కొవిడ్‌ ఆనవాళ్లు లేకుండా...

ABN , First Publish Date - 2021-12-21T05:31:26+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకుని నెలలు గడుస్తున్నా, కొన్ని ఆరోగ్య సమస్యలు కొనసాగుతూనే

కొవిడ్‌ ఆనవాళ్లు లేకుండా...

కొవిడ్‌ నుంచి కోలుకుని నెలలు గడుస్తున్నా, కొన్ని ఆరోగ్య సమస్యలు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఇలాంటి కొవిడ్‌ తదనంతర ప్రభావాలను ఆయుర్వేద చికిత్సలతో తగ్గించుకోవచ్చు. 


కొవిడ్‌ బాధితుల్లో దీర్ఘకాలం పాటు త్రిదోషాల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. వాత, పిత్త దోషాలతో కూడిన శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. కొందరు మహిళల్లో రుతు సమస్యలు, థైరాయిడ్‌ హెచ్చుతగ్గులు కనిపించడం సహజం. ఎక్కువ శాతం మందిలో జుట్టు రాలే సమస్య, తరచూ శ్వాసకోశ సమస్యలు వేధిస్తూ ఉండడం కూడా సర్వసాధారణమే! మరికొంత మందికి  కొవిడ్‌ సమయంలో కోల్పోయిన వాసన, రుచులు ఏడాది తర్వాత కూడా తిరిగి రావు. మరికొందర్లో బలహీనత, నిస్సత్తువలు వదలకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి కొవిడ్‌ తదనంతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆయుర్వేదం మూడు రకాల చికిత్సా విధానాలను అనుసరిస్తుంది. వాటిలో మొదటిది... కొవిడ్‌ దాడితో సన్నగిల్లిన వ్యాధినిరోధకశక్తిని వృద్ధి చేయడం. రెండవది.. త్రిదోషాల్లో హెచ్చుతగ్గులను సరిదిద్దే త్రిదోష శమన చికిత్స. మూడవది... దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థను సరిదిద్దే చికిత్స.


త్రిదోష శమన

దోషాల్లో హెచ్చుతగ్గుల కారకాలను శరీరం నుంచి తొలగించడంతో పాటు, శరీర కణజాలంలో మిగిలిపోయిన టాక్సిన్లను హరించడం త్రిదోష శమన చికిత్స ఉద్దేశం. ఇందుకోసం పూర్వ కర్మ, ప్రధాన కర్మ, పశ్చత్‌ కర్మ అనే మూడు అంచెల్లో చికిత్స కొనసాగుతుంది. పూర్వ కర్మలో భాగంగా స్నేహన, స్వేదన చికిత్సలతో శుద్ధికి శరీరాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రధాన కర్మలో భాగంగా పంచకర్మ చికిత్స (వమన, విరేచన, వస్థి, అనువాసన వస్థి, నశ్య కర్మ), అంతిమంగా పశ్చత్‌ కర్మ చికిత్సలు కొనసాగుతాయి.


 రుచి, వాసన కోల్పోతే: ఇది నాడీ సంబంధ సమస్య. కరోనా వైరస్‌ ఆల్‌ఫ్యాక్టరీ నాడులను దెబ్బతీయడం మూలంగా రుచి, వాసనలను కోల్పోతారు. కాబట్టి శిరోధార చికిత్సతో నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, నశ్య చికిత్స, విరేచన చికిత్సలు కూడా అందించవలసి ఉంటుంది. అలాగే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్న అంశాన్ని కనిపెట్టి, దాన్ని బలహీనపరచడం లక్ష్యంగా చికిత్స కొనసాగుతుంది. 


 శ్వాసకోశ సమస్యలు: పంచకర్మ చికిత్సతో పాటు, సదరు బాధితుడి శరీర దారుఢ్యం ఆధారంగా వమన చికిత్సను ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. నాసిక, ఊపిరితిత్తుల శుధ్ధి కోసం నశ్య చికిత్స, ఊపిరితిత్తులను బలోపేతం చేయడం కోసం ఉరోవస్థి చికిత్సను అందించవలసి ఉంటుంది. 


కీళ్ల నొప్పులు: వాత దోషంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడితే కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా నెలల తరబడి కీళ్ల నొప్పులు వేధిస్తాయి. శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయాయి అనడానికి కీళ్ల నొప్పులు సూచనలు. కాబట్టి టాక్సిన్లను శరీరం నుంచి తొలగించడం కోసం ‘ఆమ’ను తగ్గించడం కోసం అందుకు తోడ్పడే చికిత్సలను వైద్యులు సూచిస్తారు. కండరాల నొప్పులకు తైల పోట్లీ చికిత్స, కీళ్ల నొప్పులకు తైల అభ్యంగనం చికిత్సలు తోడ్పడతాయి. 


 జుట్టు రాలడం: శిరో మర్దన, నశ్య చికిత్స, ప్రాణాయామం, యోగాలతో ఈ సమస్యను అదుపు చేయవచ్చు. అలాగే సూర్యరశ్మి సోకేలా సూర్యనమస్కారాలు చేయవలసి ఉంటుంది. అలాగే తీవ్రత ఆధారంగా శిరోధార, శిరో అభ్యంగన, శిరోలేపన ఆయుర్వేద చికిత్సలను అనుసరించవలసి ఉంటుంది. 


 బలహీనత: మెటబాలిజం, జీర్ణశక్తిలను వృద్ధి చేసే ఆమ పచన చికిత్స, ఉద్వర్తనం (చూర్ణ చికిత్స), వేర్వేరు ఔషధాలు కలిపిన నెయ్యిని తినిపించే స్నేహపానం ప్రధాన చికిత్సలు. ఈ చికిత్సలో వేర్వేరు శరీర భాగాల్లో హెచ్చుతగ్గులకు లోనైన దోషాల ఆధారంగా వేర్వేరు ఔషధాలను ఎంచుకోవడం జరుగుతుంది. 



కొవిడ్‌ తదనంతర ఆహారశైలి

లాంగ్‌ కొవిడ్‌ నుంచి బాధితులు త్వరగా కోలుకోవడం కోసం బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలని అల్లోపతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదం కొవిడ్‌ బాధితులకు కొన్ని ఆహార నియమాలను సూచిస్తోంది. శ్వాసకోశ సమస్యలను ప్రేరేపించే పదార్థాలు, అగ్నిని పెంచి, జీర్ణ సమస్యలకు కారణమయ్యే పదార్థాలను తగ్గించాలి. అలాగే తేలికగా జీర్ణమయ్యే, పోషకభరిత ఆహారపదార్థాలను మాత్రమే కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వాళ్లు ఎంచుకోవాలి. పప్పులు, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవాలి. పచ్చి కూరగాయలు, చల్లని పదార్థాలను పూర్తిగా మానేయాలి.


అలాగే తేనె, పసుపులను ఎక్కువగా తీసుకోవాలి. జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, అల్లం కలిపి మరిగించిన నీటిని రోజంతా తాగుతూ ఉండడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. ఈ నీటితో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కరిగిపోవడంతో పాటు, బలహీనత కూడా తొలుగుతుంది. జీలకర్రతో వాత దోషం, ధనియాలతో పిత్త దోషం, అల్లంతో కఫ దోషాలు తగ్గుతాయి. పసుపు యాంటీసెప్టిక్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది, శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.




పంచకర్మ శుద్ధి

శరీరంలోని విషాలను హరించే పంచకర్మ శుద్ధి, లాంగ్‌ కొవిడ్‌తో బాధపడే ప్రతి ఒక్కరికీ సూచించే చికిత్స. ఈ చికిత్సలో దశలవారీ విధానాలను అనుసరించడం జరుగుతుంది. అవేంటంటే...

 దీపన: ఔషధాలతో జీర్ణశక్తిని పెంచే చికిత్స ఇది. 

 పచన: జీర్ణం కాకుండా మిగిలిపోయిన పదార్థాలను ఔషధాలతో జీర్ణమయ్యేలా చేసే చికిత్స ఇది. 

 స్నేహపాన: నూనె లేదా నెయ్యిలతో శరీరంలో జారుడుతనాన్ని పెంచే చికిత్స ఇది. స్నేహపానంతో దోషాలతో కూడిన విషాలు పలుచనై విసర్జింపబడతాయి. 

 స్వేదన: ఈ చికిత్సతో అదనంగా పేరుకుపోయిన విషాలన్నీ ఉదరం వైపు ప్రయాణిస్తాయి. స్నేహపాన లేదా స్వేదన చికిత్సలతో పలుచనైన విషాలను వాంతి లేదా విరేచనం ద్వారా శరీరం బయటకు పంపించడం జరుగుతుంది.

 వమన: శరీరంలో విపరీతంగా పెరిగిన కఫ దోషాన్ని వమన చికిత్సతో తగ్గించవచ్చు. 

  విరేచన: పిత్త దోషం శరీరంలో పేరుకుపోయినప్పుడు తోడ్పడే చికిత్స ఇది. 

 వస్థి: నూనె లేదా కషాయాలతో కూడిన వస్థితో పెరిగిన వాత దోషం సమం అవుతుంది. 




అతి అనర్థమే!

కరోనా సరికొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ గురించి భయం అవసరం లేదు. ఈ వేరియెంట్‌ తీవ్రత తక్కువే! కాబట్టి ముందు నుంచీ అనుసరిస్తున్న కొవిడ్‌ రక్షణ చర్యలు కొనసాగిస్తూనే, బలవర్ధకమైన అహారం తీసుకోవాలి. శ్వాసకోశ వ్యవస్థను బలపరుచుకోవడం కోసం అవసరానికి మించి ఆవిరి పట్టడం లాంటి పనులు చేయకూడదు. ఇలా ఎక్కువ సార్లు ఆవిరి పట్టడం వల్ల శ్వాసకోశాల్లో నివశించే మంచి బ్యాక్టీరియా చనిపోయి, ఇన్‌ఫెక్షన్లు సోకే వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ముక్కులోని సున్నితమైన పైపొర నాసల్‌ ఎపిథీలియం దెబ్బతిని, తేలికగా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అలాగే అల్లం, శొంఠి, మిరియాల పొడి లాంటి వేడిని పెంచే పదార్థాలతో అదే పనిగా కషాయాలు తయారు చేసుకుని తాగడం వల్ల, అసిడిటీ లాంటి సమస్యలూ తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి సొంత వైద్యాలను మానుకుని, వైద్యుల సూచన ప్రకారం నడుచుకోవాలి. ప్రతి రోజూ ‘నశ్య’ చికిత్స అనుసరించడం ఆరోగ్యకరం. కళ్లకు పూసుకునే ‘అంజన’ చికిత్సను కూడా ప్రతి రోజూ అనుసరించవచ్చు. వేడి నీటిని పుక్కిలించే ‘కబళ’ చికిత్స కూడా ఆరోగ్యకరం. ఈ మూడు చికిత్సలతో వైరస్‌ ప్రవేశించే మార్గాలైన ముక్కు, నోరు, కళ్లకు రక్షణ కల్పించుకోవచ్చు. 

డాక్టర్‌ ఎన్‌. ప్రియా దేవి, ఆయుర్వేద వైద్యులు,

కైరళి ఆయుర్వేదిక్‌ హీలింగ్‌ విలేజ్‌, పాలక్కాడ్‌, కేరళ.


Updated Date - 2021-12-21T05:31:26+05:30 IST