ముక్కు ఆకృతిని మార్చుకునేందుకు వధువు సర్జరీ.. ఫలితం చూసి పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-11T19:05:02+05:30 IST

అందంగా కనిపించాలనే ఆశతో ఆ యువతి తన ముక్కుకు చేయించుకున్న ఆపరేషన్ కాస్తా వికటించింది.

ముక్కు ఆకృతిని మార్చుకునేందుకు వధువు సర్జరీ.. ఫలితం చూసి పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. అసలేం జరిగిందంటే..

దుబాయ్: అందంగా కనిపించాలనే ఆశతో ఆ యువతి తన ముక్కుకు చేయించుకున్న ఆపరేషన్ కాస్తా వికటించింది. దాంతో ముక్కు ఆకృతి మారిపోవడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో యువతి తనకు ఆపరేషన్ నిర్వహించిన మెడికల్ సెంటర్, వైద్యుడిపై కోర్టుకెక్కింది. ఈ కేసును విచారించిన దుబాయ్ న్యాయస్థానం ఆమెకు 50వేల దిర్హమ్స్(రూ.10.51లక్షలు) పరిహారం చెల్లించాల్సిందిగా మెడికల్ సెంటర్, వైద్యుడిని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె పెళ్లి ఆగిపోవడమే ఇప్పుడు అసలు సమస్య. ఇటీవలే ఆమెకు పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలోనే ముక్కు ఆకృతిని మార్చుకునేందుకు ఆమె సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. కానీ, ఆ ఆపరేషన్ కాస్తా వికటించడంతో మొదటికే మోసం వచ్చింది. సర్జరీ వల్ల యువతి ముఖం మొత్తం మారిపోవడంతో వరుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. 


అసలేం జరిగిందంటే..

ఓ యువతి(ఆమె జాతీయత, వయసు తెలియరాలేదు) 2020 నవంబర్ 21న దుబాయ్‌లో స్థానికంగా ఉండే ఓ మెడికల్ సెంటర్‌లో తన ముక్కు ఆకృతి మార్చుకునేందుకు సర్జరీ చేయించుకుంది. ఆ సమయంలో అక్కడి డాక్టర్ ఆమె ముక్కుకు బొటాక్స్, ఫిల్లర్‌లతో ఇంజెక్ట్ చేసి దాని ఆకారాన్ని సర్దుబాటు చేశారు. అయితే, ఆ తర్వాతి రోజు ఆమెకు విపరీతమైన తలనొప్పి, ముక్కు వాచిపోవడం జరిగాయి. దాంతో సర్జరీ చేసిన వైద్యుడిని కలవగా ఐస్ ప్యాక్ వినియోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పి పంపించేశాడు. కానీ, నొప్పి తగ్గకపోవడంతో రెండోరోజు మళ్లీ మెడికల్ సెంటర్‌కు వెళ్లింది. దాంతో సదరు వైద్యుడు రెండు ఇంజెక్షన్స్‌ ఇచ్చాడు. అలాగే ముక్కుకు రాసుకోవడానికి మరికొన్ని ఐయింట్‌మెంట్స్ ఇచ్చి తిరిగి పంపించేశాడు. రెండు వారాల తర్వాత మళ్లీ రమ్మని చెప్పడంతో మరోసారి వెళ్లింది. అప్పుడు ముక్కును క్లీన్ చేసే సమయంలో చిన్న గాయమైంది. ఆ తర్వాత అదికాస్తా పెద్దది కావడంతో యువతికి మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. దాంతో తర్వాతి రోజు ట్యాక్సీలో మళ్లీ మెడికల్ సెంటర్‌కు బయల్దేరింది. 


అయితే, మార్గం మధ్యలో ఉన్నట్టుండి ముక్కు నుంచి ధారాళంగా రక్తం కారడం మొదలైంది. దాంతో యువతి వెంటనే రషీద్ హాస్పిటల్‌కి వెళ్లింది. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసి చికిత్స అందించడంతో నయం అయింది. చికిత్స సమయంలో కొన్నిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండిపోవడంతో ఆమె జాబ్ పోయింది. అటు పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. సర్జరీ కారణంగా ముఖం మొత్తం మారిపోవడంతో వరుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఇలా ముక్కు సర్జరీ కారణంగా అటు ఉద్యోగం పోయి, ఇటు పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఆమె దుబాయ్ కోర్టును ఆశ్రయించింది. ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడు, మెడికల్ సెంటర్‌పై కేసు వేసింది. తాజాగా ఈ కేసును విచారించిన దుబాయ్ న్యాయస్థానం సర్జరీ చేసిన వైద్యుడు, మెడికల్ సెంటర్‌ను ఆమెకు రూ. 10.51లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.    

Read more