ప్యాలెస్ దాటి సీఎం జగన్ బయటకు రారు: మహిళా సంఘాల జేఏసీ

ABN , First Publish Date - 2021-09-11T22:41:48+05:30 IST

తను కట్టుకున్న ప్యాలెస్ నుంచి ఏపీ సీఎం జగన్ బయటకు రారని మహిళా సంఘాల

ప్యాలెస్ దాటి సీఎం జగన్ బయటకు రారు: మహిళా సంఘాల జేఏసీ

జంగారెడ్డిగూడెం: తను కట్టుకున్న ప్యాలెస్ నుంచి ఏపీ సీఎం జగన్ బయటకు రారని మహిళా సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఇటీవల హత్యకు గురైన ముప్పిడి రాజు కుటుంబాన్ని మహిళా సంఘాల జేఏసీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్టంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. రాజు, మంత్రి వలె అధికార పార్టీ నాయకులు, పోలీసులు కలసి నిరంకుశ పాలన సాగిస్తునారని ఆరోపించారు. దళితుల, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చామని చెప్పుకునే జగన్ మహిళలు, దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఫోటోలు దిగుతూ, చెక్కులు ఇస్తున్నామని అంటున్నారని, ఆచరణలో ఇప్పటివరకూ బాధితులకు సహాయం అందలేదని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్యాలెస్ దాటి బయటకు రారని, బాధితులకు న్యాయం జరగదని జగన్‌పై మహిళా సంఘాల నేతలు విరుచుకుపడ్డారు. దళితులపై దాడులమీద హోం మంత్రి మాట్లాడారని, అధికార పార్టీలో వున్న దళిత నాయకులు జగన్ మెప్పు కోసం పాకులాడుతున్నారని మహిళా నాయకులు తీవ్రంగా విమర్శించారు. 




 శ్రీనివాసపురంలో దళిత  బాలుడు ముప్పిడి రాజును హత్య చేసిన ఘటనలో నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారన్నారు. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజలు ఆందోళన చేస్తే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చెయ్యలేదన్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేసారు. అలాగే బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,  కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో D రమాదేవి (ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి),  శ్రీ దుర్గ భవాని ( రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి), సుంకర పద్మ శ్రీ ( రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు), మహిళా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-11T22:41:48+05:30 IST