Married Woman: పెళ్లై 15 ఏళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో.. చివరిగా ఒకేఒక్క ఆశతో..

ABN , First Publish Date - 2022-04-27T19:47:52+05:30 IST

వాణి, మంజునాథ్ భార్యాభర్తలు. ఈజీ మనీ కోసం ఫేక్ డాక్టర్లుగా మారారు. సంతానలేమితో చింతిస్తున్న దంపతులను..

Married Woman: పెళ్లై 15 ఏళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో.. చివరిగా ఒకేఒక్క ఆశతో..

తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫేక్ డాక్టర్లుగా మారి ప్రజలను మోసం చేస్తున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వల్ల ఓ మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడం శోచనీయం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన వాణి, మంజునాథ్ భార్యాభర్తలు. ఈజీ మనీ కోసం ఫేక్ డాక్టర్లుగా మారారు. సంతానలేమితో చింతిస్తున్న దంపతులను టార్గెట్ చేసుకుని IVF వైద్య విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని కొందరు భార్యాభర్తల నుంచి లక్షల్లో డబ్బు దండుకున్నారు. ఆ బాధితుల్లో మమత(34), మల్లిఖార్జున్ అనే భార్యాభర్తలు కూడా ఉన్నారు.


ఈ దంపతులకు పెళ్లై 15 ఏళ్లు దాటినా సంతానం కలగలేదు. పిల్లల కోసం చాలా ఆసుపత్రుల్లో భార్యాభర్తలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎన్నో మందులు వాడారు. అయినప్పటికి ప్రయోజనం లేకపోయింది. చివరకు ఈ దంపతులు ఎవరి ద్వారానో ఫేక్ డాక్టర్లైన వాణి, మంజునాథ్ లను సంప్రదించారు. తమకు పెళ్లై 15 ఏళ్లవుతున్నా పిల్లలు లేరని, సంతానం కోసం ఎన్నో ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఫలితం లేకుండా పోయిందని తమ వేదనను చెప్పుకున్నారు. పిల్లలు లేరన్న చింత ఇక అక్కర్లేదని, తమ వద్దకు పెళ్లయి 20 ఏళ్లు దాటినా పిల్లలు కలగని వారు వచ్చారని ఈ ఫేక్ డాక్టర్లు చెప్పారు. అలాంటి వారికి కూడా తాము IVF వైద్య విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేశామని నమ్మబలికారు. ఇదంతా నిజమని నమ్మి మల్లిఖార్జున్, మమత కొండంత ఆశతో రూ.4 లక్షలు చెల్లించారు. IVF Treatment మొదలుపెట్టారు. ఈ ట్రీట్ మెంట్ తీసుకున్న క్రమంలో మమత అనారోగ్యం బారిన పడింది.


కడుపులో పిండం ఏర్పడే క్రమంలో ఈ లక్షణాలు సహజంగా కనిపిస్తాయని, భయపడాల్సిన అవసరం లేదని ఈ ఫేక్ డాక్టర్ దంపతులు మమత, మల్లిఖార్జున్ కు చెప్పారు. అలా అనారోగ్య లక్షణాలు కనిపించాయని చెప్పిన ప్రతిసారీ మందుల పేరుతో డబ్బులు దండుకునేవారు. మమత పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఇటీవల వేరే ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంది. అప్పుడు అసలు విషయం బయటపడింది. IVF Treatment వల్ల ఆమె కడుపులో ఎలాంటి పిండం ఏర్పడలేదని తెలిసింది. ఆమె గర్భవతి కాదని తెలియడమే కాదు Fake IVF Treatment వల్ల కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, గర్భాశయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని తేలింది. తీవ్ర అనారోగ్యం పాలైన మమత ఏప్రిల్ 23న చికిత్స పొందుతూ మృతి చెందింది. మమత భర్త మల్లిఖార్జున్ ఫిర్యాదుతో ఈ ఫేక్ డాక్టర్ దంపతుల నిర్వాకం బయటపడింది. నిందితులను విచారించగా ఇద్దరూ టెన్త్ వరకూ మాత్రమే చదివారని తెలిసింది. వీరి ఈజీ మనీ అత్యాశ ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైంది.

Updated Date - 2022-04-27T19:47:52+05:30 IST