గురుకుల వర్సిటీతోనే బడుగుల అభ్యున్నతి

Published: Thu, 22 Jul 2021 03:15:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గురుకుల వర్సిటీతోనే బడుగుల అభ్యున్నతి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గురుకుల పాఠశాలలకు ప్రాధాన్యత పెరిగింది. 1980 దశకంలో ప్రముఖ మానవతావాది, అణగారిన వర్గాల పక్షపాతి, సామాజిక మార్పు పట్ల దూరదృష్టి కలిగిన ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ ఆలోచనలతో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలు రూపుదిద్దుకున్నాయి. గత ముప్పై ఐదేళ్ళలో అవి ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని నేడు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకుల విద్యాసంస్థలు ఒక సమాంతర వ్యవస్థగా అభివృద్ధి చెందాయి. షెడ్యూల్డ్ కులాల, తెగల గురుకుల విద్యాసంస్థలతో పాటు మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల, మైనారిటీ వర్గాల గురుకుల విద్యా సంస్థలు రాష్ట్ర మంతటా వ్యాప్తి చెందాయి. మునుపు కేవలం పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలకు పరిమితమైన గురుకుల విద్యా సంస్థలు, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ విద్యా సంస్థల ఏర్పాటు, నిర్వహణ స్థాయికి ఎదిగాయి. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వీటి ఏర్పాటుకు పూనుకోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కేవలం 298గా ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 1401కు పెరిగాయి. వీటిలో దాదాపు ఐదున్నర లక్షల పైచిలుకు విద్యార్థులు మెరుగైన విద్యావకాశాలు పొందుతున్నారు. గురుకుల విద్యాలయాల పనితీరు, ఫలితాలు, అందులో చదివిన విద్యార్థుల ప్రతిభా పాటవాలు చూసిన తరువాత ఇప్పుడు విద్యావేత్తల నుంచి అలాగే పౌరసమాజం నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వస్తోంది. అన్ని వసతులతో కేజీ నుంచి పీజీ వరకు, ఆ తర్వాత పరిశోధనలకూ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటయితే ఈ రాష్ట్ర విద్యా రంగపు మౌలిక స్వరూపమే మారుతుందని, దేశానికి కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన కొత్త తరం అందుబాటులోకి వస్తుందని వీరు అంటున్నారు.


రాజ్యాంగ నియమాలపరంగా, అమలులో ఉన్న విద్యా చట్టాల పరంగా ఇటువంటి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. పైగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ఆర్టికల్ 29 (2) అలాగే ఆర్టికల్ 46తో సహా పలు సందర్భాల్లో రాజ్యాంగం ఇటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించింది. గతంలో కూడా భారత ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (యూజీసీ) వివిధ సామాజిక సమూహాల కోసం విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి ఉన్నాయి. దేశంలో గిరిజన విశ్వవిద్యాలయాలు, మహిళల విశ్వవిద్యాలయాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇదే తరహాలో దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే వాటికి ప్రత్యేక ప్రతిపత్తి తోపాటు గ్రాంట్లు కూడా పుష్కలంగా లభించే అవకాశాలు ఉన్నాయి. నేడు తెలంగాణా సంపన్న రాష్ట్రం. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు, తెగలకు ఉన్న సబ్-ప్లాన్ మూలంగా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ నిధులను ప్రత్యేకంగా ఆయా వర్గాలలో మానవ వనరుల అభివృద్ధికి ఖర్చుచేయాలన్న నిబంధన కూడా ఉంది. కాబట్టి నిధుల సమస్య కూడా ఉత్పన్నం కాదు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ఈ ఏడేళ్ల కాలంలో 53 ప్రత్యేక డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 30, షెడ్యూలు తెగల అభివృద్ధి శాఖలో 22, వెనుకబడిన వర్గాలకు ఒకటి.. కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థులు మిగతా విశ్వవిద్యాలయ విద్యార్థులకంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రూపొందించిన 'తెలంగాణా దళిత బంధు' పథకం కూడా దళితుల విద్యా వికాసానికి పెద్దపీట వేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకాన్ని త్వరలోనే హుజురాబాద్ నుంచి ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా దళితులతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల ఉన్నత విద్య కోసం ఒక ప్రత్యేక, ప్రత్యామ్నాయ వ్యవస్థను నెలకొల్పే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గురుకుల విశ్వవిద్యాలయాలు ఏ పేరుతో ఉన్నా, ఏ నిధులతో నడుస్తున్నా వాటిలో అన్ని కులాలు వర్గాలకు ప్రవేశం, ప్రాధాన్యత, నిర్దిష్ట స్థానాల కేటాయింపు ఉంటుంది కాబట్టి ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు మొత్తం తెలంగాణా మానవ వనరుల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుంది.


కేంద్రప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానం - 2020 కూడా పాఠశాల, సెకండరీ, ఉన్నత విద్య రంగాలలో పలు సంస్థాగత నిర్మాణాత్మక మార్పులను సూచిస్తున్నది. ఈ విధానం ఉన్నత విద్య రంగంలో స్థూల నమోదు నిష్పత్తిని 2018 నాటి 26.3 శాతం నుంచి 2035 సంవత్సరానికి 50 శాతానికి పెంచడం లక్ష్యంగా ప్రకటించింది. ఉన్నత విద్యారంగంలో షెడ్యూలు కులాల విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి ప్రస్తుతం 22శాతం, షెడ్యూలు తెగల విద్యార్థులలో 15.9శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యత్యాసాలను అధిగమించడం కూడా లక్ష్యంగా జాతీయ విద్యా విధానం – 2020 ప్రకటించింది. సామాజికంగా, ఆర్ధికంగా, వెనుకబడిన సమూహాల ఉన్నత విద్యా రంగంలో మెరుగైన సమానత్వం, చేరికలు అవసరమ‌ని ఈ నూతన విధానం తెలుపుతున్నది. 


అదేవిధంగా ఉన్నత విద్య రంగం సంస్థాగత నిర్మాణాలకు సంబంధించి ఈ నూతన జాతీయ విద్య విధానం సమూల మార్పులను సూచిస్తున్నది. దశాబ్దాల కాలం నుంచి ఇంతవరకు అమల‌వుతూ వస్తున్న అనుబంధ కళాశాలల వ్యవస్థను వచ్చే పదిహేడు సంవత్సరాల కాలం లోపు తొలగించాలనీ, వాటి స్థానంలో నూతనంగా స్వయం ప్రతిపత్తి కలిగిన డిగ్రీ మంజూరు కళాశాలలను, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ఈ విధానం ప్రకటించింది. అయితే ఈ విధానం ప్రకారం విశ్వవిద్యాలయాలలో అంతర్భాగంగా కొనసాగుతున్న కానిస్టిట్యుయెంట్ కాలేజ్ వ్యవస్థ (Constituent College System) మటుకు కొనసాగవచ్చు. నూతన జాతీయ విద్య విధానం ప్రకారం ఇప్పటికే ఉన్న గురుకుల కళాశాలలు కూడా ముందు ముందు వివిధ విశ్వవిద్యాలయాలకు అనుబంధ కళాశాలలుగా కొనసాగే అవకాశం ఉండదు. కాబ‌ట్టి ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటంటే వీటన్నింటినీ స్వయం ప్రతిపత్తి కలిగిన డిగ్రీ మంజూరు చేసే కళాశాలలుగా మార్చడం లేదా ఒక రాష్ట్ర స్థాయి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి ఈ కళాశాలన్నింటినీ దానిలో భాగంగా అంటే కానుస్టిట్యూయెంట్ కాలేజీలుగా ఏర్పాటు చేయటం. వీటిని స్వయంప్రతిపత్తి కలిగిన డిగ్రీ మంజూరు చేసే కళాశాలలుగా మార్చడం ఏ రకంగా చూసినా సరైనది కాదు. వాటి పరిపాలన సమర్థంగా జరిగే అవకాశం ఉండదు. కావున సంస్థాగత నిర్మాణ పరంగా, పాఠ్య ప్రణాళికల రూపకల్పన పరంగా, పరిశోధనల పరంగా, పరిపాలన సమర్థతపరంగా, అన్నిర‌కాలుగానూ ఈ గురుకుల కళాశాలలను ఒక నూతన రాష్ట్రస్థాయి సాంఘిక సంక్షేమ లేదా సమతా విశ్వవిద్యాలయంలో భాగం చేయడమే సముచితమైన నిర్ణయం అవుతుంది. ఈదిశ‌గా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తే ఈ ప్రయత్నం దేశానికి ఆదర్శమౌతుంది. 


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ఉన్నత విద్య గురుకుల సంస్థలు ప్రస్తుతం రాష్ట్రంలోని పలు సాంప్రదాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. దీంతో ఇవి పలు నిర్వహణ సమస్యలను ఎదురుకొంటున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం గురుకుల కళాశాలల్లో నిర్వహిస్తున్న కోర్సులు మిగతా డిగ్రీ కాలేజీలకు భిన్నంగా ఉన్నాయి. ఈ సంస్థలు సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు, న్యాయ శాస్త్రం, ఫైన్ ఆర్ట్స్, ఫార్మసి వంటి రంగాల్లో కూడా కొత్తగా కోర్సులను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు గురుకుల విద్యాసంస్థలు ఈ కాలేజీలకు, కోర్సులకు అనుమతులు, అఫిలియేషన్ కోసం నాలుగైదు విశ్వవిద్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తోంది. అలాగే గురుకుల సంస్థలు వాటి ప్రత్యేకతలు, క్రమశిక్షణ, సమయపాలన, వ్యవహారశైలిల‌ను కాపాడుకోవడం, ముఖ్యంగా ప్రత్యేక‌ పాఠ్యాంశాల‌ను అభివృద్ధి చేయడంలో పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. కాబ‌ట్టి వీటికంటూ ఒక రాష్ట్ర స్థాయి ప్రత్యేక విశ్వవిద్యాలయ ఏర్పాటు తార్కికంగా సరైనది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే అది దేశానికి ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తుంది.

ప్రొఫెస‌ర్‌ మడపతి చెన్నబసవయ్య

(రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.