అత్తింటి వేధింపులకు వివాహిత బలి

ABN , First Publish Date - 2022-10-01T06:15:04+05:30 IST

మెట్టినింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్యాయత్నం

తల్లి, ఏడాది వయసు కలిగిన చిన్నకుమార్తె మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కుమార్తె

భర్త, అత్తలే కారణమంటూ లేఖ రాసి సోదరికి వాట్సాప్‌ ద్వారా పంపిన బాధితురాలు


వెంకోజీపాలెం, సెప్టెంబరు 30:


మెట్టినింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, ఏడాది వయసు కలిగిన చిన్న కుమార్తె మృతిచెందగా, పెద్ద కుమార్తె (నాలుగున్నరేళ్ల వయసు) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్త, అత్త వేధింపులు అందుకు కారణమంటూ లేఖ రాసి సోదరికి వాట్సాప్‌ ద్వారా పంపింది. ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ప్రసాద్‌కు మృతురాలి తల్లి అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని నామవరానికి చెందిన శైలజ (30)కు...విశాఖలోని కృష్ణా కళాశాల సమీపంలో వుంటున్న పి.మోహన్‌కృష్ణ (ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఉద్యోగి)తో 2017 ఆగస్టు ఐదో తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. అయితే పెళ్లయిన కొన్నాళ్ల తరువాత వేధింపులు మొదలయ్యాయి. సారె కింద మరో రూ.5 లక్షలు తేవాలంటూ అత్త వేణి, భర్త కృష్ణమోహన్‌ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. శైలజ ఎలాగోలా సర్దుకుపోతూ వచ్చింది. అయినా వారి వేధింపులు ఆగలేదు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టింది. రెండో కాన్పులో ఏడాది క్రితం మరో ఆడపిల్ల పుట్టింది. ఇద్దరూ ఆడపిల్లలేనంటూ శారీరకంగా, మానసికంగా మరింత వేధించసాగారు. దీంతో భర్త, అత్త వేధింపులు భరించలేకున్నానని, తన చావుకు వారే కారణం అని బుధవారం శైలజ లేఖ రాసి నగరంలోని కంచరపాలెం ప్రాంతంలో వుంటున్న తన సోదరికి వాట్సాప్‌ చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు బిడ్డల (సుషిత (4), అచ్యుత (1))కు విషమిచ్చి తాను తాగేసింది. వాట్సాప్‌ మెసేజ్‌ చూసిన ఆమె సోదరి వెంటనే శైలజ భర్తకు ఫోన్‌ చేసింది. అతను ఇంటికి వెళ్లేసరికి ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. హుటాహుటిన సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అచ్యుత గురువారం మృతిచెందగా, శుక్రవారం శైలజ కన్నుమూసింది. పెద్దకుమార్తె చికిత్స పొందుతోంది. పెద్ద కుమార్తె ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే రాజమండ్రిలో వుంటున్న శైలజ తల్లి అనంతలక్ష్మి విశాఖపట్నం వచ్చారు. రెండేళ్లుగా భర్త, అత్త వేధింపులు తన కుమార్తె మౌనంగా భరిస్తూ వచ్చిందని, ఇక తట్టుకునే ఓపికలేక తనువు చాలించిందంటూ ఆస్పత్రి వద్ద భోరుమంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2022-10-01T06:15:04+05:30 IST