కష్టపడండి.. మనదే అధికారం!

ABN , First Publish Date - 2022-07-01T09:19:55+05:30 IST

తెలంగాణను చుట్టేసిన బీజేపీ జాతీయ నాయకుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలివి.

కష్టపడండి.. మనదే అధికారం!

  • అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు నిధులు..
  •  అయినా, పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలం
  • బూత్‌ స్థాయి కార్యకర్తలకు మోదీలుగా మారే చాన్స్‌.. 
  • జిల్లాల్లో బీజేపీ జాతీయ స్థాయి నేతల పిలుపులు


అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి పక్షపాత వైఖరి లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో వాటిని ప్రజలకు అందించడంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే పదవులు వచ్చాయి. సామాన్య ప్రజలకు ఉండడానికి కనీసం ఇళ్లు కూడా లేవు. 

- సూర్యాపేటలో కేంద్ర మంత్రి వీకే సింగ్‌ 


గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను విడుదల చేస్తోంది. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు, మరుగుదొడ్లు, గృహ నిర్మాణాలతోపాటు ప్రాథమిక వైద్యానికి ఈ నిధులు వెచ్చిస్తోంది. ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తోంది.

- నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లిలో కేంద్ర మంత్రి ఫగన్‌ సింగ్‌ 


బూత్‌ స్థాయిలో పని చేసిన కార్యకర్తలు భవిష్యత్తులో మోదీలుగా మారే అవకాశం కేవలం బీజేపీలోనే ఉంది. ఒక్కో కార్యకర్త పదిమంది కార్యకర్తలను తయారు చేయాలి. యూపీని అరాచక శక్తుల నుంచి కాపాడాం. తెలంగాణలో కూడా బీజేపీ వస్తేనే ఇక్కడి అరాచకాలు అంతమవుతాయి.

- ఖైరతాబాద్‌లో యూపీ మంత్రి స్వతంత్ర దేవ్‌ సింగ్‌


తెలంగాణను చుట్టేసిన బీజేపీ జాతీయ నాయకుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలివి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారంతా తెలంగాణలో వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో గురువారం విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, మోర్చాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదాదికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పుర ప్రముఖులు, వ్యాపారులతో భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లలో భోజనాలు చేశారు. వివిధ గ్రామాల్లో.. అక్కడి దళిత వాడల్లో పర్యటించారు. వెరసి, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతుంటే.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన పార్టీకి ఊపు తీసుకు రావడానికి తమ వంతు కృషి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికార టీఆర్‌ఎ్‌సపై విమర్శలు గుప్పించారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఛత్తీస్‌గఢ్‌ తరహాలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం శక్తి కేంద్రాల ద్వారా మన్‌ కీ బాత్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పలువురు కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలను చుట్టేశారు. ‘‘బీజేపీని ఇందిరా గాంధీయే ఏమీ చేయలేకపోయింది. కేసీఆర్‌ ఎంత!? 2023లో జరగనున్న యుద్ధంలో గెలవాలంటే తెగించి కొట్లాడాలి. 


ఇందుకు బూత్‌ కమిటీలు కీలకంగా పని చేయాలి’’ అని గజ్వేల్‌ పట్టణంలో జార్ఖండ్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దీపక్‌ ప్రకాశ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని మాజీ ముఖ్యమంత్రులు విజయ్‌ రూపానీ, తీరథ్‌సింగ్‌ రావత్‌, జగదీశ్‌ షెట్టర్‌ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో రావత్‌, దేవరకద్రలో షెట్టర్‌, జడ్చర్లలో రూపానీ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. వాటిని ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ పోరాటంలో 1200 మంది బలిదానాలు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ బంగార తెలంగాణను తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ ఆదిలాబాద్‌లో మండిపడ్డారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, భద్రాచలంలో కేంద్ర మాజీ మంత్రి జుయల్‌ ఓరం, మంచిర్యాలలో కేంద్ర విద్యా శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృషన్‌ లాల్‌ గుజ్జర్‌; వరంగల్‌ తూర్పులో కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, జగిత్యాల జిల్లా ధర్మపురిలో కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌, మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తదితరులు పర్యటించారు. మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. మహబూబాబాద్‌లో జార్ఖండ్‌ మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ పాల్గొన్న సభలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌ నాయక్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను పరుష పదజాలంతో దూషించారు. టీఆర్‌ఎస్‌ నేత ఫిర్యాదు మేరకు ఆయనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘కేసీఆర్‌లా మేం ఫాంహౌ్‌సలో ఉండే నేతలం కాదు. జనం గుండెల్లో ఉన్న నేతలం’’ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ వనజీవి రామయ్య ఇంటికి వెళ్లి రామయ్య దంపతులను పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంటున్న గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన సంఘాలు, మహిళలతో బీజేపీ నేతలు సమావేశమవుతున్నారు. వారిని సమీకరించి మోదీ సభకు పెద్దఎత్తున వచ్చేందుకు కృషి చేస్తున్నారు.


నేడూ నియోజకవర్గ పర్యటనలు

హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్న పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సందీప్‌ పాత్రా సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. బీజేపీ నేతల నియోజక వర్గ పర్యటనలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో యూపీ ఎమ్మెల్యే సందీ్‌పసింగ్‌, సిద్దిపేట నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్‌ నేత సువేందు అధికారి పర్యటించనున్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంటులో బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ తేజస్వి సూర్య పర్యటన కొనసాగనుంది. పాతబస్తీలోని నియోజకవర్గాల్లో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన ఉండడం గమనార్హం. బహదూర్‌పురలో బీజేపీ సీనియర్‌ నేత సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం, యాకత్‌పురలో కేకే శర్మ, చాంద్రాయణగుట్టలో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కార్వాన్‌లో కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్‌, గోషామహల్‌లో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ పర్యటించనున్నారు. కాగా, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్న బీజేపీ ముఖ్యమంత్రులకు నియోజకవర్గాల్లో పర్యటన నుంచి మినహాయింపు ఇచ్చారు. భద్రత సమస్య దృష్ట్యా మినహాయించాలని నిర్ణయించారు.

Updated Date - 2022-07-01T09:19:55+05:30 IST