కాలేయం కుదేలవకుండా..

ABN , First Publish Date - 2022-04-19T06:08:22+05:30 IST

గుండె బరువుగా ఉంటే గుండె పరీక్ష చేయించుకుంటాం. శ్వాస ఇబ్బందిగా మారితే ఊపిరితిత్తుల వైద్యులను కలుస్తాం.

కాలేయం కుదేలవకుండా..

గుండె బరువుగా ఉంటే గుండె పరీక్ష చేయించుకుంటాం. శ్వాస ఇబ్బందిగా మారితే ఊపిరితిత్తుల వైద్యులను కలుస్తాం. మరి కాలేయం జబ్బుపడితే? కాలేయానికి సంబంధించిన పరీక్షలు, చికిత్సల గురించి మనమెప్పుడూ ఆలోచించం. ఎందుకంటే.. కాలేయం పూర్తిగా పాడయ్యేవరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి, కాలేయ ఆరోగ్యం ఎప్పుడూ అశ్రద్ధకు గురవుతూ ఉంటుంది. కానీ లక్షణాలతో పని లేకుండా, పరీక్షలతో ఫ్యాటీ లివర్‌ను ముందుగానే గుర్తిస్తే, అక్కడితో కాలేయ డ్యామేజీకి అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారు ప్రముఖ కాలేయ నిపుణులు డాక్టర్‌ టామ్‌ చెరియన్‌.


గుండె బాగుండాలంటే నడవాలి. మూత్రపిండాలు బాగుండాలంటే సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా ఒంట్లోని ప్రధాన అవయవాల ఆరోగ్యం కోసం మనం ఎంతో కొంత ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ కాలేయం అలా కాదు. దాని కోసం వ్యాయామాలు, అదనపు పోషకాలూ అవసరం లేదు. దాని ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూసుకుంటే సరిపోతుంది. 


ఫ్యాటీ లివర్‌ ఎందుకు?

కాలేయానికి చక్కెర, కొవ్వు ప్రధాన శత్రువులు. శరీర ఎత్తుకు సరిపడా బరువు ఉండాలి. అంతకు మించితే శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఆరడుగుల వ్యక్తి 75 కిలోల బరువున్నా ఫర్వాలేదు. అదే వ్యక్తి 5 అడుగుల ఎత్తే ఉంటే, అది అవసరానికి మించిన బరువు అవుతుంది. ఈ పరిస్థితిని బాడీ మాస్‌ ఇండెక్స్‌ ద్వారా ఎవరికి వారు తెలుసుకోవచ్చు. బిఎమ్‌ఐ ఎంత ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు అంత ఎక్కువగా ఉందని అర్థం. శరీరంలో ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే, కాలేయంలో కొవ్వు కణాలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఒకవేళ శరీర బరువు అదుపులో ఉన్నా, మధుమేహం ఉంటే, కొవ్వు కాలేయంలో పేరుకుంటుంది. ఇందుకు కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే! కాబట్టి ఒబేసిటీ, మధుమేహం... ఈ రెండు సమస్యలూ కాలేయంలో కొవ్వు పేరుకునేలా చేస్తాయని తెలుసుకోవాలి. 


కనిపెట్టేదెలా?

ఫ్యాటీ లివర్‌ గ్రేడ్‌ 1, 2, 3... ఈ మూడు దశలు దాటిన తర్వాత ఫైబ్రోసిస్‌లో కూడా 3 గ్రేడ్లను దాటి, అంతిమంగా సిర్రోసిస్‌కు చేరుకుంటుంది. ఇలా దశలు దాటుకుని తిరిగి బాగుచేయలేనంతగా కాలేయం పాడవకుండా ఉండాలంటే ఫ్యాటీ లివర్‌ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, అక్కడితో అడ్డుకట్ట వేయాలి. ఫ్యాటీ లివర్‌ మొదటి మూడు దశలు, ఫైబ్రోసిస్‌లో మొదటి రెండు దశల్లో కూడా ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కాబట్టే కాలేయం తిరిగి సరిదిద్దలేనంతగా డ్యామేజ్‌ అయిన తర్వాతే తెలుసుకునే పరిస్థితి ఉంటోంది. సిర్రోసిస్‌ దశ దాటే సమయంలో మాత్రమే కామెర్లు, రక్తపు వాంతులు, పొట్టలో నీరు చేరడం లాంటి తీవ్రమైన లక్షణాలు బయల్పడతాయి. కాబట్టి అలా్ట్రసౌండ్‌, లివర్‌ ఫంక్షన్‌ పరీక్షల ద్వారా ఎవరికి వారు తమ కాలేయ ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులైతే 25 ఏళ్ల వయసు నుంచీ, స్థూలకాయులు పాతికేళ్ల వయసు నుంచీ, మధుమేహం సమస్య లేకుండా, ఎత్తుకు సరిపడా బరువు ఉన్నవాళ్లు 50 ఏళ్లకూ ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యాటీ లివర్‌ ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి వయసు, మధుమేహం, అధిక బరువు ఆధారంగా ఫ్యాటీ లివర్‌ వచ్చే అవకాశాలను అంచనా వేసుకుని, పరీక్షలతో నిర్థారించుకుంటూ ఉండాలి. 


నియంత్రణ ఇలా...

మధుమేహం వంశపారంపర్య సమస్య కాబట్టి దాన్ని నియంత్రించే అవకాశం లేదు. అయితే మెరుగైన ఆహారంతో, ముందు జాగ్రత్త చర్యలతో మధుమేహాన్ని ఆలస్యం చేయవచ్చు. వచ్చినా క్రమం తప్పక తగిన మోతాదుల్లో మందులు వాడుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ కూడా మఽధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే సమతులాహారం మాత్రమే తీసుకోవాలి. దక్షిణ భారతీయుల ప్రధాన భోజనాలన్నీ బియ్యంతోనే తయారవుతూ ఉంటాయి. ఉదయం తినే దోశ, ఇడ్లీ, పొంగల్‌, పోహా... ఇవన్నీ బియ్యంతో కూడినవే! మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో సైతం అన్నమే తింటూ ఉంటాం. కూరలు కాస్త రుచిగా ఉంటే, ఇంకొంత ఎక్కువ అన్నం తినేస్తాం. అన్నంతో ఉండే సమస్య ఇదే! ఇలా అవసరానికి మించిన చక్కెర శరీరంలో చేరుకుంటూ ఉంటుంది. దీనికి తోడు కాఫీలు, టీలు, పండ్లు, పండ్ల రసాల రూపంలో అదనపు చక్కెర శరీరంలో పేరుకుంటూ ఉంటుంది. ఇలా శరీరంలోకి చేరే చక్కెర వేగంగా కరిగిపోతూ, కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి వీటికి పరిమితి విధించాలి. 


సన్నగా ఉండడమే ఆరోగ్యం

పిల్లలు బొద్దుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నారని పరిగణించే తల్లులు ఎక్కువ. పెద్దల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. సన్నగా ఉండడం బలహీనతగా, లావుగా ఉండడాన్ని ఆరోగ్యంగా పరిగణిస్తున్నాం. మన భారతదేశంలో ఆరోగ్యంగా ఉండడం అంటే... లావుగా ఉండడం. ఎంతో ముందు నుంచీ మనలో నాటుకుపోయిన నమ్మకమిది. మన అమ్మమ్మలు ‘అరేయ్‌ సన్నగా ఉన్నావు, కాస్త తిండి ఎక్కువగా తిను’ అంటూ ఉండేవాళ్లు. కానీ ఈ కాన్సెప్ట్‌ పూర్తిగా తప్పు. పిల్లలు వాళ్లకు సరిపడా తింటూ ఉంటే ఎప్పటికీ లావు కారు. కానీ వాళ్లు లావుగా తయారయ్యే వరకూ తల్లులు పదే పదే తినిపిస్తూనే ఉంటారు. దాంతో వేరే అవకాశం లేక పిల్లలు లావైపోతూ ఉంటారు. అలా లావైన తర్వాత తమ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తల్లులు ఊపిరి పీల్చుకుంటారు. కానీ నిజానికి అలా లావుగా ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండాలి. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా బిఎమ్‌ఐ లెక్కించి తదనుగుణంగా నడుచుకోవాలి. స్త్రీపురుషులిద్దరి ఆరోగ్యకరమైన బిఎమ్‌ఐ 21 నుంచి 23 మాత్రమే! 


కాలేయ మార్పిడి ఎప్పుడు?

సిర్రోసిస్‌... తిరిగి సరిదిద్దలేని కాలేయ సమస్య. కాలేయ ఫైబ్రోసిస్‌ గ్రేడ్‌ 1, 2 లకు చేరుకున్నప్పటికీ, కాలేయం తిరిగి తనను తాను మరమ్మతు చేసుకుని, పూర్తి ఆరోగ్యంగా మారగలుగుతుంది. ఈ దశలు దాటి ఫైబ్రోసిస్‌ మూడు, నాలుగు దశలకు చేరుకుని, సిర్రోసిస్‌కు చేరుకుంటే, తిరిగి కాలేయాన్ని సరిదిద్దే పరిస్థితి ఉండదు. అయితే అరుదుగా కొందర్లో కాలేయంలో కొన్ని ప్రదేశాలు ఆరోగ్యంగా ఉండి, తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని సమకూర్చుకునే పరిస్థితీ ఉంటుంది. సిర్రోసిస్‌ దశకు చేరుకుని, తిరిగి సరిదిద్దలేని స్థితికి చేరుకున్నవాళ్లకు కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం. కాలేయ మార్పిడి ప్రాణాలను కాపాడుతుంది. కామెర్లు, పొట్టలో నీరు లాంటి సమస్యలు మొదలైన తర్వాత కాలేయ మార్పిడి చేయకపోతే, ఏడాదిలోపే ప్రాణాలు పోయే అవకాశాలు 90ు ఉంటాయి. అలాంటి వ్యక్తికి కాలేయ మార్పిడి చేస్తే, అతని ప్రాణాలను కాపాడే అవకాశాలు 90ు పెరుగుతాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, కాలేయ అవయవ మార్పిడుల్లో అత్యధిక విజయావకాశాలు మూత్రపిండాలు, కాలేయ మార్పిడిలకే ఉన్నాయి. 



టాక్సిన్లకు దూరంగా...

కాలేయానికి టాక్సిన్లు చేటు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే! ఇలాంటప్పుడు కాలేయానికి హాని కలిగించే వీలున్న టాక్సిన్లకు దూరంగా ఉండాలి. మద్యపానం, కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌ లాంటి రసాయనాలు, కాలుష్యం, హెవీ మెటల్స్‌, హెపటైటిస్‌ ఎ, బి, కొన్ని రకాల మందులు టాక్సిన్లుగా మన కాలేయాన్ని డ్యామేజీ చేస్తాయి. వీటిలో అధిక శాతం టాక్సిన్లు కలుషిత ఆహారం, నీరు ద్వారా, పరిసరాల ద్వారా మన శరీరంలోకి చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.


ఆల్కహాల్‌ లివర్‌ డిసీజ్‌

కాలేయ సమస్యలు తలెత్తితే, అందుకు మద్యపానమే కారణమని నమ్మేవాళ్లు ఎక్కువ. నిజానికి ఆల్కహాల్‌, ఫ్యాటీ లివర్‌ అనేవి రెండు వేర్వేరు సమస్యలు. మద్యపానం అలవాటు లేకపోయినా, మధుమేహం, స్థూలకాయాలతో ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్‌ ఉన్న వ్యక్తికి మద్యం తాగే అలవాటు కూడా ఉంటే, లివర్‌ డ్యామేజ్‌ వేగం రెట్టింపవుతుంది. అయితే మద్యపానం చేసే వాళ్లకు వచ్చే సమస్యను వైద్య పరిభాషలో ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ అంటారు. వీళ్లకు ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ లేకపోయినా, యుక్తవయసు నుంచే మద్యపానం అలవాటు ఉంటే, 25 ఏళ్ల వయసు నుంచే లివర్‌ సమస్యలు మొదలు కావచ్చు. కాబట్టి మద్యపానం విషయంలో ఎంత తాగుతున్నాం? ఎలాంటి మద్యం తాగుతున్నాం? ఎంత తరచుగా తాగుతున్నాం? అనే అంశాలు కూడా ముఖ్యమే!


చికిత్స మనలోనే...

ఫైబ్రోసిస్‌ చివరి దశకు చేరుకోనంత వరకూ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ తనంతట తాను తగ్గిపోయే సమస్యే! ఆహారపుటలవాట్లు, మధుమేహాల మీద పట్టు సాధించగలిగితే ఫ్యాటీ లివర్‌ క్రమేపీ తగ్గిపోతుంది. అంతిమంగా కాలేయం పూర్తిగా దెబ్బతిని, కాలేయ మార్పిడి చేసుకునే పరిస్థితి కంటే, ముందుగానే మేల్కొని జాగ్రత్తపడి కాలేయాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది.


 డాక్టర్‌ టామ్‌ చెరియన్‌, 

లివర్‌ సర్జన్‌,

సౌత్‌ ఏషియన్‌ లివర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకులు, హైదరాబాద్‌.


నేడు వరల్డ్‌ లివర్‌ డే


కాలేయానికి రక్ష!

కాలేయం ఎంతో అందమైన అవయం. దాన్ని మనంతట మనం పాడుచేసుకోనంత కాలం దానికే సమస్యా ఉండదు. చర్మం ఆరోగ్యం కోసం క్రీములూ, లోషన్లూ పూసుకుంటాం. ఎముకల ఆరోగ్యానికి పాలు పాలూ, పెరుగూ తింటూ ఉంటాం. వాటితో పోల్చుకుంటే కాలేయానికి ఎటువంటి అదనపు జాగ్రత్తలూ తీసుకోవలసిన అవసరం లేదు. సరిపడా నీళ్లు తాగుతూ, సమతులాహారం తీసుకుంటే కాలేయం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బరువు, చక్కెరలు కూడా పెరగకుండా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి ఉండే పుల్లని పండ్లు, కూరగాయలు కాలేయానికి మేలు చేస్తాయి. బెర్రీ పండ్లు కూడా కాలేయాన్ని కాపాడతాయి. 


ఖర్చు తగ్గించాలి..

ప్రస్తుతం కాలేయ వ్యాధి వస్తే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని అనేక మంది వాపోతూ ఉంటారు. వ్యాధిగ్రస్తులు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి ఎక్కువ శాతం కాలేయ సమస్యలకు ఆసుపత్రుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓపీ పేషెంట్లగా ట్రీట్‌ చేసి ఇంటికి పంపేయవచ్చు. శస్త్ర చికిత్స అవసరమైన వారిని మాత్రమే కొద్ది కాలం ఆసుపత్రిలో ఉంచాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడాలంటే లివర్‌ క్లీనిక్స్‌ ఎక్కువగా రావాలి. అప్పుడు చికిత్సకు అయ్యే ఖర్చు చాలా తగ్గిపోతుంది. సౌత్‌ ఏషియన్‌ లివర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మేము అలాంటి ప్రయోగమే చేస్తున్నాం. 


ఆల్కహాల్‌ లివర్‌ డిసీజ్‌


కాలేయ సమస్యలు తలెత్తితే, అందుకు మద్యపానమే కారణమని నమ్మేవాళ్లు ఎక్కువ. నిజానికి ఆల్కహాల్‌, ఫ్యాటీ లివర్‌ అనేవి రెండు వేర్వేరు సమస్యలు. మద్యపానం అలవాటు లేకపోయినా, మధుమేహం, స్థూలకాయాలతో ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్‌ ఉన్న వ్యక్తికి మద్యం తాగే అలవాటు కూడా ఉంటే, లివర్‌ డ్యామేజ్‌ వేగం రెట్టింపవుతుంది. అయితే మద్యపానం చేసే వాళ్లకు వచ్చే సమస్యను వైద్య పరిభాషలో ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ అంటారు. వీళ్లకు ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ లేకపోయినా, యుక్తవయసు నుంచే మద్యపానం అలవాటు ఉంటే, 25 ఏళ్ల వయసు నుంచే లివర్‌ సమస్యలు మొదలు కావచ్చు. కాబట్టి మద్యపానం విషయంలో ఎంత తాగుతున్నాం? ఎలాంటి మద్యం తాగుతున్నాం? ఎంత తరచుగా తాగుతున్నాం? అనే అంశాలు కూడా ముఖ్యమే!


మన దేశంలోనే ఎక్కువ

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ కాలేయ సమస్యలకు హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన కారణంగా ఉండేది. క్రమేపీ ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అస్తవ్యస్థ జీవనశైలి, ఆహారపుటలవాట్ల మూలంగా కాలేయ వ్యాధుల తీవ్రత పెరిగింది. మనలో ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్‌ ఉంటోంది. మధుమేహ రాజధానిగా పేరు తెచ్చుకున్న మన భారతదేశంలో 9 - 32ు మంది స్థూలకాయులు, మధుమేహుల్లో ఫ్యాటీ లివర్‌ ఉన్నట్టు ఓ అంచనా! 2015లో ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయిన 20 లక్షల మందిలో, 18ు మంది మన భారత దేశానికి చెందినవారే! 

Updated Date - 2022-04-19T06:08:22+05:30 IST