మహా ఉత్సాహంతో...

ABN , First Publish Date - 2022-05-28T05:46:40+05:30 IST

ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు.. మరోవైపు మండుతున్న ఎండలు..

మహా ఉత్సాహంతో...

  1.   ఒంగోలుకు భారీగా తరలిన టీడీపీ శ్రేణులు
  2.   ఆపలేకపోయిన ప్రభుత్వ ఆంక్షలు
  3.   నేడు ఎన్టీఆర్‌ శత జయంతి 

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు.. మరోవైపు మండుతున్న ఎండలు.. ఇవేవీ కందెనవోలు పసుపు దండుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఒంగోలు కేంద్రంగా శుక్రవారం ప్రారంభమైన తెలుగుదేశం మహానాడుకు కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి సహా అసెంబ్లీ నియోజకవర్గాల ఇనచార్జిల సారథ్యంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వెల్లువలా పార్టీ సైనికులు తరలి వెళ్లారు. మహానాడు వేదికగా తొలి రోజు నంద్యాల జిల్లాకు చెందిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వైసీపీ ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యానికి గురవుతున్న సీమ ప్రాజెక్టులపై గళమెత్తితే.. కర్నూలు జిల్లాకు చెందిన జడ్పీ మాజీ చైర్మన, బీసీ నాయుడు, బత్తిని వెంకట్రాముడు పాదయాత్రలో జగన హామీలు ఇచ్చి.. ఆ తరువాత నిలువునా ముంచారంటూ ధ్వజమెత్తారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేళ జరుపుకుంటున్న మహానాడు జాతరలో ఎటు చూసినా ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకుల సందడే సందడి. అధినేత చంద్రబాబు మళ్లీ రావాలి.. అప్పుల ఊబిలో కూరుకుపోత్ను ఆంధ్రప్రదేశను కాపాడాలి.. అంటూ ఉమ్మడి జిల్లాకు చెందిన పసుపు సైనికుల నినాదాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. 

ఒంగోలు కేంద్రంగా పసుపు సైన్యం నిర్వహించే రెండు రోజుల జన జాతర తెలుగుదేశం పార్టీ మహానాడు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, యుగపురుషుడు నందమూరి తారక రామరావు శత జయంతి కూడా తోడవడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సోహాలకు అవధులే లేవు. గురువారం సాయంత్రానికే పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వెళ్లగా.. శుక్రవారం ఉదయం సైతం ఉమ్మడి జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తల వాహన శ్రేణ నల్లమల దాటి మహానాడు ప్రాంగణానికి చేరుకుంది. ఒంగోలుకు సమీపంలో ముందుగానే కళ్యాణ మండపాలు, హోటళ్లు, ఇతర భవనాలు రిజర్వేషన చేసుకున్న నియోజకవర్గ ఇనచార్జిలు తమ కార్యకర్తలకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. జన జాతరగా మారిన ఒంగోలుకు సరిహద్దునే ఉమ్మడి జిల్లా ఉండడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వెళ్లడం కొసమెరుపు. ఇనచార్జిలతో సంబంధం లేకుండా తటస్తులు ప్రత్యేక వాహనాల్లో మహానాడుకు చేరుకోవడం చూస్తే ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ ఏపాటితో ఇట్టే తెలుస్తుంది. 

 మహానాడు ఏర్పాట్లలో జిల్లా నాయకత్వం: 

ఉమ్మడి జిల్లా సరిహద్దులోనే ఒంగోలు ఉండడం వల్ల మహానాడు ఏర్పాట్లలో జిల్లా నాయకత్వం కీలకంగా పాల్గొంది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ ఇనచార్జి మాండ్ర శివానందారెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, కర్నూలు, కోడుమూరు నియోజవర్గాల ఇనచార్జిలు మాజీ ఎమ్మెల్యేలు కె.మీనాక్షినాయుడు, కోట్ల సుజాతమ్మ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కె.తిక్కారెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత, ఆకెపాటి ప్రభాకర్‌, నంద్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఎనఎండీ ఫరూక్‌, భూమా అఖిలప్రియ, బనగానపల్లె, ఆత్మకూరు, పాణ్యం, నంద్యాల, డోన ఇనచార్జిలు మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గౌరు చరితమ్మ, భూమా బ్రహ్మానందారెడ్డి, రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన చైర్మన నాగేశ్వరరావు యాదవ్‌ సహా ముఖ్యనాయకులు ఎందరో మహానాడుకు చేరుకొని ఏర్పాట్లలో కీలకపాత్ర పోషించారు. పలు అంశాలపై జిల్లాకు చెందిన నాయకులు మాట్లాడారు.

ఫ పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే - బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి: 

 రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టుల తీర్మానంపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులపై జగన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొస్తే ఈ వైసీపీ నాయకులు నిందలేశారని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు మళ్లించి, కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేసి రాయలసీమ ప్రాజెక్టుల ద్వారా కరువు నేలకు మళ్లించారని తెలిపారు. అవుకు టన్నెల్‌ పూర్తి చేసి గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా పులివెందులకు నీళ్లు తీసుకెళ్లిన అపర భగీరథుడు చంద్రబాబు అని అన్నారు. జీఎనఎస్‌ఎస్‌ ద్వారా ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అడ్డుం పెట్టుకొని మీరు రూ.కోట్లు సంపాదిస్తే..  చంద్రబాబు రూ.కోట్లు ఖర్చు చేసి అసంపూర్తి ప్రాజెక్టును పూర్తి చేశారని అన్నారు. అవుకు కాలువ గట్లపై పడుకునే నీళ్లు ఇస్తే.. మీరు ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆ నాడు టీడీపీ నీరు-చెట్టు పనులు చేస్తే ఈ రోజుల భూగర్భ జలాలు పెరిగాయి. మీరేం చేశారని వైసీపీ నేతలను నిలదీశారు. కమిషన్ల కోసం గాలేరు-నగరికి సీసీ లైనింగ్‌ పనులు చేపట్టి సీమలో భూగర్భ జలాలు పెరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే మీరొచ్చి పనులు చేపట్టలేదు.. ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టులు నిధులు లేక ఆపేశారు అంటూ గళమెత్తారు. 

 చంద్రబాబు కక్షకట్టి ఉంటే జగన పాదయాత్ర చేసేవారా..? 

- జడ్పీ మాజీ చైర్మన బత్తిన వెంకట్రాముడు: 

 ఆనాడు సీఎం చంద్రబాబు కక్ష సాధించాలి అనుకుని ఉంటే జగనరెడ్డి పాదయాత్ర చేసేవారా..? అని  మహానాడు వేదికగా జిల్లాకు చెందిన జడ్పీ మాజీ చైర్మన బత్తిన వెంకట్రాముడు నిలదీశారు. జగన నాడు ముద్దులు పెట్టి... నేడు గుద్దులు గుద్దుతున్నారు. రైతులకు నష్టపరిహారం ఇస్తామని పొలాల్లోకి వెళ్లి కల్లబొల్లి మాటలు చెప్పారు. అధికారం చేపట్టాక తాడేపల్లి ప్యాలెస్‌ దాటడం లేదని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించి 13 కేసుల్లో 18 నెలలు జైల్లో ఉన్న ఏ-1 ముద్దాయి జగన అని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయాక అప్పుల్లో ఉన్న నవ్యాంధ్ర ప్రగతి పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నిద్ర లేకుండా కష్టపడ్డారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా రాజధాని కోసం రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలు సేకరించిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చి... రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

ఫ జగన పాలనలో దగా పడ్డ దళితులు 

ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ నాయకుడు కదిరికోట ఆదెన్న రచించిన ‘జగన పాలనలో దగా పడ్డ దళితులు, దళితులపై దాడులే దాడులు’ అనే పుస్తకాన్ని మహానాడు వేదికపై పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆవిష్కరించారు. 

 


Updated Date - 2022-05-28T05:46:40+05:30 IST