కరోనా సోకిందన్న బాధతో.. హెచ్‌ఎం ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-09T05:23:30+05:30 IST

కరోనా సోకిందన్న బాధతో.. హెచ్‌ఎం ఆత్మహత్య

కరోనా సోకిందన్న బాధతో..  హెచ్‌ఎం ఆత్మహత్య

చేవెళ్ల: కరోనా సోకిందన్న భయంతో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(48) మండల పరిధిలోని కమ్మెట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడటంతో భార్య, పిల్లలు అతడికి దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు గొల్లపల్లిలో నివాసముంటూ నిత్యం పాఠశాలకు వెళ్లివచ్చేవారు.  ఈ క్రమంలో గతనెలలో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఇంట్లోనే (హోం క్వారంటైన్‌)లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉండటంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ‘ఎవరూ తనను తాకవద్దని దూరంనుంచి చూడాలని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి’ అని శుక్రవారం లెటర్‌ రాసి ఇంట్లో పెట్టి సాయంత్రం గ్రామానికి దూరంగా ఉన్న ఓ వేపచెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. కాగా శనివారం ఉదయం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషెంట్‌ కావడంతో జేసీబీ సాయంతో మృతదేహన్ని అతడి గ్రామంలోనే ఖననం చేశారు. మృతుడి అన్న జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-05-09T05:23:30+05:30 IST