సవాల్‌కు సిద్ధం!

ABN , First Publish Date - 2021-06-16T06:28:22+05:30 IST

ఐదేళ్ల క్రితం వరకు కూడా భారత మహిళల క్రికెట్‌ జట్టుకు స్వదేశంలోనే పెద్దగా ఆదరణ లేదు. గెలిచినా.. ఓడినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరిన తర్వాత సీన్‌ మారిపోయింది...

సవాల్‌కు సిద్ధం!

  • ఏడేళ్ల తర్వాత టెస్టు బరిలోకి మిథాలీ సేన 
  • ఇంగ్లండ్‌తో ఏకైక మ్యాచ్‌ నేటినుంచే

భారత టెస్టు క్రికెట్‌ అంటే నేటి తరానికి కోహ్లీ సేన ఆటను చూడడమే అలవాటు. కానీ మహిళల క్రికెట్‌ జట్టు కూడా గతంలో టెస్టులు ఆడిందంటే ఇప్పటి ఫ్యాన్స్‌ నమ్మడం కష్టమేనేమో! ఎందుకంటే ఎప్పుడో ఏడేళ్ల క్రితం మిథాలీ రాజ్‌ సేన చివరి టెస్టు ఆడింది మరి. భారత అమ్మాయిలు ఈ ఫార్మాట్‌లో ఆడడం కష్టమే అనుకున్న వేళ.. అనూహ్యంగా ఈ ఏడాది  రెండు టెస్టులు ఆడే అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్ట్‌ మొదలయ్యేది నేటినుంచే. 


బ్రిస్టల్‌: ఐదేళ్ల క్రితం వరకు కూడా భారత మహిళల క్రికెట్‌ జట్టుకు స్వదేశంలోనే పెద్దగా ఆదరణ లేదు. గెలిచినా.. ఓడినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరిన తర్వాత సీన్‌ మారిపోయింది. ఒక్కసారిగా మిథాలీ సేన లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి వన్డేలు, టీ20లు ఆడుతున్నప్పటికీ.. 2014 తర్వాత ఇన్నాళ్లకు టెస్టు ఆడే అవకాశం దక్కింది. స్థానిక కౌంటీ గ్రౌండ్‌లో బుధవారం నుంచి జరిగే ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ను భారత్‌ ఎదుర్కొనబోతోంది. మరో టెస్టు సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో గులాబీ టెస్టులో మిథాలీ సేన తలపడుతుంది. కాగా.. ఇప్పటిదాకా ఇంగ్లండ్‌తో జరిగిన 13 టెస్టుల్లో భారత్‌ రెండు మ్యాచ్‌ గెలిచింది. ఇంగ్లండ్‌ ఒక టెస్టు నెగ్గగా.. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 

ప్రాక్టీస్‌ లేమితో ఇబ్బందే..: ఇంగ్లండ్‌ గడ్డపై భారత మహిళల జట్టుకు ఇప్పటిదాకా ఓటమి లేదు. ఇక్కడ ఆడిన ఎనిమిది టెస్టుల్లో 2006, 2014లలో ఒక్కో టెస్టు గెలిచింది. మిగిలిన ఆరు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మిథాలీ సహా ఏడుగురు ప్లేయర్లు ఏడేళ్ల క్రితం ఆడిన జట్టులోనూ ఉన్నారు. కానీ జట్టులోని స్టార్లు మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, జులన్‌ గోస్వామిలకే కాకుండా యువ క్రికెటర్లకు కూడా ఈ ఫార్మాట్‌లో ప్రాక్టీస్‌ లేకపోవడం జట్టుకు ఇబ్బంది కలిగించే విషయం. కనీసం దేశవాళీ క్రికెట్‌లోనూ అమ్మాయిలకు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు లేవనే విషయం తెలిసిందే. ఈ టెస్టు కోసం నెట్స్‌లోనే ప్రాక్టీస్‌ చేశారు. దీంతో ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో సుదీర్ఘ సమయం క్రీజులో నిలవడంతో పాటు బౌలర్లు జులన్‌, శిఖాపాండే లాంగ్‌ స్పెల్‌ వేయడంలో ఏమేరకు సత్తా చూపిస్తారో చూడాలి. మంధానకు తోడుగా 17 ఏళ్ల షఫాలీ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. పొట్టి ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న షఫాలీ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే తీరుపై అందరి దృష్టి నెలకొంది. మిథాలీ, హర్మన్‌, పూనమ్‌ రౌత్‌ తమ అనుభవంతో జట్టునుగట్టెక్కించాలనుకుంటున్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై తేలిపోయిన స్పిన్నర్లు ఈ టెస్టులో ఏమేరకు ప్రభావం చూపుతారో చూడాల్సిందే.




 ఈ మ్యాచ్‌ను  గెలిస్తే మహిళల టెస్టుల్లో అత్యధిక వరుస విజయాలు (4) సాధించిన జట్టుగా భారత్‌ నిలుస్తుంది



ఫేవరెట్‌గా..

ఈ టెస్టులో ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. జట్టులోని 15 మంది సభ్యుల్లో 11 మందికి టెస్టు అనుభవం ఉండగా.. భారత జట్టులో 8 మందే ఇప్పటి వరకు టెస్టు ఆడారు. అంతేకాకుండా 2014 తర్వాత ఇంగ్లండ్‌ జట్టు మూడు టెస్టులు ఆడడం విశేషం. అందుకే ఈసారి స్వదేశంలో తమ పేలవ రికార్డును మెరుగుపర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే యాషెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ జట్టు ఈ మ్యాచ్‌ను కూకాబుర్రా బంతులతో ఆడనుంది. 






Updated Date - 2021-06-16T06:28:22+05:30 IST