అనుమతులు లేకున్నా.. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో కరోనా వైద్యం..!

ABN , First Publish Date - 2021-05-15T05:38:23+05:30 IST

కడప నగరంలోని రైల్వేస్టేషన రోడ్డులో ఓ ముఖ్య నేత కుటుంబీకులు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైద్యుల ప్రిస్ర్కిప్షన మేరకు ఎక్స్‌రే, స్కానింగ్‌ తదితర పరీక్షలు చేయాల్సి ఉంది.

అనుమతులు లేకున్నా..   డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో కరోనా వైద్యం..!

రోజుకు రూ.25వేలు వసూలు

సీఎం జిల్లాలోనే నిబంధనలకు తూట్లు


వైద్యసేవలు అందించాలంటే ఆసుపత్రులు ఉండాలి. క్వాలిఫైడ్‌ డాక్టర్లు ఉండాలి. ఇవన్నీ తప్పనిసరి. కానీ అధికారంలో ఉండే వారికి ఇవన్నీ అవసరం లేదన్నట్టు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో అయినా వైద్యం చేసేస్తున్నారు. వాళ్లేదో తలనొప్పికో, లేక కడుపు నొప్పికో ట్రీట్‌మెంటు చేయడం లేదు. ప్రపంచాన్నే గడగడలాడిస్తూ ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి కరోనాకు ట్రీట్‌మెంటు ఇవ్వడం ఇప్పుడు కడపలో హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం సొంత జిల్లా కేంద్రం కడపలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.


కడప, మే 14 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలోని రైల్వేస్టేషన రోడ్డులో ఓ ముఖ్య నేత కుటుంబీకులు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైద్యుల ప్రిస్ర్కిప్షన మేరకు ఎక్స్‌రే, స్కానింగ్‌ తదితర పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే కరోనాకు ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకున్నారో ఏమో వెంటనే నిబంధనలకు విరుద్ధంగా డయాగ్నోస్టిక్‌ సెంటరులో కొవిడ్‌ చికిత్స మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. రోజుకు రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తూ ట్రీట్‌మెంటు ఇస్తున్నట్లు తెలుస్తోంది. డయాగ్నోస్టిక్‌ సెంటరులో కొవిడ్‌ వైద్యం నిర్వహించుకునేందుకు నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే అనుమతులు రాకముందే ట్రీట్‌మెంటు ఇస్తున్నట్లు చెబుతున్నారు. 


అధికారులపై ఒత్తిడి..?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్‌కు వైద్యం అందించాలంటే  క్వాలిఫెడ్‌ౖ వైద్యులతో పాటు ఐదు పడకలకు ఒక స్టాఫ్‌ నర్సు ఉండాలి. ఆక్సిజన తదితరాలు అందించాలి. అనుమతులు వచ్చిన తరువాతనే వైద్యం అందించాలి. అయితే ఇక్కడ మాత్రం అనుమతులు లేకున్నా ట్రీట్‌మెంటు చేస్తున్నారు. ఈ విషయం జిల్లా వైద్యాఽధికారి అనిల్‌కుమార్‌ దృష్టికి వెళ్లగా ఆయన డయాగ్నోిస్టిక్‌ సెంటరును తనిఖీ చేసి కొవిడ్‌కు ట్రీట్‌మెంటు ఇస్తున్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందిగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఆ ఆసుపత్రి మనదేనంటూ ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల అధికారులు పలు ఆసుపత్రులను తనిఖీ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝులిపించారు. రెండింటికి అపరాధ రుసుం విధించగా ఒక దానికి కొవిడ్‌ చికిత్సకు అనుమతులు నిలిపివేశారు. మరి వాటి మాదిరిగానే ఈ డయాగ్నోస్టిక్‌ సెంటరుపై కూడా చర్యలు తీసుకుంటారో, లేక ‘మనదే’ కదా అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే. ఈ విషయమై డీఎంహెచఓ అనిల్‌కుమార్‌ను వివరణ కోసం ఫోనలో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


మరో 1,460 పాజిటివ్‌ కేసులు నమోదు

- నలుగురు మృతి

కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. 24గంటల వ్యవధిలో మరో 1,460 మంది వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటినలో ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,868కి చేరుకుంది. మరో న లుగురు మృతి చెందగా ఈ సంఖ్య 585కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 620 మందిని డిశ్చార్జి చేశారు. రికవరీ సంఖ్య 68,905కు చేరింది. 8,228 మంది హోం ఐసోలేషన, 1,996 మంది ఆసుపత్రుల్లో, కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 


మండలాల వారీగా కేసులు..

జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 150 కేసులు వచ్చాయి.  రైల్వేకోడూరు మండలంలో 123, పులివెందుల 100, రాజంపేట 85, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల మండలాల్లో 75 చొప్పున, ఎర్రగుంట్ల 66, సింహాద్రిపురం 56, కొండాపురం 53, చాపాడు, నందలూరు మండలాల్లో 52 వంతున, రాయచోటి 51, మైదుకూరు 48, ఓబులవారిపల్లె 46, బద్వేలు 37, జమ్మలమడుగు 34, గాలివీడు 33, లింగాల 29, కమలాపురం 28, పెద్దముడియం మండలంలో 27 కేసులు నమోదయ్యాయి. అలాగే, పుల్లంపేట మండలంలో 26, తొండూరు 25, బి.మఠం 24, వేముల 23, చిట్వేలి 19, పెనగలూరు 19, వల్లూరు 18, వీరబల్లె 17, దువ్వూరు, ఖాజీపేట, సంబేపల్లె మండలాల్లో 16 వంతున, చక్రాయపేట, అట్లూరు మండలాల్లో 15 చొప్పున, ముద్దనూరు, సిద్దవటం మండలాల్లో 14 వంతున, చిన్నమండెం మండలంలో 13, ఒంటిమిట్ట 12, గోపవరం 11, సీకేదిన్నె 9, ఎల్‌ఆర్‌పల్లె 7, కలసపాడు, మైలవరం, వేంపల్లె మండలాల్లో 6, వీఎనపల్లె, పెండ్లిమర్రి, రాజుపాలెం  మండలాల్లో 4, చెన్నూరు 3, టి.సుండుపల్లె,  రామాపురం మండలాల్లో 2,  బికోడూరు, కాశినాయన మండలాల్లో ఒక్కొక్కటి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిలో 3 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-05-15T05:38:23+05:30 IST