‘మనుషులు’ కరువైన వేళ!

May 10 2021 @ 22:46PM
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తరలిస్తున్న కుటుంబసభ్యులు


 కరోనాతో వృద్ధుడి మృతి

అంత్యక్రియలు పూర్తిచేసిన మహిళలు

దరిచేరని గ్రామస్థులు, బంధువులు

టెక్కలి రూరల్‌, మే 10: అనుబంధాలు అక్కడ ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అనురాగాలు అక్కడ చిన్నబోయి నిల్చున్నాయి. ఆప్యాయతలు అర్థం వెదుక్కుంటూ ఎటో వెళ్లిపోయాయి. మమతలు చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. మానవత్వం అక్కడ తల ఎత్తుకోలేక...ఊరు విడిచి వెళ్లిపోయింది. కరోనా భయం...వీటన్నిటినీ దూరం చేసేసింది. మనిషిని...మనిషి నుంచి వేరు చేసేసింది. ఒక ఊరు ఊరంతా జీవితాంతం మరచిపోలేని దుర్ఘటనకు సాక్షీభూతమైంది. అయిన వారంతా ప్రేక్షక పాత్ర పోషించిన క్షణాన...ఎన్నడూ గడప దాటి బయటకు రావడమే ఎరుగని నలుగురు మహిళలు ..ఆ ఇంటి పెద్ద దిక్కును గడప దాటించాల్సి వచ్చింది. ఆఖరి మజిలీ బాధ్యతను భుజానికి ఎత్తుకోవలసి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటనకు టెక్కలి మండలంలోని ఓ గ్రామం వేదికైంది. వివరాల్లోకి వెళితే... ఓ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో సోమవారం కన్నుమూశాడు. ఇప్పటికే ఆ గ్రామంలో పాజిటివ్‌ కేసులు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడి బంధువులు, గ్రామస్థులు మృతదేహాన్ని తాకడానికి కాదు కదా...సమీపానికి కూడా రాలేదు. అతని కుమారుడు గతంలోనే మరణించాడు. ఇంటిలో మగదిక్కు లేరు. ఆ ఇంటిలోని మహిళలు ఎవరైనా సాయం చేయకపోతారా అని చాలాసేపు నిరీక్షించారు. అయినా సాయం అందించే చేతులే కరువయ్యాయి. ఇక చేసేదిలేక ఆ వృద్ధుని భార్య, కుమార్తె, కోడలు, మరదలు... నలుగురూ అంతిమ సంస్కారాలు చేసేందుకు పూనుకున్నారు. పీపీఈ కిట్లు ధరించి... మృతదేహాన్ని శ్మశానానికి తరలించి...వృద్ధుని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ మహిళలకు ఎదురైన దుస్థితిని తలచుకొని మిగిలిన వారు కన్నీరు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు.
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.