మాటలంటే మాటలా! బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ!

ABN , First Publish Date - 2021-07-18T05:39:40+05:30 IST

నోరుజారితే వెనక్కి తీసుకోలేం సరికదా నగుబాటుతో ఎక్కడికో అథఃపాతాళానికీ జారిపోతాం. మరీ ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు పెదవి విప్పేముందే రాగల పేచీలనూ...

మాటలంటే మాటలా! బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ!

నోరుజారితే వెనక్కి తీసుకోలేం సరికదా నగుబాటుతో ఎక్కడికో అథఃపాతాళానికీ జారిపోతాం. మరీ ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు పెదవి విప్పేముందే రాగల పేచీలనూ 360 డిగ్రీల్లో మదింపు చేసుకోగలగాలి. లేదంటే ఎదుటివారిపై సంధించిన మాటల శరం తిరిగి మన గుండెల్లోనే గుచ్చుకుంటుంది. ఏళ్ల తరబడి పడిన కష్టం, సాధించిన పలుకుబడి, పవరూ ఒక్క మాటతో మట్టిపాలవుతాయి.


కేరళలో ఈ మధ్యనే పుల్లవిరుపుగా మాట్లాడి పదవిని పోగొట్టుకున్నారు ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎంసి జోసెఫిన్‌. తన భర్త, అత్త వేధిస్తున్నారంటూ ఒక మహిళ జోసెఫిన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశావా? అని జోసెఫిన్‌ అడిగారు. లేదని చెప్పిందా బాధిత మహిళ. ఈ సమాధానంతో కోపం నషాళానికి అంటిన జోసెఫిన్‌ చిరాగ్గా ‘మరయితే అనుభవించు’ అని వ్యాఖ్యానించారు.


ఇంకేముంది! ఈ మాట తేనెతుట్టెను కదిపినట్లయింది. జోసెఫిన్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో ఊరేగింది. ఓ బాధిత మహిళ పట్ల మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఇలా కటువుగా మాట్లాడి ఉండకూడదని, ఆ పదవిలో కొనసాగటానికే ఆవిడ అర్హురాలు కాదని నిరసనలు పెల్లుబికాయి. మహిళలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలే తప్పించి మిన్నకుండి పోకూడదన్న అభిప్రాయంతోటే ఒక తల్లిలా మందలించానని జోసెఫిన్‌ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఆ మాట అని ఉండవలసింది కాదని సంజాయిషీ చెప్పుకున్నారు. అయినా ఆ ఒక్క మాటే బెడిసి కొట్టింది. అన్నివర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు జోరందుకోవడంతో పదవికి జోసెఫిన్‌ రాజీనామా చేయక తప్పలేదు.


బాహాటంగానే కాదు, ప్రైవేటు సంభాషణల్లోనూ మాట మీరితే పదవికి చేటు తప్పదని ఆంధ్రప్రదేశ్‌లో రుజువైంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా వైసిపికి బాకాలూది ఆ తర్వాత తిరుపతి వెంకన్న సాక్షిగా పదవిలోకి వచ్చిన నటుడొకరు ఓ మహిళా ఉద్యోగినితో జరిపారన్న శ్రుతిమించిన ఫోను సంభాషణ వైరల్‌ అయి పదవిని పోగొట్టుకున్నారు.


ఇప్పుడు గోడలకూ కెమెరాలున్నాయి. అవి దృశ్యాలను బాహాటంగా బొమ్మ కట్టిస్తాయి. సెల్‌ఫోన్లకూ చాటంత చెవులున్నాయి. ప్రతి మాటనూ పూసగుచ్చినట్లు రికార్డు చేసి కోడై కూస్తాయి. అవతలివాడు మనవాడేననుకుని, ఫోనులో మాటల కంచె దాటితే, అయినవాడనుకున్నవాడే ప్రత్యర్థి విసిరిన బాణమై ప్రాణాలు తీస్తాడు. ఇది రాజకీయ నాయకులకు మాత్రమే వర్తించే పాఠం కాదు. ఉద్యోగులూ ఉపాధ్యాయులూ- ఇలా వారు వీరనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనుక్షణం ‘సెల్‌ఫోన్‌ పడగ నీడన’ ఉన్నామన్న స్పృహతో అప్రమత్తంగా లేకుంటే అభాసుపాలవడం మాత్రం గ్యారంటీ. 


ఒక సినిమా కార్యక్రమం లైవ్‌లో మహిళలపై తన అమూల్యాభిప్రాయాన్ని నిస్సిగ్గుగా చాటుకున్న సీనియర్‌ నటుడొకరు ఆ తర్వాత మహిళా సంఘాల నుంచి ముఖం వాచేలా తిట్లు తినాల్సి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు రాజకీయ నాయకులు ప్రభుభక్తి ప్రదర్శనలో పోటీపడుతూ తిట్ల దండకాల్లో సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నారు. తమ పదవికి, హోదాకు తగదన్న విషయాన్ని సైతం మరిచి తిట్ల పురాణాల్లో మునిగి తేలుతున్నారు. తమలపాకుతో నువ్వొకటంటే, తలుపు చెక్కతో నే రెండంటా అనే సామెతకు పూర్తి న్యాయం చేస్తున్నారు.


‘‘నువ్వు దొంగవి, కాదు నువ్వే గజదొంగవి; నువ్వు సన్నాసివి, కాదు నువ్వే చవటవి, దద్దమ్మవి; నువ్వు బట్టేబాజ్‌గాడివి, నువ్వు ద్రోహివి, పంచలూడదీసి కొడతాం...’’ ఇలా సాగే మాటల యుద్ధం మధ్య రిపోర్ట్‌ చేయడానికి రవ్వంత విషయమేదైనా ఉందా? అని కవరేజికి వచ్చిన మీడియా వాళ్లు భూతద్దాలు పెట్టుకుని మరీ శోధించాల్సి వస్తోంది. సంస్కారం, సభ్యతలు మరిచి కొందరు ప్రబుద్ధులు ఈరకంగా ప్రజాసేవలో పునీతులవుతున్నారు. వీరిని ప్రజలు వెయ్యికళ్లతో కనిపెడుతూ ఏవగించుకుంటున్నారన్న సత్యం మాత్రం వారికి బోధపడక పోవడమే విచారం కలిగిస్తుంది.


ఇప్పుడున్న సామాజిక వాతావరణంలో ఆయా వర్గాల మనోభావాలకు, సున్నితత్వాలను, కాలానుగుణంగా వస్తున్న ఆలోచనా ధోరణులను అవగాహన చేసుకోకుండా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు మరికొందరు.


‘మేమేమీ గాజులు తొడుక్కొని కూచోలేదు, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు, గుడ్డి కంటే మెల్ల మేలు, భట్రాజు పొగడ్తలు వంటి పాతకాలపు పలుకుబళ్లు, సామెతలు సంబంధిత వర్గాల వారికి మనస్తాపం కలిగిస్తున్నాయి. నిరసనలకూ దారితీస్తున్నాయి. ‘ఉప్పర, పింజారి, ముష్టి’ వంటి పదాలు ఆయా సామాజిక వర్గాలతో ముడిపడినవి. కానీ ఈ స్పృహ లేకుండా కొందరు సినిమా రచయితలు ఈ పదాలనుపయోగించి, పదునుగా సంభాషణలు రాశామనుకున్నా చివరకు సెన్సార్‌లో వాటిని తొలగించాల్సి వస్తోంది.


‘తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు. అంతటి అమాయకులు ఆ గొల్లవారు’ అంటూ ఒక ప్రవచనకర్త చేసిన వ్యాఖ్య ఒక వర్గంలో పెద్ద దుమారాన్ని రేపింది. తాను ఇకనుంచి ప్రవచనాలే చెప్పబోను అనేంతవరకు ఇది వెళ్లింది. ఈ మాటలకు అసలు అర్థం కొందరు అనుకుంటున్నట్లు ఆవు తల, పొదుగులు శుభ్రం చేయడానికి సంబంధించినది కాదని, తలకు చుట్టుకునే వస్త్రం అడిగేవారు, అంగవస్త్రం కూడా కావాలని అడగలేని అమాయకులని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.


దివ్యాంగులు పదం ప్రాచుర్యంలోకి వచ్చాక, మెంటల్లీ రిటార్టెడ్‌, ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌, డిఫరెంట్లీ ఏబుల్డ్‌ పదాలకు కాలం చెల్లింది. మీ అంతరంగాన్ని, సంస్కారాన్ని, సమకాల స్పృహను పట్టి చూపేవి మీ మాటలే. మీరు సున్నితులా కాదా అని తేల్చి చెప్పేవీ ఆ మాటలే. నిజానికి మాటలంటే మాటలు కాదు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రచయితలు సహా అందరూ ఈ వాస్తవాన్ని గుర్తించి మాటల్లో, రాతల్లో నిగ్రహం పాటించడం మంచిది.

గోవిందరాజు చక్రధర్‌

Updated Date - 2021-07-18T05:39:40+05:30 IST