మహిళలే టార్గెట్‌

ABN , First Publish Date - 2021-11-29T06:06:57+05:30 IST

హ్యాకింగ్‌ ద్వారా మహిళల వాట్సాప్‌ చాటింగ్‌, వ్యక్తిగత వివరాలను సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ ఉద్యోగి మద్దిలేటి, అతని స్నేహితుడు విశ్వనాథ్‌పై సున్నిపెంట పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళలే టార్గెట్‌

  1. వాట్సాప్‌, మెయిల్‌ ఐడీల హ్యాకింగ్‌  
  2. వ్యక్తిగత సమాచారం సేకరించి బెదిరింపులు  
  3. మద్దిలేటి, అతడి స్నేహితుడిపై కేసు నమోదు
  4. సెక్యూరిటీ ఉద్యోగం నుంచి తొలగించిన దేవస్థానం
  5. శ్రీశైలం, సున్నిపెంటలో కలకలం రేపిన వ్యవహారం


కర్నూలు/శ్రీశైలం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): హ్యాకింగ్‌ ద్వారా మహిళల వాట్సాప్‌ చాటింగ్‌, వ్యక్తిగత వివరాలను సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ ఉద్యోగి మద్దిలేటి, అతని స్నేహితుడు విశ్వనాథ్‌పై సున్నిపెంట పోలీసులు కేసు నమోదు చేశారు. దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న మద్దిలేటి కొంత కాలంగా మహిళలు, యువతులకు ఫోన్లు చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, బ్లాక్‌ మొయిల్‌ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు సున్నిపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో మద్దిలేటిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. 


హ్యాకింగ్‌ కలకలం


ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో శ్రీశైలం, సున్నిపెంటలో కలకలం రేగింది. సున్నిపెంటకు చెందిన మద్దిలేటి, అతని స్నేహితుడు విశ్వనాథ్‌ హ్యాకింగ్‌ చేసేవారని, బాధితుల్లో సున్నిపెంట, శ్రీశైలంవారు ఉన్నారని సమాచారం. నాగేశ్వరావు, జంబులయ్య అనే వ్యక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేశామని సీఐ వెంకట రమణ తెలిపారు. అయితే బాధిత మహిళల్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌లో ఏ1 మద్దిలేటి, ఏ2 విశ్వనాథ్‌ పేర్లు నమోదు చేశారు. క్రైం నెంబరు 74/2021 కింద ఐపీసీ 420, 354, 484 రెడ్‌ విత్‌ 34, సెక్షన్‌ 66 సి, ఈ, 72 ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. వారి వద్ద సుమారు 2,200 మంది మెయిల్‌ ఐడీలు, 10,100 వరకూ ఫొటోలు ఉన్నట్లు సమాచారం.


ఫోన్‌ నెంబర్లు సేకరించి..


సెక్యూరిటీ ఉద్యోగి మద్దిలేటి దేవస్థానానికి వచ్చే మహిళలతో పాటు స్థానిక మహిళల ఫోన్‌ నెంబర్లను సేకరించాడని సమాచారం. తన స్నేహితుడి కలిసి మద్దిలేటి సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. మహిళల ఫోన్‌ నెంబర్లను తెలుసుకుని, హ్యాకింగ్‌ ద్వారా వాట్సాప్‌ చాటింగ్‌ను రహస్యంగా సేకరిస్తున్నాడు. అందుబాటులో ఉన్న కొన్ని యాప్‌ల ద్వారా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, మహిళలను బెదిరించేవాడు. వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, తన కోరిక తీర్చాలని, డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. లేకుంటే ఫొటోలు, వివరాలు బయటపెడతానని బెదిరించినట్లు సమాచారం. ఈ విషయంపై కొన్ని నెలల క్రితమే స్థానిక పోలీస్‌ స్టేషన్లో పలువురు బాధితులు ఫిర్యాదులు చేశారని తెలిసింది. అయితే స్థానికంగా తనకున్న పలుకుబడితో కేసులు దాకా వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం మరోసారి మహిళలను వేధించాడని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిందితులు ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-11-29T06:06:57+05:30 IST