 17 మోటార్లు ఉండగా, అన్నారంలో 40 మెగావాట్ల సామర్థ్యం గల 12 మోటార్లు ఉన్నాయి. కాగా, నీట మునిగిన పంపులను ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేసి వాడకంలోకి తేవడం తప్పిదమే అవుతుందని, తొలుత రక్షణ కట్టలు నిర్మించి, రక్షణ చర్యలు తీసుకున్నాక వాడకంలోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-08-09T09:43:52+05:30 IST