మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-09T05:18:39+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలను నిర్వహించారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్‌
బోథ్‌ మండల సమాఖ్య అధ్యక్షురాలికి మెమెంటో అందిస్తున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌అర్బన్‌, మార్చి 8: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తునప్పటికీ ఇంకా వివక్షతకు గురవుతూనే ఉన్నారని అన్ని రంగాల్లో చైతన్యం చెంది రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పురుషులతో పోటీ పడి అన్ని పదవులలో ముందుంటున్నారని ఇది మహిళాలోకానికి ఎంతో గర్వకారణమన్నారు. మహిళలంతా ఏకతాటిపై నిలబడి వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి సంఘటితం కావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో, దేశ రక్షణ విభాగంలో కూడా మహిళలు ముందుండడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఐసీడీఎస్‌ పీడీ మిల్క, పలువురు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని గుజరాతీ భవన్‌లో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజులుగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, మెప్మా జిల్లా కో ఆర్డినేటర్‌ సుభాష్‌, ఆదిలాబాద్‌ కో ఆర్డినేటర్‌లు భాగ్యలక్ష్మి, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, పలువురు ఆర్‌పీలు, ఓబీలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆదివాసీ గిరిజన మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకు న్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గిరిజన మహిళలు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘా ల మహిళా రాష్ట్ర నాయకురాలు, తుడందెబ్బ మహిళా నాయకులు సుగుణ, మర్సుకోల సరస్వతి, రేణుక, అరుణ, డాకక్టర్‌  సుమలత, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని, ఏఐసీసీ కార్యవర్గ సభ్యురాలు గండ్రత్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు. అలాగే విశిష్ట సేవలందించి పలు ప్రశంసలు అందుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, మహిళా ఆదివాసీ గిరిజన నాయకురాలు గోడం రేణుక తదితరులను ఈ సందర్భంగా మహిళలు ఘనంగా సన్మానించి సత్కరించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా రక్తందానం చేసేందుకు మహిళలు ముందుకు రావడం ఎంతో గర్వకారణమని వారిని ప్రోత్సహిస్తూ మరిన్ని సేవలందిస్తున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ మనీషా అన్నారు. సోమవారం మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో మహిళలు చేస్తున్న రక్తదాన శిబిరాన్ని ఆమె సందర్శించి అభినందించారు.

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆర్‌ఎం విజయ్‌భాస్కర్‌, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఆర్టీసీలో ఉత్తమ మహిళా కండక్టర్లు పుష్పలీల, గట్టుబాయి, సుమన్‌బాయి, ఉత్తమ మహిళా ప్రయాణికులను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ కల్పన, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టులో వేడుకలను నిర్వహించారు. ఇందులో పలువురు న్యాయమూర్తులు మహిళా న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి అభినం దించారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని వారి అభ్యున్నతిని చాటుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగన్మోహన్‌ సూచించారు.

ఉట్నూర్‌: ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమ సమీపంలో ఉన్న బాలికలకు, మహిళల రక్షణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కనక సుగుణ, ఉట్నూర్‌ మండల ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మర్సుకోల సరస్వతి మాట్లాడుతూ ఆకాశంలో సగం, అన్నింటిలో సగం అంటున్నప్పటికీ మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేపట్టిన చట్టాలు అంత బలంగా లేక పోవడంతోనే మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.కాగా, గోండుల గుస్సాడీ నృత్యాలను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనక రాజును పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసినందుకు మహిళలు సోమవారం కనక రాజును ఘనంగా సన్మానించారు. కుమ్రం భీం జిల్లా మార్లవాయికి చెందిన కనక రాజును ఉట్నూర్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం కార్యక్రమంలో సన్మానించుకోవడం ఆనందంగా ఉందని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సర్పంచ్‌లు అంకవ్వ, కోత్మీబాయితో పాటు పిజీ హెచ్‌ఎం వనితదేవి, తో పాటు భారతిగోపాల్‌సింగ్‌, రవిత, సృజన, సంగీత, ఎంపీపీ జైవంత్‌రావు, మర్సుకోల తిరుపతి, ఆత్రం భుజంగ్‌రావు పాల్గొన్నారు. 

బజార్‌హత్నూర్‌: మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలతో పాటు పలు గ్రామాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గులాబ్‌తండా గ్రామంలో సర్పంచ్‌ విద్యాసాగర కేక్‌ కట్‌ చేసి వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ జయశ్రీ తన కార్యాలయంలో సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృషి, పట్టుదలతో ముందుకెళ్తే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నార్నూర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఘనంగా నిర్వహించారు. అక్కడి మహిళా సిబ్బందిని శాలువాతో సన్మానించారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యత గురించి వివరించారు. సమావేశంలో పిన్సిపాల్‌ మహేంద్రకుమార్‌, అధ్యాపకులు బాలాజీ కాంబ్లే, ఉదయ్‌రెడ్డి, వెంకటరమణ, తిరుపతిరెడ్డి ఉన్నారు. 

బోథ్‌: బోథ్‌ గ్రామ పంచాయతీలో సోమవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీడీవో రాధ, ఉప సర్పంచ్‌ కట్ట పల్లవిలను బోథ్‌ సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తునందున వారి వారి కుటుంబాలు సమాజం వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

సిరికొండ: మండల కేంద్రంలో సోమవారం మహిళా సంఘాలు, డ్రీమ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ సర్పంచ్‌ ఓరుగంటి నర్మద, ఎంపీటీసీ ఫర్వీన్‌, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు రాధను  సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ మండల కో-ఆర్డినేటర్‌ జంగుబాపు, గ్రామ సంఘం వీవోఏ, ఎంపీడీవో సురేష్‌, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:18:39+05:30 IST