నన్ను నియోజకవర్గానికి రానివ్వరా?

ABN , First Publish Date - 2022-06-23T08:23:56+05:30 IST

నన్ను నియోజకవర్గానికి రానివ్వరా?

నన్ను నియోజకవర్గానికి రానివ్వరా?

ఎంపీ ప్రాథమిక హక్కులనే హరిస్తారా?

సీఎం జగన్‌ కు రాఘురామ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి) నా నియోజకవర్గానికి నేను వెళ్తానంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు తన రాష్ర్టానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్లు సహచర ఎంపీలు చెప్పారని.. రాష్ట్రం ఏమైనా నీ సొంతమా అని జగన్‌ను ప్రశ్నించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారన్నారు. రఘురామ రాష్ర్టానికి వేస్త, అరెస్టు చేయవలసి వస్తుందని ‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’ సభ్యులకు ఏపీ పోలీసులు చెప్పారని తెలిపారు. తమ ‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’ విశాఖలో సమావేశం కావాల్సి ఉందని, ఈ విషయాన్ని కమిటీ సభ్యులు రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా... కమిటీలో రఘురామరాజు ఉంటే ఆ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తమ సభ్యులు చెప్పారన్నారు. ఆయన వస్తే అరెస్టు చేస్తామని, ఆతర్వాత ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారన్నారు. ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్‌ చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే బరితెగింపు చర్యలకు దిగొద్దని సీఎం జగన్‌ను హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, తన గ్రామంలో, తన ఇంటి సమీపంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతుంటే, స్థానిక లోక్‌సభ సభ్యుడిగా తాను హాజరు కావడం ప్రోటోకాల్‌ అని, ముఖ్యమంత్రి హాజరైనా కాకపోయినా... తాను మాత్రం హాజరు కావాలన్నారు. 32 కేసుల్లో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లొచ్చు కానీ.. తాను మాత్రం నియోజకవర్గానికి వెళ్లొద్దా? అని రఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-23T08:23:56+05:30 IST