నిజాయితీగా పనిచేశాం

ABN , First Publish Date - 2022-05-29T08:32:22+05:30 IST

గడిచిన ఎనిమిదేళ్లలో తాము అత్యంత నిజాయితీతో పనిచేశామని, ప్రజలు సిగ్గుతో తలదించుకునే ఏ ఒక్క పనినీ తాము చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

నిజాయితీగా పనిచేశాం

ఎనిమిదేళ్లలో ప్రజలు సిగ్గుపడే ఏ పనీ చేయలేదు.. పేదలు, దళితులు, ఆదివాసీలకు పెద్దపీట

గుజరాత్‌ పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి

30 నుంచి దేశంలో

8వ వార్షికోత్సవ సంబరాలు


రాజ్‌కోట్‌/సిమ్లా, మే 28: గడిచిన ఎనిమిదేళ్లలో తాము అత్యంత నిజాయితీతో పనిచేశామని, ప్రజలు సిగ్గుతో తలదించుకునే ఏ ఒక్క పనినీ తాము చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలలు గన్న దేశాన్ని సాకారం చేసేందుకు అడుగులు వేసినట్టు తెలిపారు. ముఖ్యంగా పేదల సంరక్షణకు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ నెల 26తో ప్రధానిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ.. తన పాలనకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. శనివారం గుజరాత్‌లో పర్యటించిన ఆయన రాజ్‌కోట్‌ జిల్లాలోని అట్కోట్‌ నగరంలో పటీదార్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 పడకలతో కూడిన ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ, పాలన విషయంలో తాము ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. ‘‘ఏ ఒక్కవ్యక్తి లబ్ధి కోసం.. నేను పనిచేయలేదు. ముఖ్యంగా ప్రజల్లో ఏ ఒక్కరూ సిగ్గుపడేలా వ్యవహరించలేదు. గత ఎనిమిదేళ్లలో నిజాయితీతో పనిచేశాం. దేశపునర్నిర్మాణానికి, గాంధీ, పటేల్‌ కలల సాకారానికి అడుగులు వేశాం’’ అని వివరించారు. దళితులు, పేదలు, ఆదివాసీలు, మహిళల సాధికారత కోసం.. గాంధీ కలలు గన్నారని.. స్వచ్ఛత, పరిశుభ్రత, ఆరోగ్యం వంటివాటిని స్వప్నించారని.. స్వదేశీ ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా పుంజుకోవాలని అభిలషించారని.. తమ ప్రభుత్వం ఆ దిశగానే పనిచేసిందని మోదీ చెప్పారు.


గత ఎనిమిదేళ్లలో 3 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించామన్న ప్రధాని, 10 కోట్ల మంది బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలికేలా.. సొంత మరుగుదొడ్లు నిర్మించినట్టు తెలిపారు. 9 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యానికి భద్రత కల్పించామన్నారు. 2.5 కోట్ల మంది కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు, 6 కోట్ల మందికి కుళాయి కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. పీఎంజేఏవై ద్వారా 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పించినట్టు చెప్పారు. ‘‘ఇవన్నీ కేవలం లెక్కలు కాదు. మా నిబద్ధతకు నిదర్శనాలు. పేదలు గర్వంగా జీవించేలా చేశాం’’ అని ప్రధాని అన్నారు. ‘సబ్‌కాసాథ్‌, సబ్‌కావికాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ మూల మంత్రంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కరోనా సమయంలో పేదలు ఎవరూ ఆకలితో మరణించకూడదనే లక్ష్యంతో ఆహార ధాన్యాలను పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, ప్రతి ఒక్కరికీ ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ‘‘పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదు. టీవీల్లో చూసి తెలుసుకోలేదు. క్షేత్రస్థాయిలో వారి పరిస్థితిని చూసి తెలుసుకున్నా’’  అన్నారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం గుజరాత్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందన్నారు. 2014కు ముందు ప్రభుత్వానికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదని మోడీ గత యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 


అన్ని రాష్ట్రాల సీఎంలతో భేటీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా భేటీ కానున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రారంభించనున్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్‌ తెలిపారు. ఇదిలావుంటే, మోదీ ప్రభుత్వ ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు నిర్వహించే పలు కార్యక్రమాల్లో మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ తెలిపారు. 

Updated Date - 2022-05-29T08:32:22+05:30 IST