Visa fraud: వీసాకు దరఖాస్తు చేసుకున్న కుటుంబానికి భారీ షాక్..!

ABN , First Publish Date - 2022-08-23T00:01:04+05:30 IST

విసా దరఖాస్తు ప్రక్రియ ఎక్కడి వరకూ వచ్చిందో కనుక్కునే క్రమంలో ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. రెండూ రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ ఎస్‌ఎమ్ఎస్ ద్వారా వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడంతో ఏకంగా రెండు లక్షల మేర కోల్పోవాల్సి వచ్చింది.

Visa fraud: వీసాకు దరఖాస్తు చేసుకున్న కుటుంబానికి భారీ షాక్..!

ముంబై: విసా దరఖాస్తు ప్రక్రియ ఎక్కడి వరకూ వచ్చిందో కనుక్కునే క్రమంలో ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. రెండు రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ ఎస్‌ఎమ్ఎస్ ద్వారా వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడంతో ఏకంగా రెండు లక్షల మేర కోల్పోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ముంబైలోని ఛార్‌కాప్ ప్రాంతంలో నివసించే శశి నిరంకర్‌నాథ్ కౌషల్ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. భార్యాపిల్లలతో కలిసి యూరోప్‌లో విహారా యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. 


ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. వీసా కోసం అప్లై చేసుకుని నెల గడిచిపోయినా తమకు ఈ విషయంలో ఎటువంటి సమాచారం అందలేదు. ఇదిలా ఉంటే.. శనివారం శశి నిరంకర్‌నాథ్ భార్య ఇంట్లోనే ఉండటంతో ఆమె వీసా కన్సల్టెన్సీ వెబ్‌సైట్‌లోకి తమ విసా జారీ ప్రక్రియ ఎక్కడి వరకూ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ లోపు.. శశినిరంకర్  కన్సల్టెన్సీ సంస్థ కస్టమర్‌ కేర్ నెంబర్‌కు ఫోన్ చేసి.. వీసా బట్వాడా చేసే ఓ ప్రముఖ కొరియర్ సంస్థకు ఫోన్‌ నెంబర్ తీసుకుని వారికి ఫోన్ చేశారు. అయితే.. వారి కాల్ వెంటనే కట్ అయిపోయింది. 


మరికొద్ది క్షణాలకే మరో వ్యక్తి వారికి ఫోన్ చేసి తాను వీసా ఏజెంట్ అంటూ పరిచయం చేసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు కట్టకపోవడంతో వారి వీసాలు ఇంకా డిస్పాచ్ కాలేదని చెప్పాడు. ఓ ఎస్‌ఎమ్‌ఎస్ వస్తుందని, యూపీఐ ద్వారా చిన్న మొత్తాన్ని కట్టేస్తే సరిపోతుందన్నాడు. దీంతో.. శశి నిరంకర్‌నాథ్ అంగీకరించారు. ఆ తరువాత ఆయన భార్య మొబైల్‌కు ఓ ఎస్‌ఎమ్ఎస్ వచ్చింది. అందులో చెల్లింపులకు సంబంధించి ఓ లింక్ ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.2 అని కూడా రాసుంది. దీంతో.. వారు ఆ లింక్‌పై క్లిక్ చేసి..ఆ మేరకు డబ్బు కట్టేశారు. మరికొద్ది క్షణాలకే ఆమె బ్యాంక్ అకౌంట్లోంచి విడతల వారీగా రూ.2 లక్షలు డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో దిమ్మెరపోవడం వారి వంతైంది. చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు.   


Updated Date - 2022-08-23T00:01:04+05:30 IST