మహిళా భద్రత అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-03-07T05:02:05+05:30 IST

మహిళా భద్రత.. సాధికారత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి అన్నారు. మానవీయ విలువలు సామాజిక భద్రతను పెంపొందిస్తాయన్నారు. తద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

మహిళా భద్రత అందరి బాధ్యత

 మానవీయ విలువలు సామాజిక భద్రతను పెంచుతాయి

 హైకోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి

విజయనగరం లీగల్‌, మార్చి 6: మహిళా భద్రత.. సాధికారత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి అన్నారు. మానవీయ విలువలు సామాజిక భద్రతను పెంపొందిస్తాయన్నారు. తద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా, పోక్సో కోర్టు విభాగాలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యల నగరంగా పేరొందిన విజయనగరం పట్టణానికి రావడం అనందంగా ఉందన్నారు. మహిళా హక్కులు, భద్రత కోసం ప్రత్యేక కోర్టు విభాగాలను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని చెప్పారు. అయితే మహిళలు, చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులు చోటుచేసుకుంటుండడం బాధాకరమని, ఆఖరుకు ఈ కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. వీటి ద్వారా అమానవీయ కేసులు తగ్గుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న వివిధ దాడులపై నమోదవుతున్న కేసులు సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని న్యాయమూర్తి వెళ్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండు రోజుల మందుగా మహిళా న్యాయ స్థానాలను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అలాగే న్యాయస్థానాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రత్యేక కోర్టుల ద్వారా నేరం చేసేవారికి త్వరగా శిక్ష పడుతుందని,  తద్వారా నేరం చేసేందుకు భయపడే పరిస్థితి వస్తుందన్నారు. జస్టిస్‌ చీకటి మానవేంద్రనాద్‌ రాయ్‌ మాట్లాడుతూ తాను పార్వతీపురంలో చదువుకుని హైకోర్టులో అడుగు పెట్టానన్నారు. ఆర్థికంగా, విద్యా పరంగా జిల్లా వెనుకబడి ఉందని, అయినప్పటికీ ఈ జిల్లా నుంచి ఇంతవరకు ఏడుగురు న్యాయమూర్తులు హైకోర్టులో విధులు నిర్వహించారని గుర్తుచేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పోర్టు పోలియో జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌  మాట్లాడుతూ చారిత్రిక నగరంగా విజయగనరాన్ని అభివర్ణించారు. 30ఏళ్ల తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిల్లాలో పర్యటించడం సంతోషించాల్సిన విషయమన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి గుత్తల గోపి మాట్లాడు తూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిల్లాలో పర్యటించడం చిరస్మరణీయమన్నారు. విధుల్లో చేరిన తరువాత మొదటి సారిగా విజయనగరం జిల్లాలోనే పర్యటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి కె.సుధామణి, ఎం.మాధురి, ఎస్‌.శారదాదేవి, జిల్లాలోని వివిధ కోర్టుల నుంచి వచ్చిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. జిల్లాకు వచ్చిన సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలకు కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌, ఎస్పీ బి.రాజకుమారి స్వాగతం పలికారు. 


Updated Date - 2021-03-07T05:02:05+05:30 IST