UP ఎన్నికల ఫలితాల్లో ఈ మహిళా అభ్యర్థులపైనే అందరి దృష్టి!

ABN , First Publish Date - 2022-03-10T11:50:37+05:30 IST

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన...

UP ఎన్నికల ఫలితాల్లో ఈ మహిళా అభ్యర్థులపైనే అందరి దృష్టి!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా మన ముందుకు రానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన కొందరు మహిళా అభ్యర్థులు.. గత కొన్నేళ్లుగా యూపీ రాజకీయాల్లో కొనసాగుతున్న నేతల కుమార్తెలు కావడం విశేషం. యూపీ ఎన్నికల బరిలోకి దిగి తమ సత్తా చాటాలనుకున్న మహిళా అభ్యర్థుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

రూపాలీ దీక్షిత్

రూపాలీ దీక్షిత్ ఆగ్రాలోని ఫతేహాబాద్ నుంచి పోటీకి దిగారు.  సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు టిక్కెట్‌ ఇచ్చింది. యూపీలో మంత్రిగా పనిచేసిన బాహుబలి అశోక్ దీక్షిత్ కుమార్తె ఈమె. అశోక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 34 ఏళ్ల రూపాలి ఇంగ్లండ్‌లో ఎంబీఏ చేశారు. ఈమెపై బీజేపీ అభ్యర్థి ఛోటే లాల్ వర్మ పోటీకి దిగారు. 2007లో అశోక్ దీక్షిత్ ఫతేహాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు అతను రెండవ స్థానంలో నిలిచారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో రూపాలీ, ఛోటే లాల్ వర్మ మధ్య పోటీ నెలకొంది. 2007లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడిని కాల్చిచంపిన కేసులో అశోక్ దీక్షిత్ జైలులో ఉండడం, శిక్షను అనుభవిస్తుండడం గమనార్హం. అశోక్ దీక్షిత్‌పై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 

రియా షాక్య

బిదునా స్థానం నుంచి రియా షాక్యాను బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దించింది. బీజేపీ నుంచి ఎస్పీకి మారిన వినయ్ షాక్యా కుమార్తె రియా షాక్య. రియా పూణేలోని సైబయోసిస్ కాలేజీలో చదువుకుంది. ఆమె 2018లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు చేసింది. ఆ తర్వాత ఆమె ఉన్నత విద్య కోసం డెహ్రాడూన్‌ వెళ్లింది. కానీ తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, ఆమె బిదునాకు తిరిగి వచ్చింది. రియా షాక్య తండ్రి ఈ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీలో చేరడం గమనార్హం. కాగా ఎస్పీ నుండి మాజీ అసెంబ్లీ స్పీకర్ ధనిరామ్ వర్మ కోడలు రేఖా వర్మకు టికెట్ ఇచ్చారు. ఆమె బిదునా స్థానం నుంచి బరిలోకి దిగారు.


అదితి సింగ్

ఈ జాబితాలో తదుపరి పేరు అదితి సింగ్. రాయ్ బరేలీ సదర్ స్థానం నుంచి తండ్రి అఖిలేష్ సింగ్ రాజకీయ వారసత్వాన్ని అదితి సింగ్ ముందుకు తీసుకువెళుతున్నారు. ఈసారి ఆమె బీజేపీ టికెట్‌పై రాయ్‌బరేలీ సదర్‌ స్థానం నుంచి పోటీ‌కి దిగారు. గతంలో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి వారసత్వాన్ని నిలబెడతానంటూ ఎన్నికల్లో పోటీకి దిగారు. అదితి తండ్రి అఖిలేష్ సింగ్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తుపై రాయ్ బరేలీ సదర్ నుంచి మూడుసార్లు గెలిచారు. యుఎస్‌లో చదువుకున్న అదితి సింగ్‌ను.. 2017లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఈ సారి ఈ స్థానంలో కాంగ్రెస్, ఎస్పీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 

మృగాంక సింగ్

మృగాంక సింగ్ పశ్చిమ యూపీకి చెందిన ప్రముఖ నేత, ఎంపీ అయిన హుకుమ్ సింగ్ కుమార్తె. మృగాంక సింగ్.. కైరానా నుంచి పోటీకి దిగారు. బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చింది. మరోవైపు ఇక్కడి నుంచి ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి అభ్యర్థి నహిద్‌ హసన్‌ చెల్లెలు ఇక్రా హసన్‌ పోటీకి దిగారు. నహిద్ హసన్ ప్రస్తుతం చీటింగ్ కేసులో జైలులో ఉన్నారు. ఆతని సోదరి.. బీజేపీకి చెందిన మృగాంక సింగ్‌పై పోటీకి దిగారు. ఈ సీటుపై ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమికి, బీజేపీకి మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 

ఆర్తి తివారీ

ఆర్తీ తివారీ అయోధ్యలోని గోసైన్‌గంజ్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి. 2017లో ఇంద్రదేవ్ తివారీ అలియాస్ ఖబ్బు తివారీ గోసైంగంజ్ నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది.. అతని మార్క్‌షీట్‌లో తప్పులతడకలు చోటుచేసుకున్నాయన్న కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత అతని అసెంబ్లీ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు ఆయన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అతని భార్య ఆర్తీ తివారీపై పడింది. ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ నుంచి బాహుబలి అభయ్‌సింగ్‌ బరిలో నిలిచారు.

Updated Date - 2022-03-10T11:50:37+05:30 IST