ఆర్థిక అక్షరాస్యతతోనే మహిళా సాధికారత

ABN , First Publish Date - 2022-08-16T06:26:21+05:30 IST

మహిళల ఆర్థిక స్వావలంబన గురించి మనం తరచూ వింటూ ఉంటాం. దేశ సంపదను సృష్టించడంలో ముందు భాగంలో ఉంటున్న మహిళలకి ఆర్థిక రంగంలో దక్కుతున్న చోటు ఎంత...

ఆర్థిక అక్షరాస్యతతోనే మహిళా సాధికారత

మహిళల ఆర్థిక స్వావలంబన గురించి మనం తరచూ వింటూ ఉంటాం. దేశ సంపదను సృష్టించడంలో ముందు భాగంలో ఉంటున్న మహిళలకి ఆర్థిక రంగంలో దక్కుతున్న చోటు ఎంత? వాళ్ళు సృష్టిస్తున్న ఆ సంపదలలో నిజంగా వాళ్లకు దక్కుతున్న వాటా ఎంత? వారి సంపాదనపైన వాళ్లకు నిజమైన హక్కు ఉందా? ఆర్థికాంశాలను అర్థం చేసుకోగల ఆర్థిక అక్షరాస్యత వాళ్లకు వుందా? మహిళల ఆర్థిక స్వావలంబన గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా సరే వేసుకోవలసిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇవి.


దేశ జనాభాలో 48.6 శాతం మహిళలు. అంటే దాదాపు సగభాగం. ప్రస్తుతం 43.2 మిలియన్‌ మంది మహిళలు భారతదేశంలో పని చేయగలిగిన వయసులో ఉండగా వీరిలో 34.3 మిలియన్‌ మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఈ బయటి శ్రమతో పాటూ, ఎలాంటి గుర్తింపు, ఆర్థిక పర విలువ లేని కుటుంబ శ్రమలో 95 శాతం మహిళలు నిమగ్నమై ఉన్నారు. పెట్టుబడి, ఆర్థిక కేంద్రీకరణలలోని మార్పులు, వ్యవసాయిక సంక్షోభం, పేదరికం, మరెన్నో ఇతర కారణాల ఫలితంగా పురుషులు వ్యవసాయ రంగాన్ని వదిలి పట్టణాలకు ఉపాధి కోసం తరలివస్తుండగా, మహిళలు గతంలో కంటే ఎక్కువగా వ్యవసాయ కూలీలు, రైతులుగా కూడా మారుతున్నారు. ‘ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్’ పరిణామాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తించక తప్పడం లేదు. గ్రామీణ భారతంలో 75.7 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నప్పటికీ, నిజానికి వాళ్ల చేతుల్లో 9శాతం భూమి కూడా లేదు. అలాగే 60 శాతం మంది మహిళల పేరున ఎలాంటి విలువైన ఆస్తిపాస్తులు లేవు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 2005లో 36.7 శాతంగా ఉన్న మహిళా శ్రామికుల పాత్ర 2018 నాటికి 25 శాతానికి తగ్గింది. ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షురాలు అనెట్టి డిక్షన్ ఒక వ్యాసంలో 2005–2012 మధ్యకాలంలో సుమారు రెండు కోట్ల మహిళలు ఉపాధి కోల్పోయారని పేర్కొంది.


దేశంలో అన్ని రంగాల్లోనూ ముమ్మరమైన సంక్షోభాలు స్త్రీలపైన, వారి ఉపాధి అవకాశాలపైన, ఆర్థిక స్వావలంబన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అసంఘటిత రంగాల్లో అతి తక్కువ వేతనాలు, అధిక శ్రమ, ఉద్యోగ భద్రత లేకపోవడం మాత్రమే కాకుండా పని స్థలాల్లో అనేక అసమానతలు, లైంగిక వేధింపులను కూడా మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు. మన దేశంలో గృహ కార్మికులుగా అధికారిక అంచనాల ప్రకారం 4.75 మిలియన్‌ మంది పనిచేస్తున్నారు. అనధికారికంగా సుమారు 40 నుంచి 50 మిలియన్‌ మంది ఈ పనిలో ఉన్నారు. వీరిలో అత్యధికులు స్త్రీలే. వ్యవసాయ రంగం తరువాత అతి పెద్ద రంగం నిర్మాణ రంగం. 40 మిలియన్‌ కార్మికులు ఈ రంగంలో నిమగ్నమై ఉన్నారని, వారిలో 49 శాతం మంది మహిళలే అని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 2.5 మిలియన్‌ అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న 35,700 సెంటర్లలో 34,165 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 53,942 మంది మహిళలు పనిచేస్తున్నారు. దేశంలో 300 ప్రధాన బీడీ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.5 మిలియన్‌ మంది పనిచేస్తుండగా కార్మిక సంఘాల అంచనాల ప్రకారం ఏడు నుంచి 8 మిలియన్‌ మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీళ్లలో 96శాతం మంది మహిళలే. మహిళలు తమ సంపాదనలో 90 శాతానికి పైగా కుటుంబ అవసరాల కోసమే ఖర్చు చేస్తారు. పురుషుల సంపాదన, వారి ఖర్చుతో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువ.


వస్త్ర పరిశ్రమ, పారిశుద్ధ్య రంగం, సేవారంగాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట మహిళల శ్రమ ఉంది. ప్రతి చోటా వేతనాల చెల్లింపులలో స్త్రీ పురుషుల మధ్య ఎంతో అసమానత ఉంది. పై చదువులు లేకపోవడం, వృత్తి నైపుణ్యాల కొరత, స్త్రీలు పనిచేసేందుకు అనుకూలంగా ఉండని పని స్థలాలు ఇలాంటి అనేక కారణాల వల్ల వాళ్ళకు దొరికే ఉపాధి కూడా సరైనదిగా, భద్రత కలిగినదిగా కూడా ఉండదు. విద్య, వైద్యం, ఉపాధి, వేతనం ఇలా ప్రతి చోటా జెండర్ వివక్ష కొనసాగుతూనే ఉంది. 15 నుంచి 18 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిల్లో 39.4 శాతం మధ్యలోనే వాళ్ళ చదువు వదిలివేయాల్సి వస్తున్నది. అలాగే ఆడపిల్లల సగటు వివాహ వయసు ఇంకా 15–17 ఏళ్ల మధ్య ఉంది.


ఇప్పుడు ఎవరి చేతుల్లో చూసినా సెల్‌ఫోన్లే అని అంటూ ఉంటాం. డిజిటల్ లిటరసీ అన్నది కేవలం 34 శాతం ఉందని, 76 శాతం మహిళలు ఇంటర్నెట్‌ను ఎన్నడూ ఉపయోగించలేదని ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’ (ఏఎస్ఈఆర్) నివేదిక చెబుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం జన ధన్ యోజన (పీఎంజెడివై) పథకం ద్వారా 45 కోట్ల మందికి దేశవ్యాప్తంగా బ్యాంకు అకౌంట్లను ఇచ్చింది. దీనిలో 55 శాతం అకౌంట్లు మహిళలవే. 2005–06లో 15.1శాతం భారతీయ మహిళలకి బ్యాంకులలో అకౌంట్స్ ఉండేవి. కాగా 2016–17 మధ్య 53 శాతం మంది మహిళలు బ్యాంక్ అకౌంట్‌లను తెరిచారు. వీటిని జీరో ఎకౌంట్లని పిలుస్తూ ఉన్నారు. మహిళల స్వావలంబన అన్నది ఆర్థిక సాధికారతతో ముడిపడి ఉంటుందని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. తమ ఆదాయం, లేదా కుటుంబ ఆదాయాన్ని బడ్జెట్ చేయగల, ఒక ఆర్థిక ప్రణాళికను వేసుకొని, పొదుపు చేయగల అవకాశాలు స్త్రీలకు ఉన్నాయా, అందుకు అవసరమైన ఆర్థిక శిక్షణ వాళ్లకు ఉందా అనేది ఒక ముఖ్యమైన అంశం.


నిజానికి ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక వ్యవస్థలు స్త్రీలకు, పేదలకు అందుబాటులో లేకపోవడమే కాకుండా స్నేహశీలిగా కూడా ఉండవు. బ్యాంకుల్లో ఖాతాలను ప్రభుత్వాలు తెరిచినా, వాటిల్లో వేసుకునేందుకు డబ్బులు లేకపోవడమే కాదు, చదువు లేకపోవడం, ఏమి చేయాలో చెప్పే వాళ్లు లేకపోవడంతో వాటిల్లోకి అడుగుపెట్టేందుకు శ్రామిక, పేద మహిళలు భయపడే స్థితి ఉంది. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం మహిళలు ఇప్పటికీ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం, తమ వద్ద ఉన్న కాసింత బంగారాన్ని కుదువ పెట్టడం, లేదా చిట్టీలు వేయడం, పొదుపు సంఘాల వద్ద అప్పులు తీసుకోవడం వంటి వాటిపై ప్రధానంగా ఆధారపడుతున్నారు. కొవిడ్ కాలంలో మహిళల ఉపాధి అవకాశాలు ఇంకా దెబ్బతిని వాళ్లు దారిద్ర్యరేఖకి మరింత దిగువకి దిగజారారు. సరైన ఉపాధి, వేతనం, తమ ఆర్థిక వనరులపై తమకే అధికారం కోసం మహిళలు పోరాడవలసి ఉంది.


విద్య, వైద్యం, ఆహారం వంటి తప్పనిసరి ఖర్చులు పెరిగిన కారణంగా, ధరలు హెచ్చినందునా మహిళల ఆదాయంలో సింహభాగం వాటికే పోతున్నది. ఇంటి బాధ్యతని తీసుకోకుండా, ఆడవాళ్ల సంపాదనను కూడా లాక్కొనే తాగుబోతు భర్తల నుండి, హింసాత్మక కుటుంబాల నుండి తమను, తమ పిల్లలను కాపాడుకునేందుకు, తమ సంపాదనపై తమకే హక్కు ఉండటానికి పురుష ప్రధాన కుటుంబ వ్యవస్థలని‍ ప్రశ్నించడంతో పాటుగా, స్త్రీలకు ‘ఆర్థిక అక్షరాస్యత’ చాలా అవసరం. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగాల్సిన కార్యక్రమం ఇది. కుటుంబ ఆదాయ, వ్యయ అంచనాలను, ప్రణాళికలను వేసుకోవడం, వివిధ పధకాలను ఉపయోగించుకోవడం, ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం వంటివి ఆర్థిక విషయాల్లో మహిళల ప్రత్యక్ష పాత్రని పెంచేందుకు ఇది చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఆదాయం ఉన్నా దానిపై అధికారం లేని కోట్లాది మహిళలు ‘మహిళా సాధికారత’ దిశగా వెళ్లేందుకు ఈ ఆర్థిక అక్షరాస్యత దోహద పడుతుంది.

విమల మోర్తల

తేజస్విని మాడభూషి

నావిక (యుగాంతర్)

Updated Date - 2022-08-16T06:26:21+05:30 IST