మహిళలు కొత్త లైన్‌ సెట్‌ చేశారు!

ABN , First Publish Date - 2021-01-07T06:56:41+05:30 IST

‘‘అందరిలో ఒక్కరిలా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా సాధించాలన్నది నా ఆశయం. అమ్మాయిలు కొన్ని రంగాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సక్సెస్‌ కావాలన్నది నా తపన

మహిళలు కొత్త లైన్‌ సెట్‌ చేశారు!

‘లైన్‌మేన్‌’ అనగానే విద్యుత్‌ స్తంభాలపైకి ఎక్కి, అంతరాయాలను పరిష్కరించే మగవాళ్లు కళ్లముందు మెదులుతారు.ఇక మీదట ఆ పదాన్ని ‘లైన్‌పర్సన్‌’ అని మార్చాలేమో! ఎందుకంటే ఈ ఉద్యోగానికి తెలంగాణలో తొలిసారిగా ఒక యువతి ఎంపికయ్యారు.ఆమె పేరు బబ్బూరి శిరీష. అయితే ఈ ఘనత ఆమెకు అంత తేలిగ్గా అందలేదు. పురుషులకే పరిమితమైన ఆ ఉద్యోగం సంపాదించడం కోసం ఆమె  పెద్ద పోరాటమే చేశారు.ఎన్నో విమర్శలూ, ఆటంకాలూ ఎదురైనా వెనుదిరగకుండా అనుకున్నది సాధించారు. ఈ వృత్తిలోకి రావాలనుకుంటున్న ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. 


‘‘అందరిలో ఒక్కరిలా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా సాధించాలన్నది నా ఆశయం. అమ్మాయిలు కొన్ని రంగాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సక్సెస్‌ కావాలన్నది నా తపన. ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ ట్రేడ్‌ ఎంచుకోవాలనుకున్నప్పుడు నాకు ఎదురైన మొదటి ప్రశ్న... ‘ఇది అబ్బాయిల కోర్సు. నీకెందుకు?’ అని. ‘‘ఈ కోర్సులో అబ్బాయిలు మాత్రమే చేరుతారు. అమ్మాయివి. నువ్వెలా చేస్తావ్‌?’’ అని సికింద్రాబాద్‌ అల్వాల్‌లోని ఐటీఐ ప్రిన్సిపాల్‌ నావైపు ఆశ్చర్యంగా చూశారు. ‘‘మరో ట్రేడ్‌ ఎంచుకో. అమ్మాయిలకు అనుకూలమైన వాటినే ఎంచుకో’’ అని సూచించారు. కానీ అప్పటికే నేను ఎలక్ట్రీషియన్‌ అవుదామని నిర్ణయించుకున్నాను. నన్ను చూసి మరో ఇద్దరు అమ్మాయిలు కూడా అదే కోర్సులో చేరారు’’ అంటూ తనకు ఇష్టమైన దారిలో వేసిన తొలి అడుగుల్ని గుర్తు చేసుకున్నారు బబ్బూరి శిరీష. 


ఆమెది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గణేశపల్లి. తండ్రి వెంకటేశ్‌, తల్లి రాధ. వారిది నిరుపేద కుటుంబం. కుటుంబానికి ఆసరాగా నిలవాలనేది శిరీష సంకల్పం. అందుకే పదో తరగతి పూర్తి చేయగానే ఐటీఐలో చేరారు. రోజూ గణేశపల్లి నుంచి హైదరాబాద్‌కు బస్సులో వెళ్ళి వస్తూ చదివారు. ఐటీఐ కోర్సు ముగిసే సమయానికి... కిందటి ఏడాది నవంబర్‌ చివర్లో లైన్‌మేన్‌ ఉద్యోగాల కోసం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అందులో మహిళలకు దరఖాస్తు చేసే ఆప్షన్‌ లేదు. దీని గురించి అధికారులను సంప్రతిస్తే, ఆ నోటిఫికేషన్‌ పురుషులకు మాత్రమేననీ, మహిళలకు అర్హత లేదనీ స్పష్టం చేశారు. దీంతో శిరీషతో పాటు మరో 34 మంది మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.



హైకోర్టు చెప్పినా స్పందించలేదు...

‘‘మా మేనమామ శేఖర్‌  టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో సబ్‌ ఇంజనీర్‌. మొదట ఆయన కూడా లైన్‌మేన్‌గా పనిచేశారు. ఆయన ఎంతో కష్టపడేవారు. ఆయనలా విద్యుత్‌ స్తంభాలు ఎక్కాలనీ, అత్యవసర సమయంలో ప్రజలకు సేవలు అందిచాలనీ నాకు ఉండేది. ‘ఈ పోస్టులకు పురుషులను మాత్రమే ఎందుకు ఎంపిక చేస్తారు? మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వరు?’ అంటూ మా మామ నాకు విద్యుత్‌ స్తంభం ఎక్కడంలో శిక్షణ ఇచ్చారు. మాకు దగ్గర్లో ఉన్న చేబర్తి, గణేశ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌ గ్రామాల్లో విద్యుత్‌ స్తంభం ఎక్కడం సాధన చేశాను.


కానీ ‘లైన్‌మేన్‌’ పోస్టులకు మహిళలకు అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పడంతో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది’’ అన్నారు శిరీష. హైకోర్టు ఆదేశాలతో వారి దరఖాస్తులు స్వీకరించి పరీక్షకు అనుమతించారు. కానీ, రాత పరీక్ష తరువాత పురుష అభ్యర్థుల ఫలితాలను మాత్రమే టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ విడుదల చేసింది. మహిళల ఫలితాలను నిలిపివేసింది. విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కే పరీక్షను కూడా పురుషులకే నిర్వహించింది. దీంతో శిరీష, మిగిలిన మహిళా అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అర్హులైన మహిళా అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలనీ, వారికి పోల్‌ టెస్ట్‌ నిర్వహించాలనీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ఆ సంస్థ పట్టించుకోలేదు.


దీంతో హైకోర్టు బెంచీకి మరోసారి శిరీష వెళ్ళాల్సి వచ్చింది. పదిహేను రోజుల్లోగా తప్పనిసరిగా మహిళా అభ్యర్థులకు పోల్‌ టెస్ట్‌ జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కిందటి నెల 23న శిరీషకూ, మరో మహిళా అభ్యర్థికీ అధికారులు పోల్‌ టెస్ట్‌  నిర్వహించారు. ఈ పరీక్షలో ఒకటిన్నర నిమిషాల్లో విద్యుత్‌ స్తంభం ఎక్కి దిగాలి. ఒక్క నిమిషంలో పోల్‌ ఎక్కిన శిరీష జూనియర్‌ లైన్‌ ఉమన్‌గా ఎంపికయ్యారు. ఆ ఉద్యోగానికి తెలంగాణలో ఎంపికైన తొలి మహిళ శిరీషనే. ఇప్పటి వరకూ ‘జూనియర్‌ లైన్‌మన్‌’ (జేఎల్‌ఎం)గా ఉన్న పోస్ట్‌ పేరు ఇకపై ‘జూనియర్‌ లైన్‌ ఉమన్‌’ (జేఎల్‌డబ్ల్యూ)గానూ వాడుకలోకి రాబోతోంది.




గవర్నర్‌ అభినందన మరచిపోలేను...

‘‘నా జీవితంలో ప్రతి అడుగులో మా అమ్మ కష్టం ఉంది.  కూలి పనులు చేస్తూ నన్ను పోషించింది. ఉపవాసాలు ఉండి పుస్తకాలు కొని ఇచ్చింది. కూలీ నాలీ చేసి బిడ్డను చదివించడం ఎందుకని చాలామంది ఎగతాళి చేసినా ఆమె వెనుకడుగు వేయలేదు. నేను ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో నన్ను ముందుకు నడిపించింది. అలాగే మా మేనమామ శేఖర్‌ కూడా నేను ఐటీఐలో చేరినప్పటి నుంచి ఉద్యోగానికి ఎంపికయ్యే వరకూ మార్గదర్శిగా వ్యవహరించారు.

అతి తక్కువ సమయంలో స్తంభం ఎక్కి, దిగేలా నాకు శిక్షణ ఇచ్చారు. మా అమ్మ కష్టం, మా మామయ్య సూచనలు, ప్రోత్సాహమే నా విజయానికి కారణం’’ అంటారు శిరీష. ‘‘నావల్లే ‘లైన్‌ ఉమన్‌’ అనే మాట ఇప్పుడు వినబడబోతోందంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే, కొన్ని మహిళా సంఘాల వారితో పాటు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ట్విట్టర్‌లో నన్ను అభినందించడం ఎన్నటికీ మరచిపోలేను.

ఒక నిరుపేద కుటుంబానికి చెందిన నన్ను గవర్నర్‌ గుర్తించి, ప్రశంసించడం నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు మహిళలు కూడా పోల్‌ టెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. లైన్‌ఉమన్‌గా మెరుగ్గా సేవలందిస్తూ ఏ వృత్తి అయినా మహిళలు సమర్థంగా నిర్వహించగలరని నిరూపిస్తాను’’ అంటున్న శిరీష మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తున్నారు.





తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌  ట్విట్టర్‌లో  నన్ను అభినందించడం ఎన్నటికీ మరచిపోలేను. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన నన్ను గవర్నర్‌ గుర్తించి, ప్రశంసించడం నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. లైన్‌ఉమన్‌గా మెరుగ్గా సేవలందిస్తూ ఏ వృత్తి అయినా మహిళలు సమర్థంగా నిర్వహించగలరని నిరూపిస్తాను. నన్ను స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు మహిళలు కూడా పోల్‌ టెస్ట్‌కు సిద్ధమవుతున్నారు.  

  దాసరి కృష్ణ,  పైడిపల్లి అరుణ్‌కుమార్‌

 ఫొటోలు: యువరాజ్‌భట్‌, సిద్దిపేట జిల్లా

Updated Date - 2021-01-07T06:56:41+05:30 IST