America: ట్రక్కులో 53 మంది ప్రాణాలు బలి.. అదే ట్రక్కులో ఉన్న మహిళ బతికుండడానికి కారణం ఏంటి?

ABN , First Publish Date - 2022-07-07T02:27:08+05:30 IST

అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఓ కంటైనర్ ట్రక్కు నుంచి 53 మృతదేహాలను వెలికితీసిన ఘటన ఇటీవల ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచిన సంగతి తెలిసిందే.

America: ట్రక్కులో 53 మంది ప్రాణాలు బలి.. అదే ట్రక్కులో ఉన్న మహిళ బతికుండడానికి కారణం ఏంటి?

అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఓ కంటైనర్ ట్రక్కు నుంచి 53 మృతదేహాలను వెలికితీసిన ఘటన ఇటీవల ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జూన్ 27న జరిగింది. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలసదారులను తరలిస్తున్న ఈ ట్రక్కు టెక్సస్ శివార్లలోని శాన్ ఆంటోనియాలో రోడ్డు పక్కన కనిపించింది. లోపల ఉన్న వారిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా కొద్ది మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలసదారుల స్మగ్లింగ్ భారీ స్థాయిలో జరుగుతుంది. పేదరికం, హింస నుంచి తప్పించుకుని మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాలోకి జొరబడడానికి మెక్సికో, హోండురాస్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా మొదలైన ప్రాంతాల వారు ప్రయత్నిస్తుంటారు.


ఇది కూడా చదవండి..

Viral Video: వర్షం పడుతున్నా ఆగని బరాత్.. తడవకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్..


అవసరమైన పత్రాలు లేకపోవడంతో వారందరూ ప్రమాదకరమైన పరిస్థితులను దాటుకుంటూ అమెరికాలోకి చొరబడతారు. అలా ఓ ట్రక్కు ద్వారా రహస్యంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వలసదారుల్లో 53 మంది జూన్ 27న ప్రమాదవశాత్తూ మరణించారు. ట్రక్కు తలుపు పూర్తిగా మూసి ఉండడం, లోపల ఏసీ పనిచేయకపోవడం, తాగేందుకు మంచి నీళ్లు కూడా లేకపోవడం, ప్రస్తుతం అమెరికాలో ఎండాకాలం కావడం.. మొదలైన కారణాలతో లోపల ఉన్నవారు వడదెబ్బకు గురై మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అదే ట్రక్కులో ప్రయాణించిన 20 ఏళ్ల యెనిఫెర్ యులిసా అనే మహిళ ప్రాణాలతో బయటపడింది. గ్వాటెమాలకు చెందిన ఆమె ట్రక్కులో పరిస్థితిని వివరించింది. 


`జూన్ 27 న మెక్సికో సరిహద్దులో ట్రక్కు ఎక్కేటప్పటికే చాలా వేడిగా ఉంది. తలుపు దగ్గర ఉంటేనే చల్లగా ఉంటుందని, అక్కడే ఉండమని ఓ స్నేహితుడు నాకు చెప్పాడు. నాతో పాటు ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి అదే సలహా ఇచ్చాను. అతడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ట్రక్కు లోపల కొన్ని డజన్ల మంది ఉన్నారు. గాలి లేకపోవడంతో వారంతా కేకలు వేశారు. ట్రక్కును ఆపమని, తలుపులు తెరవమని అరిచారు. వారు ఊపిరి కూడా పీల్చుకోలేకపోయారు. నేను స్పృహ కోల్పోయే ముందు ట్రక్కు నెమ్మదిగా కదులుతోంది. తిరిగి మెలకువ వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నాను. తలుపు దగ్గర నిల్చోవడం వల్లే నేను ప్రాణాలతో బయటపడగలిగాన`ని ఆమె చెప్పింది. 

Updated Date - 2022-07-07T02:27:08+05:30 IST