Miracle baby: ఆరు గర్భస్రావాల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. లోపంతో పుట్టిన ఆ బిడ్డ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-30T22:32:18+05:30 IST

కశ్మీర్‌కు చెందిన ఆ మహిళకు 2016లో వివాహం జరిగింది.. ఆమెలో ఉన్న జన్యు లోపాల కారణంగా ఆమెకు గర్భ

Miracle baby: ఆరు గర్భస్రావాల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. లోపంతో పుట్టిన ఆ బిడ్డ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

కశ్మీర్‌కు చెందిన ఆ మహిళకు 2016లో వివాహం జరిగింది.. ఆమెలో ఉన్న జన్యు లోపాల కారణంగా ఆమెకు గర్భ సంబంధమైన సమస్యలు ఉన్నాయి.. ఫలితంగా మూడు సార్లు ఆమెకు గర్భస్రావాలు జరిగాయి.. మరో మూడు సార్లు వైద్యులే ఆమె గర్భంలోని పిండాలను తొలగించారు.. గర్భంలో పిండం అభివృద్ధి చెందే ప్రారంభ నెలల్లో న్యూరల్ ట్యూబ్‌లో (neural tube defects) లోపాల వల్ల శిశువు మెదడులో ద్రవాలు చేరి ఉబ్బినట్టు కనిపించేవి.. అలాంటి శిశువులు బతకరనే ఉద్దేశంతో వైద్యులు మూడుసార్లు ఆమె గర్భాన్ని తొలగించారు.. గతేడాది ఆమె మరోసారి గర్భం దాల్చింది.. ఈసారి కూడా అదే సమస్య ఎదురైంది.. అయితే ఛండీగఢ్‌ (Chandigarh)లోని డాక్టర్ పర్యవేక్షణలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది.




న్యూరల్ ట్యూబ్ లోపాలు అనేవి పుట్టుకతో వచ్చే సమస్యలు. ఈ లోపాలకు ఖచ్చితమైన కారణాలు చాలా వరకు తెలియవు. కానీ జన్యు కారణాలు, పోషకాహారం లోపం, పర్యావరణం కాలుష్యం మొదలైనవి కారణాలు కావచ్చు. చండీగఢ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మే 8న ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. `కశ్మీర్‌ వైద్యులు మళ్లీ నా గర్భన్ని తొలగించుకోవాలని సలహా ఇచ్చారు. అయినా మేము ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఛండీగఢ్‌లోని ఓ డాక్టర్‌ను సంప్రదించామ`ని ఆ మహిళ చెప్పింది. ఆమె గర్భంలోని బిడ్డ మెదడులో కొద్దిగా వాపు ఉన్నట్టు గమనించామని, అయితే అది అంత పెద్ద లోపం కాదని నిర్ణయానికి వచ్చాక ఆమెకు వైద్యం కొనసాగించామని వైద్యురాలు సీమా శర్మ చెప్పారు. 


`గర్భంలోని శిశువు మెదడులో ఏదైనా అసాధారణత ఉన్నట్టు అనుమానం వచ్చినంత మాత్రాన ఆ గర్భాలను తొలగించనవసరం లేదు. చాలా వరకు కేసుల్లో చిన్న చిన్న లోపాలు తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న నిర్మాణ లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవచ్చ`ని సీమా తెలిపారు. సీమా పర్యవేక్షణలో బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ బిడ్డ చాలా చిన్న లోపంతో జన్మించింది. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ తెలిపారు. 

Updated Date - 2022-07-30T22:32:18+05:30 IST