లేఖ రాసి.. ఇంట్లో పెట్టి.. ఏడేళ్ల కొడుకుతో సహా 12 అంతస్థుల భవనం పైనుంచి..

ABN , First Publish Date - 2021-06-23T19:17:27+05:30 IST

ఏడేళ్ల కుమారుడితో సహా ఓ మహిళ 12 అంతస్థుల భవనం పై నుంచి దూకింది. తన ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది ఓ లేఖను రాసి తన అపార్ట్మెంట్‌లో పెట్టింది కూడా.

లేఖ రాసి.. ఇంట్లో పెట్టి.. ఏడేళ్ల కొడుకుతో సహా 12 అంతస్థుల భవనం పైనుంచి..

ఏడేళ్ల కుమారుడితో సహా ఓ మహిళ 12 అంతస్థుల భవనం పై నుంచి దూకింది. తన ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది ఓ లేఖను రాసి తన అపార్ట్మెంట్‌లోని ఓ గదిలో పెట్టింది కూడా. పోలీసుల విచారణలో ఆ లేఖ బయటపడటంతో ఆమె పక్కింటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన 44 ఏళ్ల రేష్మా ట్రెంచిల్ తన ఏడేళ్ల కొడుకుతో కలిసి ఓ అపార్ట్మెంట్‌లో నివసిస్తోంది. ఆమె భర్త శరత్ ములుకుట్ల మే 23వ తారీఖున మరణించాడు. వృద్ధులైన  తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వారి సంరక్షణ నిమిత్తమై శరత్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి వెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు అతడి తల్లిదండ్రులు ఇద్దరూ కరోనాతో మరణించారు. 


ఈ క్రమంలోనే శరత్ కు కూడా కరోనా సోకింది. అతడు కూడా మే 23న కరోనాతో మరణించాడు. ఇలా భర్త, అత్తమామలు దూరమయిపోగా, ఏడేళ్ల కుమారుడితో రేష్మా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. ఇంత బాధలో ఉన్న ఆమెను పక్కింటి వాళ్లు ఓదార్చింది పోయి మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ‘మీ కొడుకు చేసే అల్లరి భరించలేకపోతున్నాం. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాడు. అతడిని అదుపులో పెట్టండి’ అంటూ ఆమెపై పక్క ఫ్లాట్‌లో నివసించే అయూబ్ ఖాన్ అనే 67 ఏళ్ల వ్యక్తి, అతడి 60 ఏళ్ల భార్య, సాహెబ్ అనే 33 ఏళ్ల కుమారుడు ఆమెపై గొడవలకు దిగారు. ఒకటికి పది సార్లు ఆమెపై పరుష పదజాలంతో మండిపడ్డారు. దీంతో అసలే మానసికంగా బాధలో ఉన్న ఆమె, ఈ గొడవలతో ఇంకాస్త కుంగిపోయింది. 


దీంతో ఆమె తన కుమారుడితో కలిసి సోమవారం 12 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందే ఆమె ఓ లేఖను కూడా రాసి తన గదిలో పెట్టింది. తన ఆత్మహత్యకు పక్క ఫ్లాట్ వాళ్లే కారణమని పేరు కూడా రాసింది. దీన్ని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 33 ఏళ్ల సాహెబ్‌ను అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలోనే మరణించిన తల్లీకొడుకుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-06-23T19:17:27+05:30 IST