Advertisement

శుష్క వాగ్దానాలతో విలయమాగుతుందా?

Oct 22 2020 @ 00:19AM

ఈ వరదల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కాలనీలకు వెళ్ళినప్పుడు జనం వారికి పరిస్థితిని చూపించి నిలదీశారు. ‘మీరు లోతట్టులో ఇళ్ళు కట్టుకుంటే మేమేమి చేయాల’ని తిరిగి ప్రజాప్రతినిధులే జనంపై మండిపడ్డారు. ‘మరి ఇళ్ళు కట్టుకునేందుకు అనుమతి ఎందుకు ఇచ్చార’ని జనం ఎదురుతిరిగి విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? 


ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శృతిమించి రాగాన పడింది. ఫలితంగా వాతావరణ కాలుష్యం పెరిగింది. మనిషి ఊహకందని వ్యాధులు, భూకంపాలు, ప్రళయాలు, విచిత్రమైన తుఫానులు సంభవిస్తున్నాయి. మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నదనే సంకేతాలు అందుతున్నాయి. అయినా ఈ అంశాన్ని పాలకులు ఖాతరు చేయకపోవడంతో మరింత గందరగోళాలు చోటు చేసుకుంటున్నాయి. 


గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం ఎందుకు ఇంతగా కుదేలయింది? రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌ నగరం నిండు కుండలా ఎందుకు మారింది? ఆ సందర్భంగా వరంగల్ నగరంలో పర్యటించిన మున్సిపల్‌ శాఖామాత్యులు కె.టి. రామారావు అక్కడి నాలాలు, చెరువులు, కుంటలపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అందుకుగాను రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఆ పనులేం జరగటం లేదు. ఈ నిర్లక్ష్యం వెనక ఏ రాజకీయ ఒత్తిడులున్నాయనేది ప్రధానమైన ప్రశ్న.


 

హైదరాబాద్‌ నగరంలో మూసీ ప్రక్షాళన, దానిపై ఆక్రమణల తొలగింపు అనే అంశం దశాబ్దాలుగా ప్రభుత్వాల ఎజెండాలో ఉన్నది. పాలకులు మారినప్పుడల్లా మూసీని సుందరంగా మారుస్తామని, మంచినీరు పారిస్తామని గొప్పలు చెప్పకోవడం ఆనవాయితీగా వస్తున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం ఈ తరహా హామీలు చేసింది. మూసీని గుజరాత్‌ లోని నర్మదా నది రివర్‌ ఫ్రంట్‌ తరహాలో తీర్చిదిద్దుతామని వాగ్దానం చేసింది. ఆరేళ్లయినా ఆ వాగ్దానం నెరవేరలేదు. గతంలో ఒకసారి ఆక్రమణలను విడిచిపెట్టేది లేదని ప్రకటించి తూతూ మంత్రంగా కొన్నింటిని కూల్చి ఊరుకుంది. మూసీ నది ప్రక్షాళన కార్పొరేషన్‌ అసలు ఎందుకు ఉన్నదో అర్థం కాదు. దానిని రాజకీయ పునరావాసంగా మార్చేసి, చైర్మన్‌లను వేస్తున్నారే తప్ప దాని అసలు లక్ష్యం నెరవేర్చడం లేదు. 


‘నా నగరం నీళ్ళలో చేపల్లాగా జనంతో కళకళలాడాలి’ అని హైదరాబాద్‌కు శంకుస్థాపన చేసిన కులీ కుతుబ్‌ షా ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టే జనం పెరిగారు. కానీ నీళ్లు ఉండేందుకే చోటు లేకుండా చేశారు. సుందర తటాక నగరంగా ఉన్న హైదరాబాద్‌లో అనేక చెరువులు, కుంటలు మాయమయ్యాయి. వాటిని బడా బాబులు, రాజకీయ నేతలు ప్లాట్లుగా మార్చేశారు. తెలిసో తెలియకో జనం వాటిని జీవిత కాలపు పొదుపు సొమ్ములతో కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆక్రమణలకు పాలకుల అండదండలూ ఉన్నాయి. ఈ వరదల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాలనీలకు వెళ్ళినప్పుడు జనం వారికి పరిస్థితిని చూపించి నిలదీశారు. మీరు లోతట్టులో ఇళ్ళు కట్టుకుంటే మేమేమి చేయాలని తిరిగి ప్రజాప్రతినిధులే జనంపై మండిపడ్డారు. మరి ఇళ్ళు కట్టుకునేందుకు అనుమతి ఎందుకు ఇచ్చారని జనం ఎదురుతిరిగి విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? 


సరూర్‌నగర్‌ ప్రాంతంలో 16 ఎకరాల చేపల చెరువు ఇప్పుడు మూడెకరాలకి ఎందుకు కుదించుకుపోయింది? అక్కడ ఆక్రమణలు నిరుపేదలవా, లేక ధనబలం ఉన్నవారివా? బైరాములగూడ లోని సర్వే నెంబర్‌ 59లో ఆరు ఎకరాల చెరువు మూడెకరాలకే పరిమితం కావడమేమిటి? ఇవే కాదు; కాప్రా చెరువు, దేవుని కుంట, బైరాములగూడ, తట్టి అన్నారం... ఇలాంటి చెరువులు, పార్కులు, కుంటల శిఖములు అన్నీ కలిపి దాదాపు 300కు పైగానే ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆక్రమణల వెనుక ఎవరి హస్తం ఉన్నదనే చర్చ జరగాలి. మూసీనది పరివాహక ప్రాంతం ఆకృతిని చెడగొట్టింది ఎవరు? చాదర్‌ఘాట్‌ దగ్గర, శంకర్‌నగర్‌, మూసానగర్‌, వినాయక వీధి తదితర ప్రాంతాలలో దళిత, మైనారిటీల రేకుల షెడ్డుల్లోకి నీళ్ళు వచ్చి, చిన్నచిన్న వృత్తులు చేసుకొని పొట్టపోసుకొనే వారి బతుకులలో చీకటి నిండింది. దీనికి కారణం పాలకులు కాదా? ఆ ప్రాంతంలో మూసీ నది తీరానికి రిటెయినింగ్‌ వాల్‌ ఉన్నా నష్టం పెద్దగా ఉండేది కాదు. కాచిగూడ వైపు రిటెయినింగ్‌ వాల్‌ వుండటం వలన పెద్దగా నష్టం జరగలేదు. ఇక శంషాబాద్‌ పక్కన గల గగన్‌పహాడ్‌లో అప్పన్న చెరువు విస్తీర్ణం 30 ఎకరాల నుండి మూడెకరాలకే కుదించబడిందని, ఆక్రమణకు గురైందని ప్రజలకు తెలుసు. భారీ వర్షానికి నీటి ప్రవాహాన్ని తట్టుకోలేకనే చెరువుకు గండిపడి ఉధృతంగా నీరు వచ్చింది. ఫ్లైవోవర్ బ్రిడ్జి, రోడ్డు తెగిపోయి గాఢనిద్రలో ఉన్న అనేక మంది మృత్యువాత పడ్డారు. పైన పల్లె చెరువును కూడా అనేకమంది ఆక్రమించి బ్రహ్మాండమైన భవనాలు కట్టుకున్నారు. ఇలాంటి ఉదాహరణాలు చాలా ఉన్నాయి.


గత ప్రభుత్వంలో అధికారంలో వున్న రాజకీయ నాయకులే ఇప్పుడున్న ప్రభుత్వంలోకి వలసలు వచ్చి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పదవులలో వున్నారు. గత ప్రభుత్వాలు తప్పు చేసాయి, మాకు ఎలాంటి సంబంధం లేదని ఎలా చేతులు దులుపుకుంటారు. గత ప్రభుత్వ కాలంలో మీరు భాగస్వాములు కారా? 

2000 సంవత్సరం నుండి రియలెస్టేట్‌ వ్యాపారం ఊపందుకున్నది. రియలెస్టేట్‌ వ్యాపారానికి చెరువు, కుంట శిఖాలు, నాలాలు, పార్కులు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూదాన్‌ యాజ్ఞ భూములునే తేడా వుండదు. నేటి పరిస్థితిలో నగరాలు నరక రూపం దాల్చాయంటే రియలెస్టేట్‌ చీకటి వ్యాపారమే ప్రధాన కారణం. కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టంలో సర్వే నెంబర్‌ వారీగా చిత్తశుద్ధితో సమగ్ర సర్వే అమలైతే అసలు బండారం బయటపడుతున్నది. దీనిలో ఎవరెవరి హస్తమున్నదో, వారి నిజస్వరూపం బట్టబయలవుతుంది. ఐతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటారా లేక ఒత్తిడులకు లొంగుతారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితులను గమనంలో ఉంచుకొని భూముల అక్రమణలపై ఉక్కుపాదం మోపకపోతే హైదరాబాద్‌ నగరం లాగానే తెలంగాణలో అన్ని ప్రధాన నగరాలు జల ప్రళయానికి గురికావాల్సివస్తుంది.


ఇక ఆరుగాలం కష్టపడే రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అధిక వర్షాలు, తుఫానులతో గొర్రె తోక బెత్తెడుగా ఉన్న రైతు బతుకు మరింత ఛిద్రమై అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. ఎకరానికి వరికి రూ.25వేలు, పత్తికి రూ.30వేల పెట్టుబడులతో వేసిన పంటలు చేతికొచ్చే సమయానికి ఇలా చేజారిపోవడంతో దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ అధిక వర్షాలతో అపార పంట నష్టం సంభవించింది. వరి నిలువునా పడిపోయింది. పత్తి గింజలు నల్లబడి, పూతకు ఆకు రోగమొచ్చింది. హైదరాబాద్‌ మహానగరంలో వరదల్లో చిక్కుకున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10వేల నగదు చొప్పున తక్షణ సహాయం అందిస్తామని ప్రకటించడం మంచి పరిణామం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు కూడా తక్షణ ఉపశమనం కలిగించేలా సాయం చేస్తే బాగుంటుంది. వరద బీభత్సానికి నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా నిర్దిష్ట కాల పరిమితిలో దీర్ఘకాలిక చర్యలు కూడా చేపట్టాలి. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.లక్ష, పాక్షికంగా కోల్పోయిన వారికి రూ.50వేలు ప్రకటించారు. అయితే వారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ప్రకటించిన రూ.7లక్షల పథకాన్ని వర్తింపచేయాలి. నగరంలో వరదల కారణంగా వేల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోవటమో, లేదా పాడవటమో జరిగింది. ప్రభుత్వం దీన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి పరిహారం చెల్లించేలా బీమా కంపెనీలతో చర్చించాలి. గతంలో మూసీ నది వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తినప్పుడు నాటి నిజాం నవాబు ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మైసూరు నుంచి పిలిపించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు కూడా అనుభవజ్ఞులైన ఇంజనీర్లను సంప్రదించి, ప్రపంచంలోని ఉత్తమ నమూనాలను పరిశీలించి కోటికి పైగా ఉన్న నగర జనాభాకు అనుగుణంగా డిజైన్‌ చేయించాలి.


కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ప్రకృతి విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహాయమందించాలి. రాష్ట్రంలో జరిగిన భారీ పంట నష్టంపై కూడా సంబంధించి రైతాంగానికి ఆర్థిక సాయం అందించాలి. నగర సుందరీకరణపై దృష్టిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గుడిసెలలో ఉండే నిరుపేద ప్రజలకు పట్టా సర్టిఫికేట్స్‌ ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించాలి. అక్రమ నిర్మాణాలు తొలగించి ఎంతటి భారీ వర్షాలు వచ్చినా తట్టుకునే తీరుగా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికను రూపొందించాలి. 


చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.