Dubai: స్విమ్ సూట్ ఎంత పనిచేసిందో.. దుబాయ్‌లో మహిళకు నెల రోజుల జైలు.. ఆపై దేశ బహిష్కరణ కూడా..!

ABN , First Publish Date - 2022-09-21T17:50:30+05:30 IST

32 ఏళ్ల మహిళకు దుబాయ్ క్రిమినల్ కోర్టు తాజాగా నెల రోజుల జైలు శిక్ష విధించింది.

Dubai: స్విమ్ సూట్ ఎంత పనిచేసిందో.. దుబాయ్‌లో మహిళకు నెల రోజుల జైలు.. ఆపై దేశ బహిష్కరణ కూడా..!

దుబాయ్: 32 ఏళ్ల మహిళకు దుబాయ్ క్రిమినల్ కోర్టు (Dubai criminal court) తాజాగా నెల రోజుల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఇంతకీ ఆమె చేసిన నేరమెంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 32 ఏళ్ల ఓ మహిళ దుబాయ్‌‌లోని ఓ బట్టల స్టోర్‌కు వెళ్లింది. ఆ స్టోర్‌లోని ఉద్యోగులు మిగతా కస్టమర్లతో బిజీగా ఉండడం గమనించిన ఆమె.. వారికి కనబడకుండా ఓ స్విమ్ సూట్‌ను దొంగిలించి తన బ్యాగులో వేసుకుంది. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకునేందుకు యత్నించింది. 


కానీ, ఎగ్జిట్ వద్ద ఏర్పాట్లు చేసిన యాంటీ-థెఫ్ట్ డివైజ్ (anti-theft device)‌కు చిక్కింది. వెంటనే అలారం మోగడంతో సెక్యూరిటీ గార్డు అప్రమత్తమయ్యారు. సదరు మహిళను అడ్డుకుని తనిఖీ చేయగా ఆమె బ్యాగులో స్విమ్ సూట్ (Swimsuit) కనిపించింది. దాంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. తాజాగా ఆమెను దుబాయ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా ఆమె చోరీకి పాల్పడినట్లు నిర్ధారించే స్టోర్‌లో రికార్డైన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన కోర్టు మహిళను దోషిగా నిర్ధారించింది. అనంతరం ఆమెకు నెల రోజుల జైలు శిక్ష విధించింది. అంతేగాక శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని (Deported) పోలీసులను ఆదేశించింది.  

Updated Date - 2022-09-21T17:50:30+05:30 IST