- జిల్లాలో అన్నదాతలకు ఎన్నాళ్లీ బాధలు
- ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసి నెలకుపైనే
- అయినా రైతులకు ఇంకా అందని రూ.163 కోట్ల డబ్బు
- రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం కరువు
- ఏడు వేల మందికిపైగా అన్నదాతలు ఈసురోమని ఎదురుచూపులు
- రబీ సీజన్ మొదలవడంతో పెట్టుబడికి డబ్బులులేక అప్పుల దారి
- 10.50 లక్షల మెట్రిక్ టన్నులకు 6.90 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు
- ధాన్యం తడిచిందని, తేమ తగ్గిందని సేకరించకుండా కోతపెట్టిన అధికారులు
జిల్లాలో అన్నదాతలు ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఇచ్చిన ధాన్యానికి ప్రభుత్వం నుంచి డబ్బులు అందక ఈసురోమంటున్నారు. ధాన్యం ఇచ్చిన ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు చెల్లించేస్తామని సీఎం జగన్ పదేపదే చెప్పినా ఆచరణలో అసలే మాత్రం అమలుకావడం లేదు. దీంతో నెలలు గడుస్తున్నా రొక్కం ఎప్పుడొస్తుందో తెలియక రబీకి అప్పులు చేయాల్సిన దుస్థితితో అల్లాడుతున్నారు. అధికారులను అడిగితే తొందర్లోనే ఖాతాలో పడతాయని సర్దిచెబుతున్నా పని మాత్రం జరగడం లేదు. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ముగించేసి నెలకుపైనే దాటుతోంది. అయినా ఇంకా అన్నదాతలకు రూ.163 కోట్ల వరకు ధాన్యం బకాయిలు అందలేదు. దీంతో ఏడు వేల మంది వరకు రైతులు తమకు రావలసిన డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో 10.50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా, తడిచిపోయాయనే సాకుతో 6.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొని మమ అనిపించేశారు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభమైందంటే చాలు అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇదేదో తుపాన్లు వచ్చి పంట నాశనం అవుతుందనే భయంకాదు. తీసుకున్న ధాన్యానికి నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం కాళ్లరిగేలా ఎక్కడ తిప్పించుకోవడం మొదలు పెడుతుందోనని. ఊహించినట్టే ఈ ఏడాది కూడా జిల్లావ్యాప్తంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపించింది. ఖరీఫ్ ధాన్యం సేకరణ గతేడాది అక్టోబరులో మొదలుకాగా, అప్పటి నుంచి ఏరోజూ సకాలంలో రైతుల ఖాతాల్లో ధాన్యం బాకీలు జమచేయలేదు. వాస్తవానికి ఎప్పటిలాగే సేకరణ ప్రక్రియ ప్రారంభంలో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో అన్నదాతలు ధాన్యం ఇచ్చిన 21 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని గొప్పగా చెప్పారు. కానీ ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో ధాన్యం బాకీలు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో ఎప్పటికప్పుడు వాయిదాలపై వాయిదాలు వేస్తూ బాకీలు చెల్లించకుండా తప్పించుకుంటూ వస్తోంది. వాస్తవానికి ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా పౌరసరఫరాల సంస్థ లక్ష్యం విధించుకుంది. తీరా ఫిబ్రవరి ముగిసేనాటికి 6.90లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించి చేతులెత్తేసింది. ఈ మొత్తం ధాన్యం కొనుగోలు విలువ రూ.1410 కోట్లు. అయితే రైతులకు మాత్రం చెల్లించే డబ్బులు తరచూ బాకీ లు పెడుతూ వస్తోంది. అక్టోబరులో ధాన్యం ఇచ్చిన వారికి నవంబరులో కొంచెం, డిసెంబరులో ఇచ్చిన వారికి ఫిబ్రవరిలో సగం చొప్పున చెల్లించారు. ఇక సీజన్ ముగింపు అయిన ఫిబ్రవరిలో ధాన్యం ఇచ్చిన వారిలో సగం మందికిపైగా అన్నదాతలకు ఇంకా డబ్బులే జమ చేయలేదు. దీంతో అన్నదాతలు మునుపెన్నడూ లేనివిధంగా ఇబ్బంది పడుతున్నారు. గతనెల్లో సీతానగరానికి చెందిన ఓ రైతు ఏకంగా ప్రభుత్వం నుంచి ధాన్యం బాకీలు అందలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోనసీమకు చెందిన అన్నదాతలు రోజూ కలెక్టరేట్‌కు వచ్చి నిరసనలకు దిగాల్సి వచ్చింది. ఇంత జరిగినా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. యాథివిథిగా బా కీలు పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి గత నెలలో ధాన్యం సేకరణ ప్రక్రియను పౌరసరఫరాల సంస్థ అర్ధాంతరంగా ముగించేసింది. ఇంకా ధాన్యం కొంటే బకాయిలు పేరుకుపోతాయన్న భయం ఒకటైతే, తడిచిన ధాన్యం ఎక్కడ కొనుగోలు చేయాల్సి వస్తుందోనన్న కారణం ఇంకోటి. ఇది జరిగి నెలదాటినా ఇప్పటికీ ప్రభుత్వం ధాన్యం బకాయిల ఊసెత్తడం లేదు. జిల్లా రైతులకు ఇంకా రూ.163 కోట్ల వరకు జమ కావలసి ఉంది. దీంతో ఏడు వేల మంది రైతులు ఇబ్బందిపడుతున్నారు. వీరిలో అధికంగా రామచంద్రపురం, మండపేట, ఆలమూరు, బిక్కవోలు, కాజులూరు, కరప, పిఠాపురం, యు.కొత్తపల్లి, కోనసీమలోని అనేక మండలాల రైతులు ఉన్నారు. అసలు ఈ డబ్బులు ఇప్పట్లో వస్తాయో రావో కూడా తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోపక్క ఇప్పటికే రబీ మొదలైపోయింది. ఇప్పుడు ధాన్యం డబ్బులు చేతికి అందితేనే రబీకి పెట్టుబడి దొరుకుతుంది. కానీ డబ్బులు రాక బయట నుంచి మళ్లీ అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా ఖరీఫ్ లక్ష్యా నికి చేరుకోకుండానే అధికారులు సేకరణ ముగించేయడంతో రంగుమారిన ధాన్యం ఏం చేసుకోవాలో తెలియక అనేకమంది రైతులు చేసేదిలేక మిల్లులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. బకాయిలపై పౌరసరఫరాల సంస్థ డీఎంను వివరణ కోరితే ఆలస్యమైన మాట వాస్తవమేనని, కానీ త్వర లో ఖాతాల్లో జమవుతాయని ఆయ న పేర్కొన్నారు.