కమలా హ్యారిస్​ హత్యకు కుట్ర.. చివరి నిమిషంలో..

ABN , First Publish Date - 2021-09-17T00:49:13+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ను హత్య చేయాలని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ కుట్ర పన్నింది.

కమలా హ్యారిస్​ హత్యకు కుట్ర.. చివరి నిమిషంలో..

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ను హత్య చేయాలని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ కుట్ర పన్నింది. అయితే, చివరి నిమిషంలో అధికారులు ఆమె కుట్రను భగ్నం చేశారు. మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా ఆమెను మియామీ ఫెడరల్​ కోర్టులో హాజరుపరిచారు. దాంతో సదరు మహిళ కమలాను హత్య చేయాలని యత్నించానని న్యాయస్థానంలో అంగీకరించింది. అంతేగాక ఈ హత్య కోసం ఆమె దుండగులతో ఏకంగా 53 వేల డాలర్లకు(సుమారు రూ.39లక్షలు) బేరం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియేన్​ పెటిట్​ ఫెల్ప్స్​(39) అనే మహిళ ఇలా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ను హత్య చేయాలని చూసింది. కానీ, అధికారులు ఆమె కుట్రను భగ్నం చేశారు. చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు గత వారం మియామీ ఫెడరల్​ కోర్టులో హాజరుపరిచారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరు సార్లు కమలా​ను తాను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు కోర్టులో నివియేన్ అంగీకరించింది. ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిని హత్య చేస్తానంటూ జైలులో ఉన్న తన భర్తకు తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలను సైతం పంపించిందని న్యాయవాదులు విచారణ సందర్భంగా తెలిపారు. అంతేగాక కమలాను హత్య చేసేందుకు దుండగులతో 53వేల డాలర్లకు(సుమారు రూ.39లక్షలు) తాను బేరం కుదుర్చుకున్నానని, యాభై రోజుల్లో ఆమెను హతమారుస్తానని వీడియోల్లో నివియేన్​ చెప్పిందని వారు తెలియజేశారు. 


ఇవి కూడా చదవండి..

New York లో మెగా ఫ్యాషన్ ఈవెంట్.. భారత్ నుంచి పాల్గొన్న ఈ Sudha Reddy ఎవరంటే..

America లో దారుణం.. శవాలుగా కనిపించిన భారతీయ విద్యార్థులు.. కారులో వెళ్తుండగా..




ఇక ఆమె ఈ వీడియోల్లో కొన్నింటిని తనంతట తానే రికార్డు చేసుకుంటే.. మరికొన్నింటిని ఆమె పిల్లలు రికార్డు చేశారని పేర్కొన్నారు. ఈ వీడియోల తర్వాత.. తుపాకీ చేత పట్టుకున్న ఓ ఫొటోను కూడా భర్తకు పంపింది. రెండు రోజుల తర్వాత ఆ తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసిందని తెలిపారు. తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేయడంతో సంబంధిత అధికారులు దర్యాప్తు కోసం ఆమె ఇంటికి వెళ్లారు. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, దర్యాప్తు అధికారులు తన ఇంటికి రాకపోయి ఉంటే ఏం జరిగేదో తనకు కూడా తెలియదని నివియేన్ వారితో​ చెప్పిందట. ఇక తన నేరాన్ని అంగీకరించిన ఆమెకు నవంబర్ 19న శిక్ష ఖరారు కానుంది. నివియేన్‌కు కనీసం ఐదేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందని న్యాయనిపుణుల అభిప్రాయం.

Updated Date - 2021-09-17T00:49:13+05:30 IST