ఏంటయ్యా ఇది.. YSRCP ఎమ్మెల్యే పర్యటనలో మహిళల నిష్టూరం..

ABN , First Publish Date - 2022-05-13T12:17:04+05:30 IST

ఏంటయ్యా ఇది.. YSRCP ఎమ్మెల్యే పర్యటనలో మహిళల నిష్టూరం..

ఏంటయ్యా ఇది.. YSRCP ఎమ్మెల్యే పర్యటనలో మహిళల నిష్టూరం..

తిరుపతి/ఓజిలి : మహిళలు తమ సమస్యలపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సాక్షిగా ఆక్రోశం వెలిబుచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఓజిలి మండలం వెంకటరెడ్డిపాళెం పంచాయతీ పరిధిలోని వాకాటివారికండ్రిగలో ఎమ్మెల్యే పర్యటించారు. ఓ మహిళ రైతు భరోసా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా..అక్కడ రెవెన్యూ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సంజీవయ్య అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు రాకపోతే సహించేదిలేదంటూ హెచ్చరించారు.వెంకటరెడ్డిపాళెంలో ఓ మహిళ పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంటే తనను ఉన్నట్టుండి తొలగించి నోటికాడ కూడు తీసేశారని ఆక్రోశం వెళ్లగక్కింది. 


తమ ఇంటి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో చూడండంటూ అక్కడికి వచ్చిన అందరికీ డ్రైనేజీ అవస్థలను చూపించింది. డ్రైనేజీ కాలువలతోపాటు ఈ ప్రాంతంలో తూములు కూడా వేయిస్తామని ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని ప్రభుత్వ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ‘అమ్మఒడి పథకం కింద 15 వేలు ఇస్తున్నామని చెబుతున్నారు. నా దగ్గర పనిచేయించుకుని 30 వేల రూపాయలు ఎగ్గొట్టారు...’ అంటూ ఆమె చేయి విదుల్చుకునే ప్రయత్నం చేసింది.తహసీల్దారు లాజరస్‌, ఎంపీడీవో రమణయ్య, జడ్పీటీసీ రవీంద్రరాజు, నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి, ఓజిలి వైస్‌ ఎంపీపీలు ప్రసాద్‌నాయుడు, మీనాక్షి, సర్పంచ్‌ లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read more