గ్రేటర్‌లో మహిళా మార్ట్‌లు

ABN , First Publish Date - 2022-07-07T06:50:16+05:30 IST

నగరంలో మహిళా మార్ట్‌లు ఏర్పాటుకాబోతున్నాయి. మహిళా సాధికారతలో భాగంగా వీటిపై జీవీఎంసీ దృష్టిసారించింది.

గ్రేటర్‌లో మహిళా మార్ట్‌లు

మహిళా సంఘాల సభ్యుల ఉత్పత్తుల విక్రయానికి పెద్దపీట

స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు కూడా అమ్ముకునేందుకు వెసులుబాటు

నిర్వహణ మొత్తం మహిళలే...పనిచేసేవారు కూడా

ప్రయోగాత్మకంగా తొలుత మల్కాపురంలో ఏర్పాటు

అక్కడ విజయవంతమైతే నగరంలో మరో పదిచోట్ల ప్రారంభం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో మహిళా మార్ట్‌లు ఏర్పాటుకాబోతున్నాయి. మహిళా సాధికారతలో భాగంగా వీటిపై జీవీఎంసీ దృష్టిసారించింది. మహిళా సంఘాల సభ్యులే వీటిని నిర్వహించేలా ప్రణాళికలు తయారుచేసింది. మొదట ప్రయోగాత్మకంగా మల్కాపురంలోని ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకోసం ఒక కల్యాణ మండపాన్ని ఎంపిక చేసింది. అక్కడ విజయవంతంమైతే నగరంలో మరో పదిచోట్ల ఏర్పాటుచేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

జీవీఎంసీ పరిధిలో 31,744 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 3.7 లక్షల మంది సభ్యులు ఉన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా మార్ట్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో కూడా వీటిని ఏర్పాటుచేయాలని యూసీడీ విభాగం అధికారులు ఏడాది కిందట కసరత్తు ప్రారంభించారు. మహిళా మార్ట్‌లను మహిళా సంఘాల సభ్యులే ఏర్పాటుచేసుకోవడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలు కూడా వారే చూసుకునేలా నిబంధనలు రూపొందించారు. మార్ట్‌లో పనిచేసే వారంతా కూడా మహిళలే ఉంటారు. ఈ మార్ట్‌లలో స్థానికంగా వున్న మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులు విక్రయానికి పెద్దపీట వేస్తారు. మార్ట్‌ ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని జీవీఎంసీ సమకూర్చితే పెట్టుబడి మాత్రం మహిళా సంఘాలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే వారంతా సొంత డబ్బులు పెట్టకుండా, అప్పులు చేయకుండా వుండేందుకు మహిళా సంఘాల సభ్యుల నుంచి సభ్యత్వ రుసుం కింద రూ.150తోపాటు స్త్రీనిధి కింద బ్యాంకుల ఇచ్చే రుణాన్నే పెట్టుబడిగా సమకూర్చనున్నారు. మహిళా పరస్పర సహకార సంఘం కింద రిజిస్టర్‌ చేస్తారు కాబట్టి, అందులో వచ్చే లాభాలను మహిళా సంఘాల సభ్యులే వాటాలు వేసుకుని పంచుకుంటారు. వీటి ఏర్పాటుకు మొదట నగరంలో ఖాళీగా వున్న అన్న క్యాంటీన్‌ భవనాలను పరిశీలించారు. అయితే ఆ భవనాలు చిన్నవి కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా మహిళా మార్ట్‌ల ఏర్పాటుపై జీవీఎంసీ కమిషనర్‌ దృష్టిసారించడంతో కదలిక వచ్చింది. మల్కాపురం ప్రాంతంలో బీపీఎల్‌ కుటుంబాలు, నేవల్‌ కుటుంబాలు ఎక్కువగా వుండడంతో ప్రయోగాత్మకంగా అక్కడే మార్ట్‌ను ప్రారంభించాలని జీవీఎంసీ అధికారులు ఎంపికచేశారు. అక్కడ వున్న జీవీఎంసీకి చెందిన కల్యాణమండపాన్ని దీనికోసం అనువైనదిగా గుర్తించారు. అక్కడ త్వరలోనే మార్ట్‌ ప్రారంభానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. 


మార్కెట్‌లో ధర కంటే తక్కువకు విక్రయాలు

డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, అదనపు కమిషనర్‌ 

మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందనే భావనతో మహిళా మార్ట్‌ల ఏర్పాటుపై కమిషనర్‌ లక్ష్మీషా దృష్టిసారించారు. మహిళా సంఘాలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వసతి జీవీఎంసీ సమకూరుస్తుంది. పెట్టుబడికి అవసరమైన మొత్తం బ్యాంకుల నుంచి రుణం కింద సమకూరుతుంది. తమ ఉత్పత్తులతోపాటు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు లభ్యమయ్యే వస్తువులు, ఉత్పత్తులను మార్ట్‌లో విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు విక్రయిస్తారు కాబట్టి మార్ట్‌కి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు. మల్కాపురంలో విజయవంతమైతే నగరంలో మరికొన్నిచోట్ల ప్రారంభించాలని కమిషనర్‌ భావిస్తున్నారు.

Updated Date - 2022-07-07T06:50:16+05:30 IST