అందమైన ఐల్యాండ్‌గా మారిన పంట పొలం... తరలివస్తున్న జనం!

ABN , First Publish Date - 2020-11-25T14:50:32+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన ఒక మహిళ అద్భుతమైన ఐల్యాండ్‌ను సృష్టించారు. ఎవరూ ఊహించని విధంగా...

అందమైన ఐల్యాండ్‌గా మారిన పంట పొలం... తరలివస్తున్న జనం!

కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన ఒక మహిళ అద్భుతమైన ఐల్యాండ్‌ను సృష్టించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె దీనిని తీర్చిదిద్దారు. తన పొలానికి నీటి వసతి లేకపోయినప్పటికీ ఆమె తన అద్భుత కలను సాకారం చేసుకున్నారు. దీనిని చూసినవారంతా అక్కడి ప్రకృతి అందాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.


దూరప్రాంతాల నుంచి ఈ కృత్రిమ ఐల్యాండ్ చూసేందుకు తరలివస్తున్నారు. ఈ ఐల్యాండ్‌ను గుర్తించిన గూగుల్ దీనిని తీర్చిదిద్దిన మహిళకు ప్రశంసలతో కూడిన సర్టిఫికెట్ అందజేసింది. కన్నౌజ్ పరిధిలోని బథువా గ్రామానికి చెందిన కిరణ్ కుమారీ రాజపూత్‌కు గుంద్హాలో 120 చదరపు అడుగుల పంట భూమి ఉంది. ఆ భూమిలోని చాలా భాగాన్ని ఆమె నీటితో నింపారు. దానిని పెద్ద చెరువుగా మార్చారు. ఇందుకోసం ఆమె ప్రభుత్వ పథకం ద్వారా రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. మరికొంత మొత్తాన్ని బంధువుల దగ్గర తీసుకుని, ఆమె చేపల పెంపకాన్ని ప్రారంభించారు. మొత్తం 11 లక్షల రూపాయల ఖర్చుతో ఆ పొలాన్ని చెరువుగా మార్చివేసి చేపల పెంపకం కొనసాగించారు. కుమారుడు శైలేంద్ర సహాయంతో చేపల వ్యాపారాన్ని వృద్ధి చేశారు.


ఇదేసమయంలో ఆ చెరువు మధ్యలో మొక్కలు నాటించి, దానిని ఐల్యాండ్‌గా మార్చారు. ఆ ఐల్యాండ్‌లో మామిడి, అరటి, బొప్పాయి మొదలైన పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా నాటారు. ఇప్పుడు ఆ పండ్ల మొక్కలు పెరిగి ఐల్యాండ్‌కు మరింత అందాన్నిచ్చాయి. దీంతో ఈ ప్రాంతం అందమైన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఫలితంగా సమీపప్రాంతాల్లోని వారంతా ఆహ్లాదం కోసం ఇక్కడికి వస్తున్నారు. చేపలు, పండ్ల విక్రయాలతో ఏటా కిరణ్ కుమారీ రాజపూత్‌ రూ. 25 లక్షల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

Updated Date - 2020-11-25T14:50:32+05:30 IST