Kuwait లోని 60ఏళ్లకు పైబడిన వలసదారులకు పండగలాంటి వార్త.. ఆ నిర్ణయం రద్దు!

ABN , First Publish Date - 2021-10-08T15:51:08+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో ఉపాధి పొందుతున్న 60ఏళ్లకు పైబడిన వలసదారులకు గుడ్‌న్యూస్.

Kuwait లోని 60ఏళ్లకు పైబడిన వలసదారులకు పండగలాంటి వార్త.. ఆ నిర్ణయం రద్దు!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో ఉపాధి పొందుతున్న 60ఏళ్లకు పైబడిన వలసదారులకు గుడ్‌న్యూస్. యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని 14 నెలల క్రితం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని ఆ దేశ మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది. ఈ కేటగిరీ ప్రవాసులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేయడం నిషేధించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వెల్లడించింది.


2020 ఆగస్టులో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జారీ చేసిన నిర్ణయం చట్టబద్ధంగా ఉనికిలో లేదని, అసలు పీఏఎం డైరెక్టర్‌కు ఈ నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదని పేర్కొంది. వర్క్ పర్మిట్ల జారీకి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు, విధానాలు ఉన్నాయని తెలిపింది. ఎవరి ఇష్టానికి వారు నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఈ సందర్భంగా ఫత్వా, లెజిస్లేషన్ విభాగం మండిపడింది. 


ఇక కువైత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధిపతి ముహమ్మద్ జాసిమ్ అల్ సాకర్ నేతృత్వంలో గత కొన్నిరోజులుగా ఈ సమస్యపై పీఏఎంతో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయిన మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయడం చట్టబద్ధంగా చెల్లదని, వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించింది.


కాగా, 14 నెలల క్రితం పీఏఎం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలా చేయడం వల్ల మంచి నైపుణ్యం ఉన్న కార్మికులను కువైత్ కోల్పోతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. చివరకు నిపుణుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసింది. దీంతో ఈ కేటగిరీకి చెందిన ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. 2017లో తీసుకొచ్చిన కువైటైజేషన్‌ పాలసీలో భాగంగానే కువైత్ ప్రభుత్వం ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం విదితమే.   

Updated Date - 2021-10-08T15:51:08+05:30 IST