గంటలోపే...

ABN , First Publish Date - 2021-05-09T05:38:30+05:30 IST

జిల్లాలో కొవాగ్జిన్‌ టీకా కోసం ప్రజలు బారులు తీరారు. 16 రోజుల తర్వాత ఈ డోసులు రావడంతో ఎగబడ్డారు.

గంటలోపే...
ఎన్టీఆర్‌ బిల్డింగ్‌ వద్ద ఇలా..

  1. అయిపోయిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌  
  2. ఉదయమే బారులు తీరిన ప్రజలు


కర్నూలు(హాస్పిటల్‌), మే 8: జిల్లాలో కొవాగ్జిన్‌ టీకా కోసం ప్రజలు బారులు తీరారు. 16 రోజుల తర్వాత ఈ డోసులు రావడంతో ఎగబడ్డారు. జిల్లాలో 17 కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకాలు వేస్తున్నట్లు అధికారులు ముందే ప్రకటించారు. కర్నూలులో 6 కేంద్రాలు, నంద్యాలలో 3, ఆత్మకూరు 1, ఏడు పీహెచ్‌సీ కేంద్రాల్లో టీకాల ప్రక్రియ ప్రారంభించారు. 40 వేల మంది కొవాగ్జిన్‌ మొదటి డోసును వేసుకోగా.. రెండో డోసు కోసం 20 వేల మంది ఎదురు చూస్తున్నారు. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి కర్నూలుకు 6 వేల డోసులు వచ్చాయి.


ఉదయం నుంచే..
కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కోసం ఉదయం 8 గంటలకే టీకా కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ 10 గంటలకే ముగిసింది. రెండో డోసు కొవాగ్జిన్‌ను కర్నూలు కంటి ఆసుపత్రికి 600 డోసులు కేటాయించారు. దాదాపు 2 వేల మంది వచ్చారు. కర్నూలులోని బండిమెట్ట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు 200 డోసులు ఇవ్వగా.. ఉదయం 11 గంటలకే అయిపోయింది. దాదాపు 500 మంది టీకా కోసం ఎదురు చూస్తున్నారు. జోహరాపురం-2, రోజావీధి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కూడా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల భౌతిక దూరం పాటించకుండా బారులు తీరారు.


ఉదయం 8కే వచ్చాను
ఏప్రిల్‌ 28వ తేదీన కొవాగ్జిన్‌ రెండో డోసు వేసుకోవాల్సి ఉంది. రోజూ వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్తున్నా. కొవాగ్జిన్‌ లేదంటున్నారు. శనివారం టీకా వేస్తారంటే ఉదయం 8 గంటలకే క్యూలో నిలబడ్డా. 10 గంటలకే వ్యాక్సిన్‌ అయిపోయింది. మళ్లీ ఎప్పుడు వేస్తారో.. ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు.
- నాగరాజు, బళ్లారి చౌరస్తా, కర్నూలు

నాలుగు కేంద్రాలకు వెళ్లా
ఉదయం 7 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లా. అక్కడ వ్యాక్సిన్‌ లేదన్నారు. బుధవారపేట, జోహరాపురం, బండిమెట్ట కేంద్రాలకు వెళ్లినా టీకా వేయలేదు. ఏప్రిల్‌ 27వ తేదీన రెండో డోసు కొవాగ్జిన్‌ వేయించుకోవాలి. 12 రోజులుగా ఎదురు చూస్తున్నాను.
- శ్రీనివాసులు, షరాఫ్‌బజార్‌, కర్నూలు



మరో ఏడుగురి మృతి
 కర్నూలు(హాస్టల్‌), మే 8:
జిల్లాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,421 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 589కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 13,185 మంది చికిత్స పొందుతున్నారు.





Updated Date - 2021-05-09T05:38:30+05:30 IST