21 ఏళ్ల క్రితం చదువుకునేందుకు అమెరికాకు వెళ్లిన ఈ భారతీయ వనిత.. ఇప్పుడు అక్కడ చేస్తున్నదేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-08-24T07:17:30+05:30 IST

‘చదువుకు జీవితాలను మార్చే శక్తి ఉంది’ అనే మాటను ఆమె తల్లిదండ్రులు నమ్మారు. అందుకే కష్టపడి, తమకు ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి చదువుకున్నారు. ఆ తర్వాత తన పిల్లలను కూడా కష్టపడి చదివించారు. అలా చదువుకోవడం కోసం 21 ఏళ్ల క్రితం అమెరికా వచ్చింది రితికా శర్మ కురుప్. తాను చదువుకొని జీవితంలో సక్సెస్ సాధించిన తర్వాత..

21 ఏళ్ల క్రితం చదువుకునేందుకు అమెరికాకు వెళ్లిన ఈ భారతీయ వనిత.. ఇప్పుడు అక్కడ చేస్తున్నదేంటో తెలిస్తే..

‘చదువుకు జీవితాలను మార్చే శక్తి ఉంది’  అనే మాటను ఆమె తల్లిదండ్రులు నమ్మారు. అందుకే కష్టపడి, తమకు ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి చదువుకున్నారు. ఆ తర్వాత తన పిల్లలను కూడా కష్టపడి చదివించారు. అలా చదువుకోవడం కోసం 21 ఏళ్ల క్రితం అమెరికా వచ్చింది రితికా శర్మ కురుప్. తాను చదువుకొని జీవితంలో సక్సెస్ సాధించిన తర్వాత.. ఈ చదువు గొప్పతనాన్ని అందరికీ చెప్పి, చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని అనుకుంది. దీనికోసం కృషి చేస్తూనే ఉంది.


ప్రతిరోజూలాగే ఆ రోజు కూడా కిండర్ గార్డెన్ పిల్లలకు కథలు వినిపిస్తోంది రితికా శర్మ కురుప్. ఆ పిల్లల్లో ఒక పాప.. వచ్చీ రాని మాటలతో ‘‘నువ్వెందుకని అదోలా మాట్లాడుతున్నావ్?’’ అనడిగింది. భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన రితిక.. తన యాస ఆ పాప దృష్టిని ఆకర్షించిందని అర్థం చేసుకుంది. వెంటనే ఒక మ్యాప్ తీసి భారత్‌ను చూపించింది. తాను అక్కడి నుంచి వచ్చానని, ఇలా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్లు రకరకాల యాసల్లో మాట్లాడతారని చెప్పింది. ఆ తర్వాత పిల్లలందరూ ఆశ్చర్యంతో మ్యాప్‌ను చూస్తూ రకరకాల ప్రశ్నలడిగారు. ఇలా కాసేపు గడిచిన తర్వాత రితిక వాళ్లను ఒక్కొక్కరిని.. ‘‘నేను కాలేజి చదువుల కోసం ఇక్కడకు వచ్చా. మరి మీరు కాలేజి చదువుల కోసం ఎక్కడికి వెళ్తారు?’’ అని అడిగింది. ఒక్కొక్కరూ ఒక్కో దేశం పేరు చెప్తుండగా.. ఒక చిన్నపిల్లాడు తాను కాలేజి చదువు చదవడం జరగదని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన రితిక ఏం జరిగిందని అడగ్గా.. తాను భవిష్యత్తులో జైలుకెళ్తానని చెప్పాడు. తనకు జీవితంలో ఎదురైన షాకింగ్ అనుభవం ఇదేనని అంటున్న రితిక.. ప్రస్తుతం ఇలాంటి ఆలోచనలను సమాజంలో నుంచి తొలగించడం కోసం ప్రయత్నిస్తోంది.


రితిక తల్లిదండ్రులు కూడా చదువుకున్న గొప్ప శక్తిని గుర్తించారు. తాము స్వయంగా కాలేజి చదువులు చదివారు. ఆ తర్వాత పిల్లలను కూడా బాగా చదివించారు. అలా రితిక తన కాలేజ్ చదువుల కోసం అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి వచ్చింది. అక్కడ సోషల్ వర్క్ అండ్ పబ్లిక్ పాలసీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్లు కూడా ఒహాయోలోనే చదువుకుంటున్నారు. ఆ సమయంలోనే తన పిల్లలకు చదువుకోవడానికి మంచి సదుపాయాలు, సౌకర్యాలు లభిస్తున్నాయని, ఇలాంటి సదుపాయాలు తమ తల్లిదండ్రుల కాలంలో అందుబాటులో లేవని ఆమె గుర్తించింది.


ట్రాయ్ అనే కంపెనీలో కాసా (కోర్ట్ అపాయింటెడ్ స్పెషల్ అడ్వొకేట్)గా కెరీర్ ప్రారంభించింది రితిక. ఈ ఉద్యోగంలో తాను చాలా నేర్చుకున్నానని, ముఖ్యంగా పేదరికంలో జీవనం సాగిస్తున్న నల్లజాతి పిల్లలపై పాలసీలు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో తనకు అక్కడే తెలిసిందని రితిక చెప్తుంది. ఆ తర్వాత లెర్న్ టు ఎర్న్ డేటన్ అనే కంపెనీలో ఉద్యోగంలో చేరింది. చిన్నారుల విద్యా విభాగానికి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. కమ్యూనిటీలో విద్యకు బాగా ప్రచారం చేపట్టి, వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. అదే సమయంలో స్థానికంగా జాతిసమానత్వ విద్య అజెండాను ప్రారంభించి, దాన్ని మరింత డెవలప్ చేసింది.


డేటన్‌లో చాలామందితో కలిసి పనిచేశానని, అది తనకు చాలా నేర్పిందని రితిక అంటోంది. ఆ సమయంలోనే సమాజానికి కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో కిండర్ గార్డెన్ పిల్లలకు చదువు చెప్పే బాధ్యత తీసుకుంది. ఆ సమయంలోనే నార్త్‌రిడ్జ్‌లోని ఒక కిండర్ గార్డెన్‌లో చిన్నారి తాను భవిష్యత్తులో జైలుకు వెళ్తానని అన్నాడు. దీంతో పరిశోధన చేయగా మోంట‌గోమరీ కౌంటీలో జాతి, లింగాల ఆధారంగా పిల్లల భవిష్యత్తులో కనిపించే మార్పులు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి ఈ విషయంలో తాను కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని, అదే సమయంలో తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నానని రితికి తెలిపింది. ‘‘పిల్లలందరికీ జీవితంలో విజేతలుగా నిలవడానికి సమాన అవకాశాలు ఉండాలనేదే నా నమ్మకం. కేవలం రంగు అనేది దీనిపై ప్రభావం చూపకూడదు’’ అని ఆమె చెప్పింది.


ప్రస్తుతం సిన్సినాటికి చెందిన ‘స్ట్రైవ్ టుగెదర్’ అనే సంస్థలో రితిక పనిచేస్తోంది. మూడేళ్లుగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ఆమె.. ప్రతి పిల్లాడినీ ఉయ్యాల నుంచి ఉద్యోగం వరకూ ఎలా తీసుకెళ్లాలనే విషయంపైనే తమ సంస్థ కృషి చేస్తోందని చెప్పింది. దేశంలోని మొత్తం 70 రకాల కమ్యూనిటీలతో తాము కలిసి పనిచేస్తామని తెలియజేసింది. ఈ సంస్థ తాము తీసుకునే ప్రతి నిర్ణయాన్ని డేటా ఆధారంగానే తీసుకుంటుంది. ముఖ్యంగా జాతి, పేదరికం ఎలాంటి ప్రభావాలు చూపుతాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదే విషయంలో 2017 కంపెనీ సీఈవో జెన్నిఫర్ బ్లాట్జ్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యలో జాతిసమానత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.


ఈ కంపెనీ వాతావరణం తనకు బాగా నచ్చిందని, ఇక్కడ మనం కొత్త విషయాలు నేర్చుకుంటూనే నాయకత్వం వహించవచ్చని రితిక అంటోంది. వివిధ కారణాల వల్ల పిల్లలు చిన్నప్పుడే వాళ్ల జీవితాలను ఫెయిల్యూర్ వైపు పంపే ప్రస్తుత విధానాలను ధ్వంసం చేసి, సమాజంపై ఎల్లకాలం ప్రభావం చూపే మార్పులు తీసుకురావడమే తమ కంపెనీ లక్ష్యమని రితిక వివరించింది. జాతి, రంగు, ఆర్థిక పరిస్థితి పిల్లల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వంటి డేటా చూసినప్పుడు ఎందుకిలా జరుగుతోంది? అనే ప్రశ్నే మమ్మల్ని ముందుకు నడుపుతుందని రితిక అన్నారు. 


బీదరికంలో ఉన్న పిల్లలకు సత్తా ఉండదని, వారికి చదువుకోవాలనే ధ్యాస ఉండదని సమాజంలో కొందరు భావిస్తారు. ఇలాంటి పిచ్చి వాదనలను సమాజంలో నుంచి తొలగించడం ‘స్ట్రైవ్ టుగెదర్’ లక్ష్యాల్లో ఒకటని రితిక చెప్పారు. స్కూళ్లకు కేటాయించే నిధుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయని, ఇది కూడా చాలా ప్రభావం చూపుతోందని ఆమె వెల్లడించారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడం కోసం రితిక చేస్తున్న కృషిని ఆమెకు చదువు చెప్పిన ఒహాయో స్టేట్ యూనివర్సిటీ కూడా గుర్తించింది. ఆమె తన కెరీర్‌లో సాధించిన విజయాలకు గుర్తుగా కాలేజిలోని సోషల్ వర్క్ అలూమ్ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో రితికకు చోటు కల్పించింది. ‘‘ నా పిల్లలు జీవితాలను మార్చింది నేను కాదు. మా అమ్మానాన్న. అప్పట్లో ఎదురైన కష్టాలకు ఎదురు నిలిచి వాళ్లు చదువుకోవడం మా జీవితాలు మార్చింది. వాళ్లు సృష్టించిన చిన్న అలజడి ఇప్పుడు కెరటంలా మారి నా తర్వాతి తరం తలరాతను మార్చింది’’ అని రితిక చదువు గొప్పతనాన్ని వివరిస్తోంది.

Updated Date - 2021-08-24T07:17:30+05:30 IST