కూలీలు కావలెను..!

ABN , First Publish Date - 2022-05-16T06:21:36+05:30 IST

ఇటీవల కాలంలో కూలీల కొరత అన్నివర్గాల వారిని తీవ్రంగా వేధిస్తోంది. అధికరేట్లు చెల్లిస్తామన్నప్పటికీ కష్టించి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

కూలీలు కావలెను..!

  వేధిస్తున్న కూలీల కొరత
 వరి కోతలకు తప్పని అవస్థలు
 ‘ఉపాధి’ వైపు వ్యవసాయ కూలీలు
  నిర్మాణ రంగానిదీ అదే పరిస్థితి
  అధిక రేట్లు ఇచ్చినా దొరకని వర్కర్లు
  ఉపాధి పనులకూ వెళ్లడం లేదు
  వేసవి తీవ్రతతో ఇంటికే పరిమితమవుతున్న శ్రామిక వర్గం

(ఆంధ్రజ్యోతి-అమలాపురం): ఇటీవల కాలంలో కూలీల కొరత అన్నివర్గాల వారిని తీవ్రంగా వేధిస్తోంది. అధికరేట్లు చెల్లిస్తామన్నప్పటికీ కష్టించి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో నిత్యం జరగాల్సిన ఎన్నో కీలకమైన పనులకు అవరోధం ఏర్పడుతోంది. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు సైతం జిల్లాలో నిర్ణయించిన టార్గెట్ల ప్రకారం ఆయా మండలాల్లో కూలీలు రావడం లేదు. మస్తర్లతో రికార్డులు సరిపెట్టుకోవల్సిన పరిస్థితి అధికారులకు ఏర్పడింది. ముఖ్యంగా దాళ్వా సీజన్‌లో వరికోతలకు కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధించింది. మహిళా కూలీకి రూ.300 నుంచి రూ.400, మగ కూలీకి రూ.600 నుంచి రూ.700 ధర చెల్లిస్తామన్నా గ్రామీణ ప్రాంతాల్లో దొరకని పరిస్థితి. బయటి ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు రోజుకు రూ.వెయ్యి వంతున చెల్లి ంచాల్సి వస్తో ంది. లక్షలలో కూలీలు ఉన్నారని గణాంకాలు చూపుతున్నప్పటికీ మారుతున్న కాలానుగుణంగా కూలీ పనులు చేసేందుకు ఆయా కుటు ంబాల వారు నిరాకరిస్తుండటంతో వారి కొరత తీవ్రమైంది.  వ్యవసాయ సీజన్‌లోనే ఉపాధి పనులు చేపడుతున్న కారణంగా ఈ కొరత తీవ్రమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలీలను వ్యవసాయ సీజన్‌ సమయంలో రైతులకు అనుసంధానం చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడంలేదు. వ్యవసాయ పనులతో పాటు భవన నిర్మాణ కార్మికులు, సామిల్లులో పనిచేసే శ్రామికులు, వివిధ జట్లలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే వారు వేసవి సీజన్‌ కావడంతో పనుల్లోకి రావడం లేదు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం అటు తాపీమేస్త్రిలు, ఇటు కూలీల కారణంగా కుదేలవుతుందనే చెప్పాలి. ఎన్నో నిర్మాణాలు ఈ సమస్యలు కారణంగా నిలిచిపోతున్నాయని పలువురు బిల్డర్స్‌ ఆవేదన చెందుతున్నారు. తాపీమేస్త్రికి రూ.800 నుంచి రూ.900, హెల్పర్‌కు రూ.600 చెల్లిస్తున్నా పనుల్లోకి రాకపోవడం వల్ల వందల కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు స్తంభించిపోతున్నాయి. ముఖ్యంగా ఇసుక లోడింగ్‌, కంకర లోడింగ్‌, ఐరన్‌ లోడింగ్‌ వంటి అనేక రంగాల్లో పనిచేసే జట్టు కార్మికులు కూడా ముందుకు రాకపోవడంతో ఆయా వ్యాపార సంస్థలను మూసివేసే పరిస్థితులు కోనసీమ వ్యాప్తంగా నెలకొన్నాయి. కూలీ అడిగినంత వేతనం ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్న తీరు తమను ఆవేదనకు గురిచేస్తుందని పలువురు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరత కోనసీమ జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న ప్రజలను వేధిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో  సైతం కూలీల కొరత అధికంగా కనిపిస్తోంది. కోనసీమ స్థాయిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఆధ్వర్యంలో లక్ష మందికి పనులు కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం వివిధ మండలాల్లో 55వేల నుంచి 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని డ్వామా పీడీ ముఖలింగం తెలిపారు. అయితే వాస్తవానికి ఉపాధి హామీపనులు అక్కడక్కడా మొక్కుబడిగానే జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. కూలీలు ఉదయాన్నే మస్తరు వేయించుకుని ఇతర పనుల్లోకి వెళుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండుపూటలా పని విధానాన్ని అమలు చేస్తుండడంతో కూలీలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుత వేసవి సీజన్‌లో ఉపాధిహామీ పథకం కింద రోజుకు లక్ష మందికి పనులు కల్పించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పంటకాల్వల మూసివేత జరిగినందున కాల్వలు ఆరిన వెంటనే రోజుకు 80వేల మందికిపైగా కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీడీ ముఖలింగం తెలిపారు.

Updated Date - 2022-05-16T06:21:36+05:30 IST