చెక్కతో శాటిలైట్ నిర్మాణం.. శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం!

Jun 16 2021 @ 18:54PM

ఇంటర్నెట్ డెస్క్: చెక్కతో సోఫాలు, మంచాలు, కుర్చీలు తయారు చేయచ్చు..ఇది అందరికీ తెలిసిందే! అయితే..ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం చెక్కతో ఏకంగా శాటిలైట్‌నూ తయారు చేయచ్చని కనిపెట్టారు. ఈ విషయంలో వారు చెపట్టిన ప్రయోగాలు విజయవంతమవడంతో.. వుడ్‌శాట్ పేరిట ఓ చెక్క‌ ఉపగ్రహాన్ని నిర్మించి అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. వారు రూపొందించబోయేది ఓ నానోశాటిలైట్. 10 సెంటీమీటల్లు పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుంది. ఈ చిన్న ఉపగ్రహం ఉపరితలం మాత్రమే ప్లైవుడ్‌తో నిర్మిస్తారు. ఇందులో ఓ కెమెరాతో పాటూ సెల్ఫీ స్టిక్ కూడా ఉంటుంది. అంతరిక్షంలో తీవ్రపరిస్థితులు ఎదుర్కొనేలా చెక్కను సిద్ధం చేసేందుకు వారు ముందుగా అందులోని తేమను అంతా తొలగించారు. ఆ తరువాత ఓ ప్రత్యేక మిశ్రమాన్ని చెక్కకు పైపూతగా పూశారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు వారు జూన్ 12న చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. ఆకాశంలో 31.2 కిలోమీటర్లకు చేరుకున్న ఈ ఉపగ్రహ మోడల్‌ ఆ తరువాత పారాషూట్ సాయంతో కిందకు దిగింది. ఆ సందర్భంగా శాటిలైట్‌కు అమర్చిన కెమెరా బోలెడన్ని ఫోటోలు కూడా తీసింది. 

ఆర్కిటెక్ ఆస్ట్రోనాటిక్స్ అనే సంస్థ ఈ శాటిలైట్ నిర్మాణానికి పూనుకుంది. జారీ మాకినెన్ అనే రచయిత బ్రాడ్‌కాస్టర్ ఈ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు, ఇంజినీర్ అయిన సాములీ నీమాన్ వుడ్‌శాట్ ప్రాజెక్టుకు చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరిస్తున్నారు. చెక్కతో అనేక వస్తువుల మోడళ్లను రూపొందించడం తనకు ఎంతో ఇష్టమని సంస్థ వ్యవస్థాపకుడు మాకినెన్ తెలిపారు. దీంతో..శాటిలైట్ల నిర్మాణాన్నీ చెక్కతో చేపట్టాలన్న వినూత్న ఆలోచన తనకు కలిగిందన్నారు. వుడ్ శాట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలని అక్కడి శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే..పెద్ద పెద్ద శాటిలైట్ల విషయంలోనూ చెక్కను వినియోగించగలిగేలా టెక్నాలజీ అభివృద్ధి చేయాలనేది వారి అసలు లక్ష్యం. ఇక ఆర్కిటెక్ ఆస్ట్రోనాటిక్స్‌ ప్రయత్నాలకు యూరోపియన్ స్పేస్ ఎంజెన్సీ తోడ్పాటునందిస్తోంది. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...