Tiktok: భారీ శాలరీతో యువతికి కొత్త ఉద్యోగం.. జాబ్‌లో చేరిన 2 వారాలకు దిమ్మతిరిగే షాక్.. !

ABN , First Publish Date - 2022-07-19T04:07:45+05:30 IST

Woman loses new, higher-paying job after disclosing salary in TikTok video

Tiktok: భారీ శాలరీతో యువతికి కొత్త ఉద్యోగం.. జాబ్‌లో చేరిన 2 వారాలకు దిమ్మతిరిగే షాక్.. !

ఎన్నారై డెస్క్: భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ అమెరికా యువతికి భారీ షాక్ తగిలింది. టిక్‌టాక్(Tiktok) వీడియోలో ఆమె తన శాలరీ(Salary) గురించి వెల్లడించి, చివరకు ఉద్యోగం పోగొట్టుకుంది. రెండు వారాలకే జాబ్ పోవడంతో ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో కంపెనీ యాజమాన్యానికి చేరడంతో లెక్సీకి భారీ షాక్ తగిలింది. లెక్సీకున్న టిక్‌టాక్ అలవాటు కారణంగా తమకు భద్రతాపరమైన సమస్యలు వస్తాయంటూ కంపెనీ ఆమెను జాబ్ నుంచి తొలగించింది. లెక్సీ పొరపాటున ఏదైనా కీలక వివరాలు వెల్లడించే ప్రమాదం ఉన్నందునే ఇలా చేశామని తేల్చి చెప్పింది.  


ఈ విషయాలన్నిటినీ లెక్సీ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. టిక్‌టాక్‌ వల్ల తన ఉద్యోగం పోయిందంటూ బావురుమంది. అయితే.. కంపెనీ యాజమాన్యంపై లెక్సీ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని అక్కడి లాయర్లు చెబుతున్నారు. ఇలా ఉన్నట్టుండి ఉద్యోగంలోంచి తొలగించడం అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా కార్మిక చట్టాల ప్రకారం.. ఉద్యోగులు తమ శాలరీ గురించి ఎవరితోనైనా చర్చించవచ్చు. శాలరీ గురించి బయటకి చెప్పొద్దంటూ కంపెనీలు ఆంక్షలు విధిస్తే అది చట్టరీత్యా నేరమే అవుతుంది. అయితే.. సంస్థకు చెందిన కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా ఉద్యోగ సంబంధిత వివరాలను బయటపెట్టకూడదని కొన్ని కంపెనీలు షరతులు పెడుతుంటాయి. ఇక లెక్సీ తన కంపెనీలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగించి సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేసిందా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

Updated Date - 2022-07-19T04:07:45+05:30 IST