Shocking: బాత్రూమ్ గోడల నుంచి రక్తస్రావం.. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు ప్లంబర్‌ను పిలిస్తే..

ABN , First Publish Date - 2022-09-26T00:29:47+05:30 IST

ఉన్నట్టుండి ఇంటి గోడల లోపలి నుంచి రక్తం బయటకు వస్తుంటే ఎలా ఉంటుంది?

Shocking: బాత్రూమ్ గోడల నుంచి రక్తస్రావం.. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు ప్లంబర్‌ను పిలిస్తే..

ఉన్నట్టుండి ఇంటి గోడల లోపలి నుంచి రక్తం బయటకు వస్తుంటే ఎలా ఉంటుంది? ఎంతటి వారైనా భయంతో వణికిపోవాల్సిందే. ఇక, బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చేతబడి వంటి వాటిపై నమ్మకాలు ఉన్నవారికైతే పై ప్రాణాలు పైనే పోతాయి. అమెరికాలోని కాలీఫోర్నియాలోని ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. లెక్సీ చెడెస్టర్ అనే యువతి తనకెదురైన భయంకర అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 


తన ఇంటి బాత్రూమ్ గోడల నుంచి రక్తం వంటి ఎర్రటి ద్రవం బయటకు రావడాన్ని చెడెస్టర్ గుర్తించింది. మొదట పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎంతకీ ఆ ద్రవం రావడం ఆగకపోవడంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. గోడ లోపల ఇరుక్కున్న ఏదో జీవి చనిపోయి ఉంటుందని, అందువలనే రక్తం వస్తుందేమోనని మొదట భావించారు. అయితే రోజూ గోడల నుంచి ద్రవం వస్తుండటంతో భయంతో వణికిపోయారు. దాని అంతు తేల్చాలనుకుని ఒక ప్లంబర్‌ను పిలిపించారు.


ప్లంబర్ మొత్తం అంతా పరీక్షించి అసలు విషయం బయటపెట్టాడు. ఆ బాత్రూమ్ గోడలను చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. ఇటీవల ఆ గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో నీళ్లు ఆ గోడ లోపలికి వెళ్లిపోతున్నాయి. పాత గోడలు కావడంతో లోపల ఉన్న ఇనుము తుప్పు పట్టింది. దానికి ఇతర నిర్మాణ పదార్థాలు కూడా తోడై నీటితో పాటు బయటకు వస్తున్నాయి. అసలు విషయం తెలియడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి చెడెస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

Updated Date - 2022-09-26T00:29:47+05:30 IST