నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ABN , First Publish Date - 2022-06-25T04:59:09+05:30 IST

తాగునీటి కోసం మన్న నూరు గ్రామానికి చెందిన అంబేడ్కర్‌ కాలనీ వాసులు శుక్రవారం రోడ్డెక్కారు. నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిరసనకు దిగారు.

నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
బిందెలు పట్టుకొని రాస్తారోకో చేస్తున్న మహిళలు

మన్ననూర్‌, జూన్‌ 24: తాగునీటి కోసం మన్న నూరు గ్రామానికి చెందిన అంబేడ్కర్‌ కాలనీ వాసులు శుక్రవారం రోడ్డెక్కారు. నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిరసనకు దిగారు. మహిళలు బిందెలు చేత పట్టుకొని రోడ్డుపై కూర్చున్నారు. కాలనీలో తాగునీరు సరఫరా కావడం లేదని, విషయాన్ని సర్పంచ్‌కు, గ్రామ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్పారు. నీళ్లు లేకుండా ఎలా బతకాలని మహిళలు, యువకులు ప్రశ్నించారు. ఎంపీడీవో, సర్పంచ్‌, అధికారులు ఇక్కడికొచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ శ్రీరామ్‌నాయక్‌ అక్కడికి చేరుకొని, ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యల ను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపీడీవో రామ్మోహన్‌, సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ వీరబాబు తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వారితో చర్చించారు. తాగునీరు లేక అల్లాడి పోతున్నామని, ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళన చేయాల్సి వచ్చిందని అధికారులతో వాపోయారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేయడంతో శ్రీశైలం -హైదరాబాద్‌, మద్దిమడుగు రహదారుల గుండా వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున ఆగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఒక సమయంలో ఆందోళనకారులకు, అధికారుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అనంతరం సర్పంచ్‌ శ్రీరామ్‌నాయక్‌, సీఐ ఆదిరెడ్డి అధికారులతో కలిసి అంబేడ్కర్‌ కాలనీలోని తాగునీరు సరఫరా కాని ప్రాంతాలను పరిశీలించారు, నీటి సరఫరాకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-06-25T04:59:09+05:30 IST