రెండో వివాహం కోసం మాట్రీమోనీలో ఎన్నారైని కలిసిన మహిళ.. పెళ్లి పేరుతో ఆ ఎన్నారై ఆమెను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-14T05:48:09+05:30 IST

భర్త నుంచి విడాకులు తీసుకున్న ఒక 40 ఏళ్ల మహిళ.. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంది. అలా ఆన్‌లైన్‌లో ఆమెకు ఒక ఎన్నారై పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది...

రెండో వివాహం కోసం మాట్రీమోనీలో ఎన్నారైని కలిసిన మహిళ.. పెళ్లి పేరుతో ఆ ఎన్నారై ఆమెను ఏం చేశాడంటే..

భర్త నుంచి విడాకులు తీసుకున్న ఒక 40 ఏళ్ల మహిళ.. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంది. అలా ఆన్‌లైన్‌లో ఆమెకు ఒక ఎన్నారై పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఆ ఎన్నారై ఆమెను నమ్మించి మోసం చేశాడు.


వివరాల్లోకి వెళితే.. ముంబైలో నివసించే మహిమ(40) అనే మహిళ కొన్ని నెలల క్రితం తన భర్తతో విడాకులు తీసుకుంది. జీవితంలోతనకంటూ ఒక తోడు కోసం రెండో వివాహం చేసుకుందామని మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంది. ఆ వెబ్‌సైట్‌లో ఆమెకు సుధాకర అనే అమెరికా ఎన్నారై పరిచయమయ్యాడు. వారిద్దరూ రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. సుధాకర్ ఒక ఇంటిరియర్ డిజైనర్ అని, అతని భార్య కొన్ని నెలల క్రితం ఒక రోడ్డు పమాదంలో మరణించిందని చెప్పాడు. అతనికి ఒక 6 ఏళ్ల పాప కూడా ఉందని మహిమతో అన్నాడు.


ఇక ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. మహిమను పెళ్లి చేసుకోవడానికి సుధాకర్ ఇండియా వస్తున్నాడని కూడా చెప్పాడు. ఈ క్రమంలో ఒకరోజు మహిమకు సుధాకర్ ఫోన్ చేసి తను అమెరికా నుంచి వచ్చి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్నానని చెప్పాడు. తన వద్ద 2 లక్షల అమెరికా డాలర్లు ఉన్నందున ఎయిర్ పోర్టులో తనను కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారని.. రూ.45 లక్షలు ఫైన్ కడితే తనను విడిచిపెడతారని సుధాకర్ వివరించాడు.


మహిమ తన ఎన్నారై ప్రియుడిని కాపాడేందుకు వెంటనే సుధాకర్ చెప్పిన ఇద్దరు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లకు రూ.45 లక్షలు ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తరువాత నుంచి సుధాకర్ ఫోన్ రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోంది. 


రెండు రోజుల తరువాత మహిమ ఓపిక నశించింది. తాను మోసపోయానేమోనని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిమ డబ్బు పంపిన బ్యాంకు అకౌంట్ల వివరాలను సేకరించి.. అన్సారి(22), రాజ్ కుమార్ పాండే(37) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మ్యాట్రిమోనీ నకిలీ ఎన్నారై సుధాకర్ ఈ ప్లాన్ అంతటికీ మాస్టర్ మైండ్ అని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం సుధాకర్ పరారీలో ఉన్నాడు.




Updated Date - 2022-02-14T05:48:09+05:30 IST