కొవిడ్‌ నిబంధనలతో... రంజాన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:02:58+05:30 IST

ముస్లింలకు పవిత్రమైనది రంజాన్‌ పండుగ. నెల రోజుల పాటు నియమ, నిష్టలతో ఉంటూ దేవుడి (అల్లాహ్‌) పట్ల విశ్వాసంతో మెలగుతూ ఉన్నంతలో పేదలకు దానధర్మాలు చేస్తుం టారు.

కొవిడ్‌ నిబంధనలతో... రంజాన్‌
మస్జిదె బుఖారియాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

ప్రశాంతంగా ప్రార్థనలు

కడప(మారుతీనగర్‌), మే 14: ముస్లింలకు పవిత్రమైనది రంజాన్‌ పండుగ. నెల రోజుల పాటు నియమ, నిష్టలతో ఉంటూ దేవుడి (అల్లాహ్‌) పట్ల విశ్వాసంతో మెలగుతూ ఉన్నంతలో పేదలకు దానధర్మాలు చేస్తుం టారు. అలాంటి రంజాన్‌ పండుగ వరుసగా రెండో సంవత్సరం కూడా కరోనా కారణంగా కొవిడ్‌ నిబంధనలతో జరుపుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా వచ్చే నూతన సంవత్సరంలో అయినా (2022) ఆనందకర వాతావరణంలో, కుల, మతాలకతీతంగా జరుపుకునేలా చూడా లని ముస్లింలు అల్లాను ప్రార్థించారు. పరిమిత సంఖ్యలో ముస్లింలు మజీద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 


ఇళ్లలోనే ప్రముఖుల ప్రార్థనలు

చాలా మంది ముస్లింలు మసీదులకు వెళ్లలేక పోవడంతో వారి వారి ఇళ్లలోనే ఆ భగవంతుడిని కొలుస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వి.యస్‌.అమీర్‌బాబు, ఇండియన్‌ ఒలంపిక్స్‌ క్రీడా ప్రతినిధి సుభాన్‌భాష, సంఘసేవకుడు సలావుద్దీన్‌ కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించారు. కాగా, ప్రఖ్యాత పెద్దదర్గాలో ముస్లిం సోదరులు పరిమిత సంఖ్యలో (50) బ్యాచిల వారీగా, కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 


మస్జిదె బుఖారియాలో...

కడప(సెవెన్‌రోడ్స్‌): నగర రవీంద్రనగర్‌లోని మస్జిదె బుఖారియాలో శుక్రవారం ఉదయం ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మస్జిద్‌ ఇమాం ఓ ఖతీబ్‌, ప్రభుత్వ ఖ్వాజీ సయ్యద్‌ సిరాజుద్దీన్‌ బుఖారి సాహెబ్‌ ప్రపంచ శాంతి కొరకు అల్లాను వేడుకున్నారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.


కమలాపురంలో... 

రంజాన్‌ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గురువారం రాత్రి నెలవంక కనిపించడంతో శుక్రవారం ఈద్‌ఉల్‌ఫితర్‌ పండుగ నిర్వహించుకోవాలని ముస్లిం పెద్దలు ప్రకటించారు. దీంతో శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల్లో రంజాన్‌ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఏడాది నమాజ్‌ను ఈద్గాల్లో సామూహికంగా నిర్వహించుకునేవారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలకు లోబడి ప్రార్థనలు నిర్వహించుకున్నారు. దీంతో ఈద్గాలకు కళ తప్పింది. 


వల్లూరులో...

రంజాన్‌ను పురస్కరించుకుని కొవిడ్‌ నేపథ్యంలో భాగంగా కేవలం కొంతమంది మాత్రమే మసీదుల్లో భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించి నమాజ్‌ చేశారు. వల్లూరు, గంగాయపల్లె, పెద్దపుత్త, దిగువపల్లె, పైడికాల్వ తదితర గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ వేడుకలను ఇంట్లోనే నిర్వహించారు. 


చెన్నూరులో... 

రంజాన్‌ పండుగను మండలంలోని ముస్లింలు నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రతియేటా పెద్ద సంఖ్యలో వెళ్లి ఈద్గాల్లో ప్రార్థనలు చేసేవారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రార్థనలు చేసుకున్నారు. చెన్నూరు ఖిల్లా మసీదు, షాహి మసీదుల్లో మత గురువులు మహ్మద్‌ ప్రవక్త మానవాళికి అందించే సందేశాన్ని వివరించారు. రామనపల్లె, ముండ్లపల్లె, నజీర్‌బేగ్‌పల్లె, కొండపేట, దౌలతాపురం గ్రామాల్లోనూ పండుగను నిబంధనల మేరకే జరుపుకున్నారు.



Updated Date - 2021-05-15T05:02:58+05:30 IST